ఏపీలోని ఈ మూడు జిల్లాలకు ఎస్పీల నియామకం.. ఈసీ ఆదేశాలు జారీ
Andhra Pradesh Sps: ఎన్నికల అనంతరం హింస చెలరేగిన మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.

Gowthami Sali, Malika Garg
Palnadu SP: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీలపై ఈసీ వేటు వేసిన విషయం విదితమే. ఈ మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం శనివారం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్ లత్కర్ నియమితులయ్యారు.
పల్నాడు జిల్లాకు మల్లికా గార్గ్, తిరుపతి జిల్లాకు హర్షవర్ధన్, అనంతపురం జిల్లాకు గౌతమి శాలి ఎస్పీగా నియమితులయ్యారు. కాగా, ఆయా జిల్లాల్లో ఎస్పీల నియామకం కోసం అర్హుల జాబితా పంపాలని ఇటీవలే ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది. ఎస్పీ స్థాయి ఐపీఎస్ అధికారులు లేరని సీఎస్ జవహర్ రెడ్డి 3 పోస్టులకు ఐదుగురి పేర్లను మాత్రమే పంపారు.
ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసి, ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లు చొప్పున పేర్లను ప్రతిపాదించాలని చెప్పింది. దీంతో చివరకు తొమ్మిది మంది పేర్లు పంపినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా జిల్లాలకు ఎస్పీల నియామకాన్ని ఎన్నికల సంఘం పూర్తి చేసింది.
డీజీపీతో సిట్ సారథి వినీత్ బ్రిజ్ లాల్ భేటీ
డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి వినీత్ బ్రిజ్ లాల్ శనివారం భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. పోలింగ్ అనంతరం హింస జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ ఇప్పటికే వెళ్లినట్టు డీజీపీకి వినీత్ తెలిపారు. ఇప్పటి వరకు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఆర్ఐలను ముందు సిట్ పరిశీలించనుందని చెప్పారు. FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా, లేక సెక్షన్లు మార్చాలా అనే దానిపై నిర్ణయం సిట్ తీసుకోనుందన్నారు. ఇప్పటి వరకు కేసులు కట్టక పోతే కొత్తగా FIRలను సిట్ నమోదు చేయించనుంది. కేసులు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు పురోగతి పరిశీలించి అరెస్టులపై సిట్ ఆరా తీస్తోంది. సిట్ పనితీరును డీజీపీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.
సిట్ అధికారులను కలిసిన వర్ల రామయ్య
డీజీపీ కార్యాలయంలో సిట్ ఉన్నతాధికారులను టీడీపీ నేత వర్ల రామయ్య కలిశారు. పోలింగ్ అనంతరం రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడులకు సంబంధించిన వివరాలను సిట్ అధికారులకు అందజేశారు. దర్యాప్తు ఎటువంటి ఒత్తిడి లేకుండా పారదర్శకంగా జరపాలని అధికారులను కోరారు. వైసీపీ నాయకులు చేసిన దాడులకు సంబంధించిన ఆధారాలు ఉన్న పెన్ డ్రైవ్ ని సిట్ అధికారులకు అందజేశారు.
Also Read: తీవ్రంగా ఖండిస్తున్నా.. తెలంగాణ మహిళలకు మోదీ క్షమాపణలు చెప్పాలి : టీపీసీసీ సీనియర్ నిరంజన్