Ongole District Politics: ప్రకాశం జిల్లా వైసీపీలో ప్లెక్సీల వార్.. మరోసారి అలిగి హైదరాబాద్ వెళ్లిపోయిన బాలినేని

ప్రకాశం జిల్లా ఇంచార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చిన మొదటిరోజే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల మధ్య ఫ్లెక్సీవార్ మొదలైంది.

Ongole Politics

Balineni Srinivas : ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వైసీపీ ఇంచార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. అయితే, ప్రకాశం జిల్లా పార్టీ ఇంచార్జి హోదాలో వచ్చిన మొదటిరోజే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లెక్సీవార్ మొదలైంది. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంకు ఆనుకొనిఉన్న మంత్రి మెరుగు నాగార్జున క్యాంపు కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  సంతనూతలపాడుకు చెందిన మంత్రి మెరుగ నాగార్జున వర్గం మాజీ మంత్రి బాలినేని ప్లెక్సీలను తొలగించి చెవిరెడ్డి ప్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఆగ్రహంతో ఊగిపోయిన బాలినేని వర్గీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన ప్లెక్సీలను చింపేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలో వైసీపీ నేతల మధ్య వార్ తారాస్థాయికి చేరుతుండటంతో వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : మల్కాజ్‌గిరి పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ కోసం బండ్ల గణేశ్ దరఖాస్తు

రెండున్నర దశాబ్దాలుగా జిల్లాలో ఎదురులేని నేతగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుత వైసీపీలో తనకు ఎదురవుతున్న పరిస్థితులు, పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతుందని భావించిన బాలినేని.. కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ బరిలో మరోసారి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డినే నిలపాలని వైసీపీ అధిష్టానం వద్ద బాలినేని తన వాదన వినిపించారు. కానీ, ఒంగోలు ఎంపీ స్థానంలో మరోసారి మాగుంటను బరిలో నిలిపేందుకు వైసీపీ అధిష్టానం ఒప్పుకోలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ బరిలో దింపుతున్నట్లు వైసీపీ అధిష్టానం తెలిపింది. దీంతో బాలినేని పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో వైసీపీ పెద్దలు పలుసార్లు బాలినేనితో భేటీ అయ్యారు. సీఎం జగన్ తోనూ బాలినేని భేటీ అయ్యారు. ఈ భేటీల్లో మాగుంటకు ఎంపీ సీటు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాజాగా బాలినేని ఓ మెట్టుదిగొచ్చి వైసీపీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పేశారు.

Also Read : YS Sharmila : ఏపీకి ప్రత్యేక హోదాకోసం ఢిల్లీలో షర్మిల ధర్నా.. పలు పార్టీల అధినేతలతో వరుస భేటీలు

మాగుంట శ్రీనివాసులరెడ్డి మరోసారి ఒంగోలు ఎంపీగా ఉంటే బాగుంటుందని భావించానని, కానీ, నేను ఒక్కడినే వైసీపీ అధిష్టానం వద్ద పోరాటం చేయాల్సి వస్తుందని బాలినేని అన్నారు. పార్లమెంట్ బరిలో ఎవరు నిలబడ్డా తన వంతు సహకరిస్తానని, నా ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధికి నా ప్రయత్నం చేసుకుంటానని చెప్పారు. అయితే, ప్రకాశం జిల్లా వైసీపీ ఇంఛార్జిగా చెవిరెడ్డి వచ్చిన మొదటిరోజే వివాదం తలెత్తింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకాశం, నెల్లూరు జిల్లా ఇంచార్జిగా ప్రకటించడాన్ని బాలినేని వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా.. బాలినేని ఫ్లెక్సీల స్థానంలో చెవిరెడ్డి ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాలినేని వర్గీయులు చెవిరెడ్డి ప్లెక్సీలను తొలగించేశారు. ఇదిలాఉంటే.. చెవిరెడ్డిని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వైసీపీ ఇంచార్జిగా ప్రకటించడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరోసారి అలిగి హైదరాబాద్ వెళ్లిపోయినట్లు తెలిసింది.