ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పవన్‌ కల్యాణ్ ఫస్ట్‌ స్పీచ్‌.. ఏం మాట్లాడారంటే..?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా శాసనసభలో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పవన్‌ కల్యాణ్ ఫస్ట్‌ స్పీచ్‌.. ఏం మాట్లాడారంటే..?

deputy cm pawan kalyan first speech in andhra pradesh assembly

Updated On : June 22, 2024 / 12:45 PM IST

pawan kalyan first speech in assembly: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా శాసనసభలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఎంతో అనుభవమనున్న అయ్యన్నపాత్రుడు స్పీకర్ స్థానంలో కూర్చోవడం ఆనందంగా ఉందన్నారు.

దశాబ్దాలుగా అయ్యన్నపాత్రుడి మాటల వాడీవేడీ రాష్ట్ర ప్రజలు చూశారని, స్పీకర్ గా ఇప్పుడు ఆయన హుందాతనాన్ని చూస్తారన్నారు. సభలో ఇక ఆయనకు తిట్టే అవకాశం లేదని, సభ్యులెవరైనా తిడుతుంటే స్పీకర్ స్థానంలో ఉన్న ఆయనే నియంత్రించాల్సి ఉంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు ఉండేవని.. బూతులు, దూషణలతో రాష్ట్రాభివృద్ధిని వెనక్కి నెట్టారని విమర్శించారు. సంస్కారహీనమైన భావనలను నియంత్రించాలని స్పీకర్ కు సూచించారు. గెలుపును స్వీకరించినట్టు ఓటమిని వైసీపీ స్వీకరించలేకపోయిందని, అందుకే అసెంబ్లీ నుంచి పారిపోయిందని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. సభలో నవ్వులు పూయించిన పవన్ కల్యాణ్..

”భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష మనుషులను కలపడానికి గానీ విడగొట్టడానికి కాదు. భాష విద్వేషం రేపడానికి కాదు, పరిష్కరించడానికి.
ఎంత జటిలమైన సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. సభ హుందాతనాన్ని కాపాడి, భవిష్యత్ తరాలకు ప్రామాణికంగా నిలపాలి. విభేదించడం అంటే ద్వేషించడం కాదు. వాదించడం అంటే కొట్టుకోవడం కాదు. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి మౌలికమైన పదాలు. సభలో ప్రజాసంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి. వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి. వ్యక్తిగత దూషణలకు తావు ఉండకూడద”ని పవన్ కల్యాణ్ అన్నారు.