నంబాల కేశవరావు: చంద్రబాబుపై అలిపిరిలో దాడికి ప్రధాన సూత్రధారి.. ఇంకా ఎన్ని దాడులు చేయించారంటే?
అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ కేశవరావు అరెస్టు కాలేదు.

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు (67) హతమైనట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. నక్సలిజంపై భారత్ చేస్తున్న మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న నాయకుడిని దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారని ఆయన తెలిపారు.
నంబాల కేశవరావు గతంలో ఎన్నో దాడులకు వ్యూహకర్తగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగింది. 2003 అక్టోబర్ 1న తిరుపతిలోని అలిపిరి టోల్‌గేట్ సమీపంలో చంద్రబాబు కాన్వాయ్ వెళ్తున్న సమయంలో మావోయిస్టులు ల్యాండ్ మైన్‌ను పేల్చారు.
ఆ దాడి నుంచి చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. ఈ క్లైమోర్ మైన్స్ దాడికి ప్రధాన సూత్రధారి కేశవరావే. ఇటువంటి ఎన్నో దాడుల వెనుక కేశవరావు ఉన్నారు. వ్యూహాల రూపకల్పనతో పాటు అమలులో ఆయన సిద్ధహస్తుడు. ఆయుధాల వ్యాపారులతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. 2010 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని చింతల్నార్‌లో గస్తీకి వెళ్లి తిరిగివస్తున్న సీఆఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో 74 మంది జవాన్లు మృతి చెందారు.
దీనికి వ్యూహం వేసింది కూడా కేశవరావే. అలాగే, 2013లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మపై దాడి జరిగింది. ఆ దాడిలో మహేంద్రకర్మ సహా 28 మంది మృతి చెందారు. దీనికి కూడా కేశవరావే వ్యూహం వేశారు. కేశవరావు నక్సల్ ఉద్యమ మూలాలున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. జియ్యన్నపేటలో 1955లో ఆయన జన్మించారు.
కేశవరావు తండ్రి ఓ టీచర్. కాలేజీలో చదువుతున్న సమయంలోనే కేశవరావు విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు. వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన బీటెక్‌లో చదివారు. రాడికల్ ఉద్యమంలో పాల్గొంటున్న సూరపనేని జనార్దన్‌తో పాటు జన్ను చిన్నా ప్రభావం కేశవరావు మీద పడింది. చివరకు కేశవరావు 1976లో పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. 1980లో గెరిల్లా జోన్ ఏర్పాటు చేయడానికి పీపుల్స్ వార్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
దీంతో కేశవరావు విశాఖ-తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దులోని మన్యానికి వెళ్లారు. కృష్ణ పేరిట గిరిజనులతో కలిసి జీవించేవారు. ఉద్యమ కార్యకలాపాలు ఆరోపణలపై ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతవాసంలోకి జీవించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ కేశవరావు అరెస్టు కాలేదు.