durga temple flyover: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభ తేదీ ఖరారైంది. అక్టోబర్ 16న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్‌తో పాటు దేశవ్యాప్తంగా మరికొన్ని ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొననున్నారు.
వాస్తవానికి సెప్టెంబర్ 4నే దుర్గగుడి ఫ్లెఓవర్‌ను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు సంతాప దినాలు ఉన్నందున ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. ఆ తర్వాత సెప్టెంబర్ 18న ప్రారంభించాలని నిర్ణయించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకడంతో.. మళ్లీ వాయిదా పడింది.
కొన్ని దశాబ్దాలపాటు విజయవాడ నగరవాసులు దుర్గగుడి దగ్గర ట్రాఫిక్ ఇక్కట్లు పడ్డారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పూర్తి కావడంతో ఎట్టకేలకు విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరంలో 50 శాతం ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు దుర్గగుడి ఫ్లైఓవర్ తమ వల్లే సాధ్యమైందని టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి వారు క్రెడిట్ తీసుకుంటున్నారు. చంద్రబాబు హయంలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి గాలికొదిలేశారని.. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులను వేగవంతం చేసిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే దుర్గగుడి ఫ్లైఓవర్‌ను పూర్తి చేశామని అంటున్నారు. ఈ క్రెడిట్ సీఎం జగన్‌కే దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు.
నవంబర్ 2019 లో, ఫ్లైఓవర్ 2020 జనవరి చివరి నాటికి సిద్ధంగా ఉంటుందని అధికారులు చెప్పారు. కానీ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూనే ఉంది. 2.3 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌ను హైదరాబాద్, విజయవాడలను కలిపే జాతీయ రహదారి 65 వెంట రూ.447 కోట్ల వ్యయంతో నిర్మించారు. అప్రోచ్ రోడ్‌తో సహా మొత్తం 5.3 కిలోమీటర్ల దూరం ఈ ప్రాజెక్టులో ఉంది. ఈ రహదారి కుమ్మరిపాలెం దగ్గర ప్రారంభమై రాజీవ్ గాంధీ మునిసిపల్ పార్క్ దగ్గర ముగుస్తుంది. ప్రకాశం బ్యారేజీతో పాటు టెంపుల్ రోడ్, కెనాల్ రోడ్ మీదుగా వెళుతుంది.