ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ.. పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. పర్యటన షెడ్యూల్ ఇలా

రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదివాసీల పోరుగడ్డ ఇంద్రవెల్లి రేవంత్ రెడ్డి తొలి పర్యటనకు వేదికకానుంది.

ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ.. పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. పర్యటన షెడ్యూల్ ఇలా

Revanth Reddy

Updated On : February 2, 2024 / 10:07 AM IST

CM Revanth Reddy Indravelli Tour : రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదివాసీల పోరుగడ్డ ఇంద్రవెల్లి రేవంత్ రెడ్డి తొలి పర్యటనకు వేదికకానుంది. రాజకీయంగా తనకు కలిసొచ్చిన ఇంద్రవెల్లి వేదికగా తెలంగాణ పునర్ నిర్మాణసభ పేరుతో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.. అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరు గ్యారెంటీల్లో భాగమైన మరో రెండు గ్యారెంటీలను ఆదివాసీ గడ్డపై నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Also Read : రూ.500కే సిలిండర్, ఉచిత విద్యుత్.. త్వరలో మరో 2 గ్యారెంటీలు అమలు, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి గడ్డను రాజకీయ సెంటిమెంట్ గా తీసుకున్నారు. గతంలో పీసీసీ చీఫ్ హోదాలో 2022 ఆగస్టు 9న రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలోనే మొదటి సభ నిర్వహించారు. నాడు, దళిత గిరిజనుల దండోరా పేరిట ఆత్మగౌరవ సభలో పాల్గొన్నారు. సభ విజయవంతం కావడంతో రేవంత్ రెడ్డి వెనుదిరిగి చూడలేదు. అదే సెంటిమెంట్ తో ముఖ్యమంత్రి హోదాలో ఇంద్రవెల్లి గడ్డపై రేవంత్ అడుగు పెడుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆసిఫాబాద్ బయలుదేరుతారు. తొలుత కేస్లాపూర్ లో నాగోబా దేవతకు సీఎం పూజలు చేస్తారు. ఆ తరువాత ఇంద్రవెల్లికి చేరుకుంటారు. అక్కడ కొమురం భీం స్మృతి వనానికి శంకుస్థాపన చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం ఇంద్రవెల్లి సభలో పాల్గోనున్న సీఎం రేవంత్.. రూ. 500 కు గ్యాస్ సిలిండర్ పథకానికి, గృహజ్యోతిలో భాగమైన 200 ఉచిత యూనిట్ గ్యారెంటీని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.

Also Raed : TDP Janasena MP Candidates : టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే?

సీఎం ఇంద్రవెల్లి పర్యటన సందర్భంగా భద్రతా సిబ్బంది పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. నాగోబా ఆలయం వద్ద, సభా ప్రాంగణం వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు తెలంగాణ పున:నిర్మాణ సభ విజయవంతం కోసం ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. మరోవైపు పోడుభూముల పట్టాలు, ఐటీడీఏ ప్రక్షాళన, ఏజెన్సీ ప్రాంతంలో సమస్యలపై సీఎం స్పందిస్తారని జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాన్ ఏజెన్సీ ఏరియాతో పాటు ఉమ్మడి జిల్లాకు వరాలు ఇస్తారని భావిస్తున్నారు.

ఇంద్రవెల్లిలో రేవంత్ పర్యటన షెడ్యూల్ ఇలా..
హైదరాబాద్ బేగంపేట నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం రేవంత్ బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆదివాసీల ఇలవేల్పు నాగోబా కొలువైన కేస్లాపూర్ చేరుకుంటారు. ప్రత్యేక పూజల అనంతరం అక్కడ దాదాపు రూ. 49 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1,005 డ్వాక్రా మహిళా సంఘాలకు సుమారు రూ. 60కోట్లకుపైగా రుణాలు పంపిణీ చేస్తారు.

అక్కడి నుంచి 3.15 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ప్రయాణించి 3.30 గంటలకు ఇంద్రవెళ్లికి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. అక్కడ 1981 ఏప్రిల్ 20న పోలీసు కాల్పుల్లో అమరులైన ఆదివాసీ వీరుల శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అమరవీరుల స్థూపానికి రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు. స్థూపం దగ్గర రూ. 97లక్షల వ్యయంతో చేపట్టనున్న స్మృతివనం పనులకు భూమి పూజ చేస్తారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. మరో జలియన్ వాలాబాగ్ గా ప్రసిద్ధి పొందిన ఇంద్రవెల్లి రణస్థలిలో అమరుల స్థూపానికి నివాళులర్పించనున్న తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం విశేషం.