ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో మళ్లీ బిజీ కాబోతున్నారా? జాగృతిని మళ్లీ ఎందుకు తెరమీదకు తెస్తున్నట్లు?

ఇప్పటికే హరీశ్, కేటీఆర్ మధ్య కోల్డ్‌ వార్ నడుస్తుందన్న ప్రచారం జరుగుతున్న వేళ కవిత మరో పవర్ సెంటర్‌గా మారుతున్నారన్న చర్చ తెరమీదకు వస్తోంది.

ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో మళ్లీ బిజీ కాబోతున్నారా? జాగృతిని మళ్లీ ఎందుకు తెరమీదకు తెస్తున్నట్లు?

BRS MLC Kavitha

Updated On : November 25, 2024 / 8:41 PM IST

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పొలిటికల్‌గా మళ్లీ యాక్టివ్‌ అవుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్‌ అయి..జైలు నుంచి రిలీజ్ అయినా తర్వాత కూడా ఇప్పటివరకు సైలెంట్‌గానే ఉంటూ వచ్చారు. హెల్త్ ఇష్యూస్‌తో ఇంటికే పరిమితమైన కవిత..ఇప్పుడు బీసీ నినాదంతో మళ్లీ లైమ్‌ లైట్‌లోకి వస్తున్నారు. రేవంత్‌ సర్కార్‌ను ఇబ్బంది పెట్టేందుకు ఓ బ్రహ్మాస్త్రాన్ని సిద్దం చేస్తున్నారు.

అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు-బీసీ హక్కుల సాధన ఎజెండాతో యూనైటెడ్ పూలే ఫ్రంట్‌, భారత జాగృతితో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. జైలుకు వెళ్లే ముందే పూలే ఫ్రంట్‌ను పెట్టారు కవిత. ఇప్పుడు మళ్లీ అదే ఎజెండాతో పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యేందుకు కవిత ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీసీ సంఘాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారట.

పూలే ఫ్రంట్‌తో పాటు రాష్ట్రంలో బీసీల సంఘాలతో భేటీ అవుతూ..సమస్యల పరిష్కారం కోసం వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ జాగృతిని కూడా మళ్లీ యాక్టివ్‌ చేసే యోచనలో కవిత ఉన్నట్టు సమాచారం. గతంలో తెలంగాణ జాగృతి పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ కవిత జైలుకెళ్లాక జాగృతి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు జాగృతిని మరోసారి యాక్టివ్‌ చేసేందుకు జాగృతి నేతలతోనూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత జోష్‌ వచ్చే అవకాశం
ఇప్పటికే ప్రజా సమస్యలపై పోరాడుతూ రేవంత్ సర్కార్‌పై కేటీఆర్‌, హరీశ్ రావు ఒత్తిడి పెంచుతున్నారు. సీఎం రేవంత్‌ను ప్రతి విషయంలోనూ ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలకు కవిత తోడైతే మరింత జోష్‌ వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే కేసీఆర్ సూచనలతోనే జైలు నుంచి వచ్చాక కవిత సైలెంట్‌గా ఉన్నారన్న టాక్ వినిపించింది. ఇప్పుడు మళ్లీ ఆమె యాక్టివ్‌ కావడం కూడా గులాబీ దళపతి వ్యూహంలో భాగమేనన్న చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం టార్గెట్ చేసిందని భావిస్తోంది గులాబీ దళం. ఏ సమయంలో..ఏ కేసులోనైనా కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ రెండు నెలలుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో కేసీఆర్‌ డైరెక్షన్‌లో భాగంగానే కవిత కార్యాచరణ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయి జైలుకు వెళ్తే కేటీఆర్ ప్లేస్‌ను కవితతో భర్తీ చేయాలని భావిస్తున్నారట. అటు కవిత.. అటు హరీశ్‌తో రేవంత్ సర్కార్‌ మీద పోరాడేలా వ్యూహ రచన చేస్తున్నారట గులాబీబాస్.

జైలు నుంచి రిలీజ్ అయి హైదరాబాద్‌ చేరుకున్నాక కవిత ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. తాను ముందే మొండిని..జైలుకు పంపి జగమొండిని చేశారు. తప్పకుండా పోరాడుతామంటూ కామెంట్స్ చేశారు కవిత. ఇప్పుడు ఆమె రేవంత్‌ సర్కార్ మీద, అటు మోదీ ప్రభుత్వ విధానాలపై ఎలా పోరు చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

కేంద్ర సర్కార్‌ను టార్గెట్ చేస్తూ కవిత ట్వీట్
జాతీయ స్థాయిలో అదానీ వ్యవహారం హాట్ హాట్‌గా మారడంతో కేంద్ర సర్కార్‌ను టార్గెట్ చేస్తూ కవిత ట్వీట్ చేశారు. అలాగే రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం సర్కార్ కులగణనను మొదలు పెట్టడం, బీసీ అజెండాకు బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇస్తుండటంతో ఇప్పుడు ఈ అంశంపైన కూడా ఎమ్మెల్సీ కవిత దృష్టి పెట్టారు. పూలే ఫ్రంట్ పేరుతో జాగృతి ఏర్పాటు చేసిన వేదికతోనే బీసీలకు చేరువయ్యేలా కార్యాచరణ అమలు చేసేందుకు రెడీ అయ్యారు.

ఈ నెల 29న బీఆర్ఎస్ నిర్వహిస్తున్న దీక్షా దివస్ సందర్భంగా నిజామాబాద్ లో జరిగే కార్యక్రమానికి కవిత హాజరు కానున్నారు. అదే రోజు నుంచి రెగ్యులర్‌గా ప్రజాక్షేత్రంలోనే క్రియాశీలకంగా ఉంటూ పోరుబాట పట్టాలని కవిత భావిస్తున్నారు. పొలిటికల్‌గా కవిత రీ ఎంట్రీపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు, ఇందూరు బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ మాత్రం ఫుల్‌ ఖుషీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే మరో చర్చ కూడా గులాబీ పార్టీలో వినిపిస్తోంది.

ఇప్పటికే హరీశ్, కేటీఆర్ మధ్య కోల్డ్‌ వార్ నడుస్తుందన్న ప్రచారం జరుగుతున్న వేళ కవిత మరో పవర్ సెంటర్‌గా మారుతున్నారన్న చర్చ తెరమీదకు వస్తోంది. అంతేకాదు జైలుకు వెళ్లే కంటే ముందు ఆమెతో కలసి నడిసిన నేతలు ఎవరూ ఇప్పుడు కవిత రీఎంట్రీపై అంతగా ఆసక్తి చూపడం లేదట. కవిత తెరవెనక ఉంటేనే పార్టీకి లాభం జరుగుతుందని..ఆమె లైమ్‌లైట్‌లోకి రావడం ద్వారా లిక్కర్ స్కామ్‌ విషయంలో మళ్లీ విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని గులాబీ లీడర్లు గుసగుసలు పెట్టుకుంటున్నారట. ఈ నేపథ్యంలో పొలిటికల్‌ యాక్టివ్‌ అవుతున్న కవిత పార్టీలో ఎలా నెట్టుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది.

RGV: చిన్న కేసుకే డేరింగ్‌ వర్మ ఎందుకు వణికిపోతున్నట్లు?