Tirumala Floods
Tirumala Floods : తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాలను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. తిరుమల, తిరుపతిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొందరు ఇతర ప్రాంతాల్లో తీసిన వీడియోలను తిరుమలలో తీసినట్లు ప్రచారం చేస్తున్నారని, తిరుమల వరదలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను, ఫేక్ వీడియోలను నమ్మొద్దని ఈవో జవహర్ రెడ్డి కోరారు. తిరుమలలో ఉన్న భక్తులు భయాందోళనకు గురికావద్దన్నారు.
తిరుమల, తిరుపతిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస, అన్నప్రసాదాలు ఏర్పాట్లు చేశామన్నారు. భారీ వర్షాల కారణంగా తిరుమల రెండు ఘాట్ రోడ్లలో దాదాపు పది ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండవ ఘాట్ రోడ్ లో కొండచరియల తొలగింపు పనులు పూర్తయ్యాయని ఈవో తెలిపారు. రోడ్డు శుభ్రం చేసిన తర్వాత వాహనాలను అనుమతిస్తున్నట్టు చెప్పారు.
Chandrababu: శపథాలు చేశారు.. సీఎంలు అయ్యారు.. జయలలిత, జగన్ తర్వాతెవరు..?
వర్షం తగ్గేవరకూ భక్తులు గదుల్లోనే ఉండొచ్చని చెప్పారు. రాకపోకలు సజావుగా సాగేవరకు భక్తులకు వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే అన్నప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరుపతిలో ఉండిపోయిన భక్తులు శ్రీనివాసం, పద్మావతి నిలయం, గోవిందరాజ స్వామి సత్రాలకి వెళ్లి బస పొందవచ్చని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి చెప్పారు.