Andhra Pradesh : జగదాంబ ఇండస్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఏడుగురి పరిస్థితి విషమం

విశాఖపట్నంలోని జగదాంబ ఇండస్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో మంటలు చెలరేగాయి. దీంతో రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు.

Fire breaks out at Vizag hospital

Fire breaks out at Vizag hospital : విశాఖపట్నంలోని జగదాంబ ఇండస్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో మంటలు చెలరేగాయి. ఆస్పత్రి అంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో రోగులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది సహాయంతో రోగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.  కొంతమంది మంటల్లో చిక్కుకోవటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని నగర సీపీ తెలిపారు.

ఆస్పత్రి అంతా దట్టమైన పొగ కమ్ముకోవటంతో సహాయ చర్యలకు ఆటకం కలుగుతోంది. తీవ్రంగా శ్రమించి చాలామందిని బయటకు తీసుకొచ్చారు.ఈ ఘటనతో రోగులు భయంతో బయటకు పరుగులు తీయగా.. రోగులు, వారి బంధువులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి. నగర పోలీస్ కమిషన్ ఆస్పత్రి పరిస్థితిని..సహాయక చర్యల్ని దగ్గరుండి సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇండస్ ఆస్పత్రిలో మొత్తం 150 పడకలు ఉండగా.. 46మంది ఇన్ పేషెంట్లుగా ఉన్నారు. వీరిలో 16మంది ఐసీయూలో చికిత్సపొందుతున్నారు. అగ్నిప్రమాదం సంభవించటంతో రోగులను మెడికవర్ ఆసుపత్రితో పాటు కెజిహెచ్, విజేత ఆసుపత్రులకు తరలించారు.