టార్గెట్ ఫిక్స్.. ఏపీలో కమలం సరికొత్త స్ట్రాటజీస్..! కూటమిలో ఉంటూనే..
అర్బన్ ఏరియాల్లో బీజేపీ పట్ల జనం సానుభూతితో ఉండటం కామనే. కానీ రూరల్ ఏరియాలో మాత్రం అంతంత మాత్రమే.
BJP: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు..దేశం మొత్తం బీజేపీ పాలిత రాష్ట్రాలుగా ఉండాలనేది కమలనాథుల కల. ఈ ఎజెండాతోనే 2014లో మోదీ పీఎ అయినప్పటి నుంచి..అయితే సొంతంగా..లేకపోతే కూటమి పక్షాలతో కలిపి ఒక్కో రాష్ట్రంలో జెండా పాతుతూ వస్తోంది బీజేపీ. అయితే ఏపీకి వచ్చేసరికి బీజేపీ డిఫరెంట్ సినారియోను ఫేస్ చేస్తోంది.
కూటమిలో భాగంగా ఉంది. కేంద్రంలో జనసేన, టీడీపీ మద్దతు కీలకమైంది. అయినా నవ్యాంధ్రలో సొంతంగా బలపడాలనే ఆకాంక్షను మాత్రం వదిలిపెట్టడం లేదు కమలం పార్టీ లీడర్లు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా అధికారం ఉండగానే పార్టీని బలోపేతం చేసుకునే ప్లాన్‌లో ఉన్నారట. జాతీయ నాయకత్వం డైరెక్షన్స్ ప్రకారం అడుగులు ముందుకు వేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు.
గత ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఎనిమిది ఎమ్మెల్యే, మూడు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఇక ఒక ఎమ్మెల్సీ పదవితో పాటు కొన్ని నామినేటెడ్ పోస్టులను ఆ పార్టీకి కూటమి పొత్తులో దక్కాయి. అలాగే రెండు రాజ్యసభ సీట్లు సొంతం చేసుకుంది. అయితే బీజేపీకి దక్కిన సీట్లు, నామినేటెడ్ పదవులు..పొత్తు వల్లనే అన్నది కమలనాథులతో పాటు ప్రజలందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్.
Also Read: ఒరేయ్ దమ్ముంటే నాతో ఫేస్ టు ఫేస్ రండ్రా: సినీనటి ప్రగతి
బీజేపీ 2014లో టీడీపీతో కలిసి 4 ఎంపీ, 4 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. 2019లో సింగిల్‌గా పోటీ చేసే సరికి ఓటు షేర్ ఒక్క శాతం కంటే పెద్దగా రాలేదు. 2024లో మళ్లీ పొత్తుతో కమలం మరోసారి సత్తా చాటింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నా..ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినా..ఏపీలో బీజేపీకి పట్టున్న ప్రాంతం ఏదంటే టక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. అర్బన్ ఏరియాల్లో బీజేపీ పట్ల జనం సానుభూతితో ఉండటం కామనే. కానీ రూరల్ ఏరియాలో మాత్రం అంతంత మాత్రమే. అయితే పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలాన్ని మరింత పెంచుకునేందుకు సరికొత్త వ్యూహాన్ని తెరమీదకు తెచ్చారు కమలనాథులు.
శ్రీకాకుళం విశాఖ దాకా..
బీజేపీ సీనియర్ నేత దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ శత జయంతి వేడుకలను పెద్దఎత్తున నిర్వహించి.. విద్యావంతులను, పట్టణ ప్రాంత వాసులను తమవైపు తిప్పుకోవాలని చూస్తోందట. దీంతో వాజ్ పేయ్ శత జయంతి పేరిట యాత్ర అనంతపురం నుంచి ప్రారంభమైంది. శ్రీకాకుళం నుంచి విజయనగరం, విశాఖ దాకా సాగనుంది. గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరులో కూడా ఈ యాత్ర నిర్వహించి 25న అమరావతిలో భారీ బహిరంగ సభతో ముగిస్తారట.
వాజ్ పేయ్ పాలన, పనిలో పనిగా మోదీ అడ్మినిస్ట్రేషన్‌ను వివరిస్తూ జనం మద్దతు కూడగట్టే వ్యూహరచన చేస్తోందట బీజేపీ. దీనికి కేంద్రమంత్రులను బీజేపీకి చెందిన ఇతర రాష్ట్రాల సీఎంలను తీసుకొస్తున్నారు. అలాగే బీజేపీ నేషనల్ లీడర్లను కూడా ఏపీకి రప్పిస్తూ ఇప్పుడు మోదీ నాయకత్వంలో, అంతకు ముందు వాజ్ పేయ్ పాలనలో దేశానికి జరిగిన అభివృద్ధి ఏంటి.? తీసుకొచ్చిన సంస్కరణలేంటి.? అన్నదానిపై వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
త్వరలో ఏపీలో జరగబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ తనదైన పావులు కదుపుతూ..కార్యాచరణను రూపొందిస్తోందట. ఎక్కువ సీట్లను తాము తీసుకోవడం ద్వారా గ్రౌండ్ లెవల్‌లో బలపడితే అది 2029 ఎన్నికలకు ప్లస్ పాయింట్ అవుతుందని లెక్కలు వేసుకుంటుంది. అప్పుడు కనీసం 20 సీట్ల దాకా పొత్తులో భాగంగా గెలుస్తామనేది కమలనాథుల అంచనా అంటున్నారు.
దీనికి తోడు ఈ మధ్యే ఏపీ బీజేపీ ఎంపీల మీట్‌లో ప్రధాని మోదీ చేసిన దిశానిర్దేశం కూడా పనిచేస్తుందని అంటున్నారు. ఏపీలో వైసీపీపై ఎటాక్ స్టార్ట్ చేయాలని మోదీ సూచించినట్లు చెబుతున్నారు. దీంతో వైసీపీ ఓటు బ్యాంకును తమవైపునకు తిప్పుకోవాలనేది బీజేపీ స్కెచ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఏపీలో బలపడేందుకు బీజేపీ వేస్తున్న మాస్టర్ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.
