Ram Gopal Varma: అజ్ఞాతంలో ఆర్జీవీ.. ఏపీ పోలీసుల ముమ్మర గాలింపు.. ఆశ్రయం కల్పిస్తున్న ఆ సినీ హీరో ఎవరు?

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లను ఉద్దేశిస్తూ రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారు.

Ram Gopal Varma: అజ్ఞాతంలో ఆర్జీవీ.. ఏపీ పోలీసుల ముమ్మర గాలింపు.. ఆశ్రయం కల్పిస్తున్న ఆ సినీ హీరో ఎవరు?

Ram Gopal Varma

Updated On : November 26, 2024 / 10:52 AM IST

Ram Gopal Varma: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే, ఏపీ పోలీసులు ఆయన కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్, తమిళనాడులో ఆర్టీవీ ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు హైదరాబాద్ లో రెండు బృందాలు, తమిళనాడులో రెండు బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఆర్జీవీ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆయనకు ఓ సినీ హీరో ఆశ్రయం కల్పిస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు.. సదరు హీరోతో ఆర్టీవీ ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. దీంతో ఆర్జీవీకి ఆశ్రయం కల్పించిన ఈ సినీ హీరో ఎవరనే విషయంపై రాజకీయ, సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు ఆర్టీవీ ఆచూకీ గుర్తించేందుకు ఏపీ పోలీసులు చెన్నై, ముంబై పోలీసుల సహకారం కోరనున్నట్లు తెలిసింది. అతను విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులుసైతం జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Also Read: ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో మళ్లీ బిజీ కాబోతున్నారా? జాగృతిని మళ్లీ ఎందుకు తెరమీదకు తెస్తున్నట్లు?

విచారణకు రావాలని రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ రాంగోపాల్ వర్మ హాజరుకాకపోవడంతో ప్రకాశం జిల్లా పోలీసులు సోమవారం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ అరెస్టు కాబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే, రాంగోపాల్ వర్మ ఇంట్లో లేడని తెలుసుకున్న పోలీసులు ఆయన పీఏతో పాటు ఆయన కార్యాలయం మేనేజర్ తో మాట్లాడారు. వర్మతో మాట్లాడి ఎక్కడ ఉన్నాడో సమాచారం తెలుసుకోవాలని పోలీసులు వారికి సూచించారు. అయితే, అప్పటికే ఆయన ఫోన్ స్విచాఫ్ చేసి ఉండటంతో ఉద్దేశపూర్వకంగానే తమను తప్పుదారి పట్టిస్తున్నారని భావించిన పోలీసులు ఆర్జీవీ కోసం హైదరాబాద్ తో పాటు.. తమిళనాడు రాష్ట్రంలోసైతం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Also Read: తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గీకరణ లొల్లి.. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న లీడర్లు ఎవరు?

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లను ఉద్దేశిస్తూ రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. అయితే, ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. గత నెలలో మద్దిపాడు పోలీసు స్టేషన్ లో వర్మపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఒంగోలు రూరల్ పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేసి నవంబర్ 19న ఒంగోలు రూరల్ సీఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు.  అయితే, రాంగోపాల్ వర్మ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో వారంరోజుల తరువాత విచారణకు హాజరవుతానని పోలీసులకు రాంగోపాల్ వర్మ సమాచారం అందించారు. ఈ క్రమంలో ఈనెల 25న విచారణకు హాజరు కావాలని పోలీసులు మరోసారి నోటీసులు పంపించారు. సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా వర్మ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. రాంగోపాల్ వర్మ తన నివాసంలో లేడని గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, వర్చువల్ విచారణకు హాజరుతారని రాంగోపాల్ వర్మ లాయర్ పేర్కొన్నప్పటికీ పోలీసులు అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.