అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి దుర్మరణం.. బాధిత కుటుంబాలకు రూ.15లక్షల ఎక్స్ గ్రేషియా

ఇద్దరి పరిస్థితి క్రిటికల్ గా ఉందని అధికారులు చెప్పారు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం, కోటవురట్ల మండలంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సభవించి, మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి పోలీసులు, పైర్ సర్వీస్ సిబ్బంది చేరుకున్నారు.

అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని హోంమంత్రి అనిత పరిశీలించనున్నారు. హుటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఆమె రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.  అగ్నిప్రమాదం ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read: టీడీపీలో పదవుల జాతర మొదలైందా? మాకొక పదవి కావాలంటూ తెలుగు తమ్ముళ్ల ఆరాటం

హోమ్ మంత్రి అనిత జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు. బాధితుల ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకున్నారు. క్షతగాత్రుల పరిస్థితిపై చంద్రబాబుకు అధికారులు వివరాలు తెలిపారు. ఇద్దరి పరిస్థితి క్రిటికల్ గా ఉందని అధికారులు చెప్పారు.

పవన్, జగన్ స్పందన

అగ్ని ప్రమాదంపై పవన్ స్పందిస్తూ.. “అనకాపల్లి జిల్లా కోటవురట్ల దగ్గర బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున భారీ పేలుడు మూలంగా ఆరుగురు దుర్మరణం పాలయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

ప్రమాద ఘటన గురించి తెలియగానే రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనితతో ఫోన్లో మాట్లాడాను. ఘటన వివరాలు, బాధితుల పరిస్థితి గురించి తెలిపారు. అధికార యంత్రాంగం సత్వరమే స్పందించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటుంది.

బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటుంది. కొద్ది రోజుల కిందట అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు వెళ్ళిన సందర్భంలో విశాఖలో భారీ పరిశ్రమలతోపాటు చిన్న, మధ్య, సూక్ష్మ పరిశ్రమల్లో పర్యావరణ సంబంధిత అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలతోపాటు భద్రతపరమైన జాగ్రత్తల గురించి చర్చించాలని భావించాను. అత్యవసరంగా సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది. తదుపరి విశాఖ పర్యటనలో ఈ అంశంపై దృష్టిపెడతాను” అని పవన్ అన్నారు.

బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం బాధాకరమని అన్నారు. ప్రమాదం గురించి తెలిసి అధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.

అగ్ని ప్రమాదంపై మాజీ సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగన్‌ ఆదేశాల మేరకు ఘటనాస్థలికి వైసీపీ పార్టీ నాయకులు సహాయక చర్యల కోసం వెళ్లారు.