×
Ad

Appanna Temple Ornaments: సింహాద్రి అప్పన్న ఆలయంలో నగలు స్వాహా..! 47 ఆభరణాల లెక్కల్లో వ్యత్యాసం..

స్వామి కైంకర్యం నిమిత్తం వినియోగిస్తున్న ఆభరణాలకు, రిజిస్ట్రర్ లో ఉన్న ఆభరణాలకు సంబంధించి కొన్నింటిని చూపించలేదు.

Appanna Temple Ornaments: సింహాద్రి అప్పన్న ఆభరణాల లెక్కల్లో తేడాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలల క్రితం కడపకు చెందిన ప్రభాకర్ ఆచారి ఇచ్చిన ఫిర్యాదుతో గత నెల 14, 15 తేదీల్లో డీఈవో (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) రాధ పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. రిజిస్ట్రర్ లో వివరాలు నమోదు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 47 స్వామి వారి ఆభరణాల లెక్కల్లో తీవ్ర వ్యత్యాసం ఉండటం చర్చకు దారితీసింది.

తనిఖీల అనంతరం మాజీ ఏఈవో ఆనంద్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులకు నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ ఆయా వర్గాల నుంచి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర దేవాదాయ శాఖ స్పందించింది. బాధ్యులపై చర్యలకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

అప్పన్న ఆలయంలో రిజిస్ట్రర్ ప్రకారం ఉన్న వెండి ఆభరణాలు గత నెల 14, 15న డీఈవో రాధ తనిఖీలు చేశారు. నిత్యం స్వామికి కైంకర్యాలు, అర్చకులు వినియోగించే వెండి, బంగారు ఆభరణాలు, వస్తు సామాగ్రి డిటైల్స్ దేవస్థానం గోల్డ్ స్మిత్ ద్వారా అర్చకుల సమక్షాన ఒక్కో ఆభరణానికి తూకం వేశారు. అయితే అర్చకులు స్వామి కైంకర్యం నిమిత్తం వినియోగిస్తున్న ఆభరణాలకు, రిజిస్ట్రర్ లో ఉన్న ఆభరణాలకు సంబంధించి కొన్నింటిని చూపించలేదు.

ఇదే విషయంపై డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాధ ఆయా వివరాలతో నోటీసులు జారీ చేశారు. దేవస్థానం కార్యాలయ రిజిస్ట్రర్ ప్రకారం ఉన్న వెండి, బంగారు ఆభరణాలు తనిఖీ సమయంలో చూపించలేదని, అందుకు కారణాలను మూడు రోజుల్లో తెలియజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేని పక్షంలో కార్యాలయ రికార్డ్ ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని నోటీసుల్లో స్పష్టంగా తెలిపారు.

Also Read: దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి.. ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఐపీబీ భేటీలో ఆమోదం.. ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే?