పవన్ కల్యాణ్.. అదొక పెద్ద క్రైమ్, జాగ్రత్తగా ఉండండి..!- హర్షకుమార్ వార్నింగ్

మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని మీకు విశ్వ హిందూ పరిషత్ వాళ్లు నూరిపోశారా?

Harsha Kumar : ఇటీవల తిరుపతిలో సనాతన ధర్మం గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. మీరు చెప్పే సనాతన ధర్మానికి అర్థం ఏంటో చెప్పండి అంటూ పవన్ ను నిలదీశారు హర్షకుమార్. అదొక పెద్ద క్రైమ్ అంటూ పవన్ కల్యాణ్ ను ఆయన హెచ్చరించారు. మిమ్మల్ని ప్రజలు జోకర్ లా చూస్తున్నారని విమర్శించారు. ప్రజా జీవితంలో ఉన్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని పవన్ కు హితవు పలికారు హర్షకుమార్.

”సనాతన ధర్మం పేరు చెబుతూ ఊగిపోతూ రెచ్చిపోతూ పవన్ కల్యాణ్ కనిపించారు. అసలు సనాతన ధర్మం ఏంటో వివరించండి. సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పండి. ఒకవేళ హిందూ సనాతన ధర్మంలోని వర్ణ వ్యవస్థ, లేకపోతే పంచమ వ్యవస్థ.. ఈ పాత వ్యవస్థలన్నీ ఉండాలని మీరు కోరుకుంటున్నారా? లేక మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని మీకు విశ్వ హిందూ పరిషత్ వాళ్లు నూరిపోశారా? భారత రాజ్యాంగాన్ని కాదని మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి మీరు సనాతన ధర్మం అని అంటున్నారా? క్లారిటీ ఇవ్వండి పవన్.

Also Read : ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచిన కుర్చీలు, బల్లల పంచాయితీ..! అసలేంటీ వివాదం..

మనుధర్మ శాస్త్రాన్ని హిందువులే ఆచరించరు. మరి సనాతన ధర్మం ఏంటో మాకు చెబితే మాకూ కొంచెం క్లారిటీ ఉంటుంది. ఖమ్మం, కడప, కర్నూలు జిల్లాల్లో చాలా చోట్ల గుడిలోకి దళితులను రానివ్వరు. ఇప్పటికి కూడా. చాలా సంఘటనలు మీడియా ద్వారా బయటపడ్డాయి. ఇంకా ఈ పరిస్థితి ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చాకే అనుకుంటా.. సర్పంచ్ ఎలెక్ట్ అయితే గుడిలోకి వెళ్లి పూజలు చేశారని, ఆ సర్పంచ్ కి ఫైన్ వేశారు.

ఆ తర్వాత ఆఫీసర్లు అంతా వెళ్లి సెటిల్ చేశారు. ఆ సంఘటన గురించి మీ అందరికీ తెలుసు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు.. సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటూ మాట్లాడటంలో క్లారిటీ అన్నది మాకు కావాలి. హిందువుల ఆలయాల్లోకి రానివ్వకపోతే ఏం చర్యలు తీసుకోవాలో అన్నది కూడా పవన్ కల్యాణ్ చెప్పాలి” అని హర్షకుమార్ డిమాండ్ చేశారు.

”సనాతన ధర్మం అంటూ ఊగిపోతూ మాట్లాడితే ప్రజలు జోకర్ అనుంటారు తప్ప మరొకటి అనుకోవడం లేదు అన్నది పవన్ తెలుసుకోవాలి. పవన్ కల్యాణ్ జాగ్రత్తగా చూసుకోండి. మీరు ప్రజా జీవితంలో ఉన్నారు. మీరు రెచ్చగొట్టే విధానం చూస్తుంటే.. డిప్యూటీ సీఎం పదవికి మీరు అన్ ఫిట్. ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఒక మత ప్రచారకుడిలా వేషం వేసుకుని ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం అన్నది క్రైమ్. మీరు దాన్ని జాగ్రత్తగా సరి చేసుకోవాలని కోరుతున్నాం” అని హర్షకుమార్ అన్నారు.

”లడ్డూ కల్తీ జరిగిందా లేదా? కల్తీ జరిగింది అన్నదానికి సాక్ష్యాలు ఏంటి? ఆ సాక్ష్యాలు చంద్రబాబు దగ్గర లేవు కదా. కల్తీ జరిగింది అన్న సాక్ష్యం ఉండుంటే, కచ్చితంగా చంద్రబాబు చెప్పింది రైట్. గాలిలో అబద్దాల మేడలు కడుతున్న చంద్రబాబు.. ఈ ఒక్క ఇష్యూతో జగన్ ను క్లోజ్ చేద్దామని చంద్రబాబు ఒక ఎత్తు వేస్తే.. ఆ ఎత్తు తిప్పి ఆయనకే కొట్టింది. ఇటీవల ఒక భక్తుడు లడ్డూ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. సర్.. ఎలాంటి తేడా లేదు ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందని చెప్పాడు. నేను కూడా లడ్డూ ప్రసాదం తింటాను. నాకు కూడా ఎటువంటి మార్పు కనిపించలేదు. చంద్రబాబు సీఎం అయ్యాక లడ్డూలో కల్తీ లేదని, చాలా బాగుందని చెబుతూ అసత్య ప్రచారం చేస్తున్నారు.

తాను చెప్పింది నిజం చేయడానికి సిట్ వేశారు చంద్రబాబు. మరి నిజంగా ఆయన చెప్పింది నిజమే అయితే..ముందే సీబీఐ దర్యాఫ్తు కోరి ఉంటే సరిపోయేది. లడ్డూ విషయంలో సిట్ వేసి చంద్రబాబు తొందరపాటు అడుగు వేశారో.. సుప్రీంకోర్టు ఆ సిట్ ను అంగీకరించలేదు. ఒక స్వతంత్ర దర్యాఫ్తు సంస్థ వేసింది. సీబీఐ హెడ్ గా ఉంటూ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే అక్కడ కూడా చంద్రబాబుకు బాగా దెబ్బతగిలినట్లే. సనాతన ధర్మం పేరుతో పవన్ కల్యాణ్, లడ్డూల పేరుతో చంద్రబాబు.. హిందువుల మనోభావాలను రెచ్చగొట్టి మిగిలిన పార్టీలను భూస్థాపితం చేయాలని అనుకోవడం పొరపాటు. ప్రజలు పరిపాలన చూస్తారు.

మీ పరిపాలనలో ఇప్పటివరకు ఒక పెన్షన్, ఒక అన్న క్యాంటీన్లు తప్పించి చేసిందేమీ లేదు. ఇసుక ఎక్కడా దొరకడం లేదు. స్కాలర్ షిప్స్ ఇప్పటివరకు ఇవ్వలేకపోయారు. అనేక హామీలు ఇచ్చారు. అందులో ఏదీ కూడా చంద్రబాబు సక్సెస్ అవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఫెయిల్యూర్ గవర్నమెంట్. మూడు నాలుగు నెలల్లోనే ఫెయిల్డ్ గవర్న్ మెంట్ గా ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. వీటన్నింటిని కప్పి పుచ్చుకోవడానికి హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేందుకు వేసిన ప్లాన్లే లడ్డూలు, సనాతన ధర్మం. అటువంటి జిమ్మిక్కులు చేయకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరిపాలనపై దృష్టి పెట్టాలి” అని హర్షకుమార్ సూచించారు.