YS Sharmila : ఏపీకి ప్రత్యేక హోదాకోసం ఢిల్లీలో షర్మిల ధర్నా.. పలు పార్టీల అధినేతలతో వరుస భేటీలు

ఢిల్లీలో ధర్నాకు ముందు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పెద్దలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. ఏపీ పరిస్థితులను శరద్ పవార్ దృష్టికి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లారు.

YS Sharmila : ఏపీకి ప్రత్యేక హోదాకోసం ఢిల్లీలో షర్మిల ధర్నా.. పలు పార్టీల అధినేతలతో వరుస భేటీలు

YS Sharmila

Updated On : February 2, 2024 / 10:59 AM IST

YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ఏపీలో పార్టీ పగ్గాలు చేపట్టిన నాటినుంచి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారిగా కాంగ్రెస్ పార్టీ సమీక్షల్లో పాల్గొన్న షర్మిల.. అధికార పార్టీ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుల, విభజన చట్టంలోని హామీల అమలు వంటి అంశాలను ప్రధాన అస్త్రాలుగా మలచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు. ఏపీ భవన్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు షర్మిల దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో షర్మిలతో పాటు ఏపీ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ ఠాకూర్ తో పాటు ఏపీ కాంగ్రెస్ పెద్దలు పాల్గోనున్నారు.

Also Read : BRS Party Chief KCR : కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. తొందరపడొద్దంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

ఢిల్లీలో ధర్నాకు ముందు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పెద్దలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అంశాన్ని, ఏపీ పరిస్థితులను శరద్ పవార్ దృష్టికి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లారు. పార్లమెంట్ లో ఏపీకి ప్రత్యేక హోదా విభజన చట్టం, హామీల అమలపై ఎన్సీపీ తరపున పార్లమెంట్ లో లేవనెత్తాలని శరద్ పవార్ ను షర్మిల కోరారు. అనంతరం డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను షర్మిల, ఏపీ కాంగ్రెస్ నేతలు కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం పార్లమెంట్ లో డీఎంకే మద్దతును కాంగ్రెస్ నేతలు కోరారు. సోమవారం పార్లమెంట్ లో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాన్ని లేవనెత్తుతానని తిరుచ్చి శివ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.

 

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలను ఏపీ కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ఇవాళ చేపట్టనున్న ధర్నాకు మద్దతు కోరనున్నారు. మరోవైపు ధర్నా అనంతరం ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో పాటు మరికొందరు జాతీయ నేతలను షర్మిలతో పాటు ఏపీ కాంగ్రెస్ నేతలు కలవనున్నారు.