ఈ ట్యాగ్ వేసుకుంటే కరోనా ఎక్కడ ఉందో కనిపెట్టొచ్చు.. నయా బురిడీ

ఈ ట్యాగ్ వేసుకుంటే కరోనా ఎక్కడ ఉందో కనిపెట్టొచ్చు.. నయా బురిడీ

Updated On : July 26, 2020 / 10:42 PM IST

కరోనా భయమే పెట్టుబడిగా మారిపోయింది. కొందరు ఇదే అదనుగా మెడికల్ పరికరాలు స్మగ్లింగ్ కు పాల్పడుతుంటే వ్యాక్సిన్ పేరిట మరికొందరు దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. ఈ మహమ్మారికి విరుగుడుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు వ్యాక్సిన్‌ కనుగొనే పనిలో మునిగిపోతుంటే.. కొందరు కేటుగాళ్లు ప్రజానీకాన్ని బురిడి కొట్టించి డబ్బులు దండుకుంటున్నారు.

భయాన్ని పెట్టుబడిగా చేసుకుని కబుర్లు చెబుతూ.. జపాన్‌లో తయారైన ట్యాగ్‌ని మెడలో వేసుకుంటే కరోనా సోకదని చెవుల్లో పూలు పెడుతున్నారు. రూ.300 లకు ట్యాగ్‌ చొప్పున విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగింది. ‘వైరస్‌ షటౌట్‌ మేడిన్‌ ఇన్‌ జపాన్‌’ ట్యాగ్‌తో కరోనాకు దూరంగా ఉండొచ్చని కొందరు వ్యక్తులు ఐడీ కార్డులను పోలిన ట్యాగ్‌ల అమ్మకాలు సాగించారు.

ఈ రకమైన ట్యాగ్‌ మెడలో వేసుకుంటే కరోనా పాజిటివ్‌ వ్యక్తులు, వైరస్‌ జాడలు ఉన్న ప్రదేశానికి 10 అడుగుల దూరంలోనే అలారమ్‌ మోగుతుందని నమ్మబలికారు. అదంతా నిజమని నమ్మిన గుంతకల్లు, పరిసర ప్రాంతాల ప్రజలు ఆ ట్యాగ్ లను భారీగా కొనుగోలు చేశారు. కరోనాకు మందులుగాని, వ్యాక్సిన్ గాని మార్కెట్లో లేదని మోసపోవద్దని జన విజ్ఞాన వేదిక ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

అవగాహన కోసం ఎన్ని విషయాలు చెబుతున్నా కేటుగాళ్ల మాయకు పప్పులో కాలేస్తున్నారు ప్రజలు. ట్యాగ్‌ల పేరుతో దండుకుంటున్న మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు పోలీసులను కోరారు.