Ram Gopal Varma: నేనేమీ భయపడటం లేదు.. వీడియో విడుదల చేసిన ఆర్జీవీ.. సంచలన వ్యాఖ్యలు

ఏపీ పోలీసులు గాలిస్తున్న వేళ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వీడియోను విడుదల చేశారు. నేనేమీ భయపడం లేదు, వణికిపోవడం లేదు అంటూ..

Ram Gopal Varma

AP Police Case on Ram Gopal Varma: ఏపీ పోలీసులు రెండు రోజులుగా సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్టీవీ) కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలు ఆర్జీవీ కోసం వెతుకుతున్నాయి. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ కేసులకు భయపడి పరారయ్యాడంటూ తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. అయితే, తాజాగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఏడ్వడం లేదు.. వణికిపోవడం లేదు. పోలీసుల నోటీసులకు నేను సమాధానం ఇచ్చా. ప్రస్తుతం సినిమా షూటింగ్ లో ఉన్న. షూటింగ్ నిలిచిపోతే నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు హాజరుకాలేదు. అందుకే మళ్లీ సమయం అడిగా. ఏడాది క్రితం నేను ట్వీట్స్ పెట్టానని ఆరోపిస్తున్నారు, అవి ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట. నేను పెట్టిన వారికి కాకుండా వేరేవాళ్ల మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి. సంబంధంలేని వ్యక్తులు నాపై ఫిర్యాదులు చేశారు. ఏడాది క్రితం పోస్ట్ చేసిన ట్వీట్లకు వారంలోనే నన్ను విచారించాల్సిన అవసరం ఏముందని రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. రాజకీయ నేతలు పోలీసులను ఆయుధాల్లా ఉపయోగిస్తున్నారా?’ అంటూ వర్మ పేర్కొన్నారు.

Also Read: Ram Gopal Varma: అజ్ఞాతంలో ఆర్జీవీ.. ఏపీ పోలీసుల ముమ్మర గాలింపు.. ఆశ్రయం కల్పిస్తున్న ఆ సినీ హీరో ఎవరు?

సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తోపాటు నారా లోకేశ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ పోస్టులు పెట్టారు. ఈ మేరకు ఇటీవల రాంగోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాంగోపాల్ వర్మకు విచారణకు హాజరు కావాలని స్వయంగా హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు. రాంగోపాల్ వర్మ వారం రోజులు సమయం కావాలని కోరడంతో.. అందుకు అంగీకరించిన పోలీసులు ఈనెల 25న విచారణకు రావాలని సూచించారు. కానీ, ఆయన విచారణకు హాజరుకాకపోవటంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు సోమవారం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. వర్మ అందుబాటులో లేకపోవడంతోపాటు.. ఫోన్ స్విచ్చాఫ్ ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: Pawan Kalyan: సమోసాల కోసం గత వైసీపీ సర్కారు రూ.9 కోట్లు ఖర్చు పెట్టింది: పవన్ కల్యాణ్

హైదరాబాద్, తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలు రాంగోపాల్ వర్మ కోసం గాలిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆయన తాజాగా వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఓ మువీ షూటింగ్ లో ఉన్నానని, నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. మరోవైపు, ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో వర్మ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. తుదుపరి విచారణ ఇవాళ్టి (బుధవారం)కి వాయిదా వేసింది. అయితే, ఇవాళ కోర్టు బెయిల్ మంజూరు చేస్తే రాంగోపాల్ వర్మ అజ్ఞాతం వీడి బయటకు వచ్చే అవకాశం ఉంది.