Eluru Govt Hospital : ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. ఆపరేషన్ తర్వాత మహిళ కడుపులో కత్తెర వదిలేసి కుట్లేసిన వైద్యులు
పొరపాటున కత్తెరను కడుపులో పెట్టి కుట్లు వేశారని చెప్పారు. ఆగస్టు8వ తేదీన మహిళ కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారని తెలిపారు. కడుపులో కత్తెరను గుర్తించి వెంటనే విజయవాడ ఆస్పత్రికి పంపించామని పేర్కొన్నారు.

Eluru Govt Hospital
Eluru Govt Hospital Doctors : ఏపీలోని ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఆపరేషన్ తర్వాత మహిళ కడుపులో కత్తెర వదిలేసి వైద్యులు కుట్లు వేశారు. అప్పటి నుంచి బాధితురాలు కడుపు నొప్పితో బాధపడుతున్నారు. కడుపులో కత్తెర ఉన్నట్లు ఎక్స్ రేలో వైద్యులు గుర్తించారు. అయితే ఆస్పత్రి రికార్డు నుంచి బాధితురాలి వివరాలు మాయం అయ్యాయి.
వారం క్రితం కాన్పు కోసం ఓ గర్భిణీ ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు సిజేరియన్ చేసి పండంటి బిడ్డను బయటకు తీశారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆపరేషన్ తర్వాత మహిళ కడుపు నొప్పితో బాధపడ్డారు. దీంతో వైద్యులు ఎక్స్ రే తీయించడంతో కడుపులో కత్తెర ఉన్నట్లుగా గుర్తించారు.
Kurnool: ఏపీలో దారుణం.. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి ప్రాణాలతో చెలగాటమాడిన డాక్టర్లు
అయితే, ఈ ఘటన బయటకు రాకుండా డాక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఆ ఎక్స్ రే ఫొటోలు ఓ ఉద్యోగి తన ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాల్లో పోస్టు చేయడంతో ఈ వ్యవహారం మొత్తం బయటికి వచ్చింది. విషయం బయటకు రావడంతో ఆస్పత్రి రికార్డు నుంచి బాధితురాలి వివరాలను మాయం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంపై బాధితురాలి కుటుంబసభ్యులు మండిపడుతున్నారు.
ఈ మేరకు బుధవారం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ శశిధర్ 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. బాధితురాలు, ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 19వ తేదీన ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఎస్ కొత్తపల్లి గ్రామానికి చెందిన వి.స్వప్న అనే మహిళ డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరారని తెలిపారు. మహిళకు సిజేరియన్ చేసి మగ బిడ్డను బయటకు తీశారని పేర్కొన్నారు.
ఆ సమయంలో పొరపాటున కత్తెరను కడుపులో పెట్టి కుట్లు వేశారని చెప్పారు. ఆగస్టు8వ తేదీన మహిళ కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారని తెలిపారు. కడుపులో కత్తెరను గుర్తించి వెంటనే విజయవాడ ఆస్పత్రికి పంపించామని పేర్కొన్నారు. అక్కడ ఆమెకు ఆపరేషన్ జరిగిందన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. ఘటనపై పూర్తి స్దాయిలో విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ పద్మ కూడా సీనియర్ వైద్యురాలని, ఎప్పుడు ఇటువంటి పొరపాట్లు చేయలేదని చెప్పారు. ఆపరేషన్ సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.