కర్నూలులో బంగారు నిక్షేపాలు, తవ్వకాలు ప్రారంభం

gold mine drilling work : కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు వెలికి తీసేందుకు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తవ్వకాలు చేపడుతోంది. 2020, అక్టోబర్ 06వ తేదీ మంగళవారం తుగ్గలి మండలంలోని పగిడిరాయి–జొన్నగిరి గ్రామాల మధ్య డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయి.
పగిడిరాయి, బొల్లవానిపల్లి, జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో 40 ఏళ్లుగా వివిధ కంపెనీలు సర్వేలు చేసి, బంగారం నిక్షేపాలున్నాయని గుర్తించాయి. జియో మైసూరు సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాదాపు 15 ఏళ్లుగా సర్వే చేస్తోంది. నిక్షేపాల వెలికి తీతకు 2013లోనే ఈ సంస్థ ప్రభుత్వ అనుమతులు పొందింది.
అయితే..కొంతమంది దీనిపై కోర్టుకు వెళ్లారు. దీంతో పనులు ఆలస్యమయ్యాయి. ఎకరాకు రూ. 12 లక్షల చొప్పున దాదాపు 300 ఎకరాలు కొనుగోలు చేసింది. భూములు కోల్పోయే రైతులకు డబ్బులు చెల్లించడంలో జాప్యం జరగడం, కొన్నాళ్ల పాటు కంపెనీ ప్రతినిధులు మొహం చాటేయడంతో మైనింగ్ ప్రాజెక్టు కలగా మిగిలింది. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం కంపెనీ ప్రతినిధులు వచ్చి రైతులతో మాట్లాడి ఏడాది కౌలు చెల్లించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.