Edara Hari Babu: మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు ఆరోగ్య పరిస్థితి విషమం.. వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో పాల్గోనున్న చంద్రబాబు

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియల్లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గోనున్నారు.

Edara Hari Babu

Edara Hari Babu: ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం. గుండెపోటుకు గురికావడంతో సమీపంలోని సంఘమిత్రా ఆస్పత్రికి ఆయన్ను తరలించారు. ప్రస్తుతం హరిబాబు కోమాలో ఉన్నట్లు తెలిసింది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు.. ఈదర హరిబాబు ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నట్లు సమాచారం.

ఒంగోలు బైపాస్ రోడ్డులోని తన కార్యాలయంలో ఉన్న టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరినిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వీరయ్య చౌదరి మృతి చెందాడు. స్వయాన తన మేనల్లుడైన వీరయ్య చౌదరి హత్యకు గురయ్యాడనే సమాచారంతో ఈదర హరిబాబు హుటాహుటీన రిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. తన మేనల్లుడి మృతదేహాన్ని చూసి ఈదర హరిబాబు అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. గుండెపోటుకు గురికావడంతో సమీపంలోని సంఘమిత్రా ఆస్పత్రికి ఆయన్ను తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

మరోవైపు ఇవాళ ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియల్లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గోనున్నారు. వీరయ్య చౌదరి కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శిస్తారు.