రూ.500కే సిలిండర్, ఉచిత విద్యుత్.. త్వరలో మరో 2 గ్యారెంటీలు అమలు, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హామీల అమలుకు లేనిపోని నిబంధనలు పెట్టి ఎవరినీ కూడా ఇబ్బందులు పెట్టొద్దని సీఎం రేవంత్ ఆదేశించారు.

Congress 6 Guarantees
Congress 6 Guarantees : ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మరో రెండు గ్యారెంటీలు(రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు) అమలు చేద్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన దరఖాస్తులపై కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అర్హులందరికీ లబ్ది జరిగేలా గ్యారెంటీలు అమలు చేస్తామని తెలిపారు. మరో రెండు గ్యారెంటీల అమలుకు సన్నాహాలు చేయాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్.
Also Read : బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోకల్, నాన్‌లోకల్ వార్.. కరీంనగర్‌లో హీటెక్కిన రాజకీయం
రెండు గ్యారెంటీల అమలుకు ఎంత ఖర్చు అవుతుంది అనే అంశంపై చర్చించారు. ఈ బడ్జెట్ లోనే వాటికి అవసరమైన నిధులు కూడా కేటాయించాలని ఆర్థిక శాఖకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల లోపు మరోసారి కేబినెట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హామీల అమలుకు లేనిపోని నిబంధనలు పెట్టి ఎవరినీ కూడా ఇబ్బందులు పెట్టొద్దని సీఎం రేవంత్ ఆదేశించారు.
దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ది పొందేలా చూడాలంటూ ఆదేశాలు ఇచ్చారు. దరఖాస్తు చేయని వారుంటే నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని అధికారులతో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కన్ఫూజన్.. అయోమయంలో నేతలు