Heavy Rain Alert : వాయుగుండంగా బలపడిన అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
Heavy Rain Alert : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. దీంతో తెలుగు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Heavy Rain Alert
Heavy Rain Alert : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది బాలాసోర్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు, చాంద్‌బలికి ఈశాన్యంగా 60 కిలోమీటర్లు, దిఘాకు దక్షిణ-నైరుతిగా 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఈ వాయుగుండం రాబోయే 24గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ బాలాసోర్ సమీపంలో చాంద్‌బలి-దిఘా మధ్య ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. అనంతరం మరో 24 గంటల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల వైపు పయనించనుంది.
ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పరిసర ప్రాంతాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు-మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
సముద్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్న వారు వెంటనే సురక్షితంగా తీరానికి చేరుకోవాలని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
