Emmiganuru YSRCP: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీలో ముసలం ముదురుతోంది. వర్గ విభేదాలు పీక్‌కు చేరాయి. ఇప్పటికే రెండు గ్రూప్‌లు అక్కడ టికెట్ కోసం రచ్చకెక్కుతుంటే ..మరో నేత సెన్సేషనల్ కామెంట్స్ చేసి చర్చకు దారితీశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ మనవడు రాజీవ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ రచ్చకెక్కి వైసీపీ హైకమాండ్‌కు హెడెక్‌గా మారింది.
పోటాపోటీ బల ప్రదర్శనలు, అంతకు మించి విమర్శలు చేసుకోవడం చర్చకు దారితీస్తోంది. అయితే బుట్టా రేణుకాను ఈ మధ్యే ఎమ్మిగనూరు ఇంచార్జ్‌గా తప్పించి రాజీవ్‌రెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. అయినా కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్‌గా..ఎమ్మిగనూరులో పాగా కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు బుట్టా రేణుక. ఈ క్రమంలో మరో నేత తెరమీదకు వచ్చారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు ధరణిధర్‌రెడ్డి ఏకంగా వైసీపీ అధిష్టానం పెద్దలకు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు.
Also Read: టార్గెట్ ఫిక్స్.. ఏపీలో కమలం సరికొత్త స్ట్రాటజీస్..! కూటమిలో ఉంటూనే..
రాజీవ్‌రెడ్డికి ఎమ్మిగనూరు వైసీపీ ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో..ఇంటిపోరు రచ్చకెక్కింది. ఇన్నాళ్లు నివురు కప్పిన నిప్పులా ఉన్న..వైసీపీ ఇంచార్జ్ ఇష్యూ ధరణిధర్‌రెడ్డి కామెంట్స్‌తో హాట్ టాపిక్ అవుతోంది. ఎర్రకోట ఫ్యామిలీకి టికెట్ ఇస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు ధరణిధర్‌రెడ్డి. బుట్టా రేణుక, కేశవరెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి, రుద్రగౌడ్‌లలో ఎవరికి టికెట్ ఇచ్చినా తాను పోటీలో ఉండనని తేల్చి చెప్పారు. అలా కాదని..సీనియర్లు కాకుండా జూనియర్‌కు టికెట్ ఇస్తే చూస్తూ ఉరుకోమని.. అవసరమైతే 2029లో ఎమ్మిగనూరు నుంచి ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ హెచ్చరించారు.
ఎర్రకోట రాజీవ్‌రెడ్డి నియామకంపై వారు రగలిపోతున్నారా?
ఎమ్మిగనూరు వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఎర్రకోట రాజీవ్‌రెడ్డి నియామకంపై రగలిపోతున్నారు సీనియర్ లీడర్లు. జగన్ మోహన్ రెడ్డి ఎర్రకోట రాజీవ్‌రెడ్డికి టికెట్ ఇస్తే తాను స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానన్నారు ధరణిధర్‌రెడ్డి. జగన్ చెప్పినా ఆగే పరిస్థితి ఉండదని..ఎర్రకోట ఫ్యామిలీలో మూడో తరానికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాత, తండ్రి, ఇప్పుడు మనవడికి టికెట్ ఇస్తే తమ పరిస్థితి ఏంటంటూ నిలదీశారు. డబ్బులు ఖర్చు పెట్టుకున్న బుట్టా రేణుకకు టికెట్ ఇస్తే తమకు అభ్యంతరం లేదంటున్నారు ధరణిధర్‌రెడ్డి
అయితే బుట్టా రేణుక వర్సెస్ రాజీవ్‌రెడ్డి..మధ్య టికెట్ ఫైటే రచ్చ రచ్చగా మారింది. బలమైన రెడ్డి సామాజిక వర్గం అంతా తనవైపే ఉందని రాజీవ్ రెడ్డి..జగన్ డైరెక్షన్‌లోనే నడుస్తున్నానని బుట్టా రేణుక వాదిస్తున్నారు. ఇటు బుట్టా, అటు రాజీవ్‌రెడ్డి వర్గాలు ఆర్థికంగా బలంగా ఉండడం, రెండు వర్గాలకు అంతో ఇంతో ప్రజాబలం ఉండటంతో ఎవరినీ కాదనలేని పరిస్థితిలో పార్టీ అధిష్టానం ఉందట. అయితే సడెన్‌గా ధరణిధర్‌రెడ్డి రంగంలోకి దిగడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. బుట్టా రేణుకకు టికెట్ ఇస్తే ఓకే..రాజీవ్‌రెడ్డి బరిలోకి దిగితే..తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటూ ఆయనిచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు వైసీపీలో కలవరం సృష్టిస్తోందట.
బుట్టా రేణుకాకు టికెట్ ఇవ్వాలనా లేక..రాజీవ్‌రెడ్డి మీదున్న కోపంతోనే అధినేతకు అల్టిమేటం ఇచ్చారా అన్నది చర్చకు దారితీస్తోంది. 2024 ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుక పోటీ చేశారు. ఆ తర్వాత వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఏడాదిన్నరగా కొనసాగుతూ వచ్చారు. ఈ మధ్యే ఆమెను ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. అయినా రెండు వర్గాలు ఎవరికి వారే బల ప్రదర్శనకు దిగుతూ టికెట్ ఫైట్ చేస్తుంటే..మధ్యలో ధరణిధర్ రెడ్డి ఎంట్రీతో ఎమ్మిగనూరు వైసీపీలో ముసలం మరింత ముదిరినట్లు అయింది. ఈ వర్గపోరుకు వైసీపీ అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి మరి.