పిఠాపురం ప్రజల ముందు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన పవన్ కల్యాణ్

ప్రజలు గుప్పెడంత గుండె ఇస్తే, హిమాలయాల అంత ఎత్తుకు ఎదిగానని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Deputy CM Pawan Kalyan: ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా జనసేన పార్టీకి వందశాతం విజయం అందించారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ అన్నారు. ఉప్పాడలో బుధవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజలు గుప్పెడంత గుండె ఇస్తే, హిమాలయాల అంత ఎత్తుకు ఎదిగానని వ్యాఖ్యానించారు. పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందంటూ ఎమ్మెల్యేగా ప్రజల ముందు ప్రమాణం చేశారు.

”నన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయబోమన్నారు. అసెంబ్లీ గేటు తాకడం కాదు, బద్దలు కొట్టుకుని వెళ్లాం. పిఠాపురంలో గెలిస్తే ఇక్కడ ఉండనని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ఈరోజు 3 ఎకరాలు కొని పిఠాపురం వాస్తవ్యుడిగా మారిపోయాను. అరాచక ప్రభుత్వాన్ని 11 స్థానాలకు కుదించి మట్టిలో కలిపేశారు. వ్యవస్థల్లో లోపం లేదు, వ్యవస్థలను నడిపించేవారిలో లోపం ఉంది. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం. గత ప్రభుత్వం ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసింది.

Also Read : 5 కోట్ల మంది ఆంధ్రులు ఏం పాపం చేశారు?: కంటతడి పెట్టిన సీఎం చంద్రబాబు

పిఠాపురంలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం. ఉప్పాడ తీరంలో 18 నెలల్లో సముద్రం కోతను ఆపి, టూరిజం డెవలప్ చేస్తాం. యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలు తీసుకొస్తాం. మీరిచ్చిన నమ్మకాన్ని వమ్ముచేయం. సమస్యల పరిష్కారానికి మాకు కొంత సమయం ఇవ్వండి. పిఠాపురం అభివృద్ధి భారతదేశానికి మోడల్‌గా చేస్తాం. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు తీసుకొచ్చే బాధ్యత చంద్రబాబు, నేను తీసుకుంటాం. పదవి ఉన్నా, లేకున్నా రాజాలాగానే ఉంటాన”ని పవన్ కల్యాణ్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు