ఉచిత రేషన్, కేజీ కందిపప్పు.. రూ.1000 ఇస్తాం : జగన్

మార్చి 29వ తేదీ నాటికి రేషన్ అందుబాటులో ఉంచుతామని, రేషన్ బియ్యంతో పాటు కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తామన్నారు. ఏప్రిల్ 4న ప్రతీ తెల్ల రేషన్ కార్డుదారుని ఇంటికి వెళ్లి గ్రామ వాలంటీర్ రూ.1000 అందిస్తారని జగన్ స్పష్టం చేశారు. 10 మందికి మించి ఎవరూ గుమిగూడవద్దని జగన్ సూచించారు. బడ్జెట్ ఆమోదం కోసం వీలైనంత త్వరలో అసెంబ్లీ సమావేశం కానున్నట్టు చెప్పారు.
రైతులు, రైతు కూలీలు సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. నీళ్లు, కూరగాయలు, పాలు, ఎలక్ట్రిసిటీ, మెడికల్, గ్యాస్, పెట్రోల్ బంకులు, వాటర్ సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 10 ఏళ్ల లోపు పిల్లలను తల్లిదండ్రులు బయటకు పంపొద్దన్నారు. 60 ఏళ్ల దాటిన వృద్ధులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని 3 జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాలకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 75 జిల్లాల్లో కరోనా నిర్భంధం కొనసాగుతోంది. విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించాలని కేంద్ర ఆదేశించింది.
ఈ జిల్లాల నుంచే కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ప్రత్యేకించి ఈ జిల్లాలోని వారిని ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కర్ఫ్యూ విధించింది. కరోనా వైరస్ కట్టడి చేసేందుకు అన్ని రకాల ఆంక్షలను కేంద్రం అమలు చేస్తోంది. మంత్రిత్వ శాఖలవారీగా అందరిని సమన్వయపరుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడి చేసే చర్యలను వేగవంతం చేసింది.
See Also | మార్చి 31వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు: జగన్