కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. తొందరపడొద్దంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓటమి చెందినంత మాత్రాన ప్రజలకు దూరంకావాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేసేలా ప్రజాక్షేత్రంలో పోరాటం చేద్దామని సూచించారు.

KCR
BRS Party Chief KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం దాదాపు అసాధ్యమని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒకే విడత రూ.2లక్షల రుణమాఫీ చేయడం సాధ్యం కానేకాదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమయం ఇద్దామని, పార్టీ పరంగా తదుపరి కార్యాచరణ అమలు చేద్దామని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో నందినగర్ లోని తన నివాసంలో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ నిర్వహించిన పలు సర్వేల్లో బీఆర్ఎస్ కు సానుకూల ఫలితాలొచ్చాయని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ నేతల ట్రాప్ లో ఎమ్మెల్యేలు పడొద్దని, కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీఎంను మంచి ఉద్దేశంతో కలిసినా తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేసీఆర్ సూచించారు. నియోజకవర్గాల అభివృద్ధికోసం మంత్రులకు ప్రజల సమక్షంలోనే వినతిపత్రాలు అందజేయాలని కేసీఆర్ సూచించారు.
Also Read : విజయనగరంలో ఎగిరేది ఏ జెండా? ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి?
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓటమి చెందినంత మాత్రాన ప్రజలకు దూరంకావాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి ఓట్లేశారు.. కొద్దిరోజుల్లోనే ప్రభుత్వం పనితీరుపై ప్రజలకు స్పష్టత వస్తుందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో మార్పుకోరుకున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని, ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం దాదాపు అసాధ్యమేనని కేసీఆర్ అన్నారు. కొత్త ప్రభుత్వానికి మరో రెండుమూడు నెలలు గడువు ఇద్దామని, ఆ తరువాతే ప్రజల తరపున ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేద్దామని కేసీఆర్ అన్నారు. కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడంతో పార్టీ మారుతున్నారని వస్తున్న ప్రచారంపై కేసీఆర్ ప్రస్తావించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా పెద్దగా అనుభవం లేదని, పాలనాపరంగా కూడా అనుకున్న ఫలితాలు సాధించడం అంతసులువు కాదని కేసీఆర్ అభిప్రాయ పడ్డారు.
Also Read : ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ.. పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎంపీలతో మాట్లాడిన గులాబీ బాస్.. కృష్ణానదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధికి ఇవ్వాలన్న ప్రతిపాదనలపై ఆరా తీశారు.. ఈ అంశంపై ఢిల్లీలో ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లోనూ నిరసన చేపట్టాలని ఎంపీలకు చెప్పినట్లు సమాచారం. తెలంగాణ భవన్ కేంద్రంగానే అందుబాటులో ఉంటానని చెప్పిన కేసీఆర్.. రాజీలేని పోరాటాలతో తెలంగాణ ప్రయోజనాలను ఒక్క బీఆర్ఎస్ పార్టీనే కాపాడుతుందని అన్నారు.