Jagan Padayatra Representative Image (Image Credit To Original Source)
Jagan Padayatra: ఈసారి మూమూలుగా ఉండదు. పాదయాత్ర 2.O.. గతానికి మించి అదిరిపోతుంది. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మందిని జగన్ కలుస్తారంటూ అధినేత పాదయాత్ర 2.O పై వైసీపీ లీడర్లు ఓ రేంజ్‌లో హైప్ ఇస్తున్నారు. పాదయాత్రతో ఏడాదిన్నర పాటు జనంలోనే ఉంటానని జగన్ అంటున్నారు. క్యాడర్‌లో జోష్ నింపేందుకే పాదయాత్రపై క్లారిటీ ఇచ్చేశారా? పాదయాత్ర 2.O జగన్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చేనా? చివరి అస్త్రం పాదయాత్రేనా? జగన్ స్టేట్‌మెంట్ వెనుక వ్యూహం ఉందా?
ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల టైమ్ ఉంది. కానీ రాబోయే ఎన్నికలపై ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది. కూటమి లాంగ్ లీవ్ అని చంద్రబాబు, పవన్ అంటున్నారు. ఆ ముగ్గురిది ఫెవికోల్ బంధమని వైసీపీ కూడా చెప్తోంది. ఫ్యాన్ పార్టీ మాత్రం అధినేత మీదే భరోసా పెట్టి ముందుకెళ్తోంది. జగన్ పాదయాత్ర చేస్తారు..తిరిగి అధికారంలోకి వస్తామంటూ ధీమాగా ఉన్నారు వైసీపీ లీడర్లు. ఈ సారి జగన్ చేయబోయే పాదయాత్ర నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని అంటున్నారు. ఏపీ మొత్తాన్ని కవర్ చేసేలా..2019కి ముందు చేపట్టిన పాదయాత్రకు మించి రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. జగన్ కూడా ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర చేస్తానని..ఎన్నికల వరకు జనంలోని ఉంటానని ప్రకటించేశారు.
ఎలక్షన్స్‌కు ముందు చేయబోయే పాదయాత్రపై జగన్ ఇప్పుడెందుకు ప్రకటన చేసినట్లు అన్న చర్చ జరుగుతోంది. మళ్లీ వైసీపీనే పవర్‌లోకి వస్తుందని..క్యాడర్, లీడర్లకు ధైర్యం నూరిపోస్తున్న అధినేత..కావాలనే పాదయాత్రపై హింట్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సేమ్‌టైమ్ అటు క్రెడిట్ వార్‌లోనూ ఓ అడుగు ముందుండే ప్రయత్నం చేస్తున్నారు జగన్. విశాఖ గూగుల్ డేటా సెంటర్ నుంచి లేటెస్ట్‌గా భూసర్వే దాకా అంతా తానే చేశానని..కానీ సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ చెప్పుకుంటూ వస్తున్నారు.
పాదయాత్రలకు తెలుగు స్టేట్స్ పెట్టింది పేరు. పాదయాత్రలు చేసి ఎంతో మంది అధికారంలోకి వచ్చారు. 2003లో అప్పటి ఉమ్మడి ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో వైఎస్సార్ భారీ పాదయాత్ర చేసి..2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే పాదయాత్ర సెంటిమెంట్ తెలుగు నాట పవర్ ఫుల్ అని.. ఆ తర్వాత పాదయాత్ర చేసిన నాయకులు నిరూపించారు. 2013 అక్టోబర్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేసి..2014లో ఏపీలో సీఎం అయ్యారు. ఇక 2017లో నాటి ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ ఏకంగా 3500 కిలోమీటర్లపైన పాదయాత్ర చేపట్టి 2019 ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టీ సీఎం అయ్యారు.
2023 జనవరిలో యువ నేత లోకేష్ పాదయాత్ర చేపట్టి..కూటమి బంపర్ విక్టరీకి తనవంతు తోడ్పాటు అందించారు. ఇలా రెండు దశాబ్దాలకు పైగా ఏపీ పాలిటిక్స్‌లో పాపులర్ అయిన పాదయాత్రలతో నేతలు కాళ్లు అరిగేలా పవర్‌లోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ జగన్ వంతు వచ్చింది. లేటెస్ట్‌గా నేతల సమావేశంలో మాట్లాడుతూ మరో ఏడాదిన్నరలో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు.
పాదయాత్ర 2.O జగన్‌ను తిరిగి పవర్‌లోకి తెస్తుందా లేదా అన్నదే అతిపెద్ద చర్చ. తెలుగు రాజకీయాల్లో ఒకసారి పాదయాత్ర చేసిన వారు మరోసారి పాదయాత్ర చేపట్టలేదు. రెండోసారి పాదయాత్ర అనేది జగన్‌తోనే మొదలయ్యే అవకాశం ఉంది. వైఎస్సార్ కానీ చంద్రబాబు కానీ ఒకేసారి పాదయాత్ర చేశారు. లోకేష్ కూడా ఆ లోటు తీర్చుకున్నారు. అయితే మొదటిసారి పాదయాత్ర చేస్తే ఆ క్రేజ్, హైప్ ఒక లెవెల్‌లో ఉంటుంది. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు..అప్పటివరకు అధికారం చేపట్టకుండా ప్రతిపక్షంలో ఉన్నవారు పాదయాత్ర చేస్తే ఆ మ్యాజిక్కే వేరేగా ఉంటుంది.
జగన్ విషయానికి వస్తే ఐదేళ్లు పాటు సీఎంగా పనిచేశారు. ఆయన పాలన ఏమిటో ప్రజలు చూశారు. వైసీపీ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలే 2024లో జగన్ ఓటమికి కారణమయ్యాయన్న టాక్ ఉంది. మరి ఈసారి ప్రజల్లోకి వెళ్లి జనాలకు జగన్ ఏం చెప్తారు? జనాలను ఎలా అట్రాక్ట్ చేయబోతున్నారు? వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రజలు ప్రశ్నిస్తే జగన్ ఎలా రియాక్ట్ అవుతారు? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. గతానికి మించి కొత్త హామీలు ఇవ్వాలి. స్పీచ్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ దాకా అన్నీ మార్చేయాలి. తీరా ఎన్ని చేసినా ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై అనుకున్న స్థాయిలో వ్యతిరేకత రాకపోతే మాత్రం జగన్ అంచనాలు తలకిందులు అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి సవాళ్ల నేపథ్యంలో జగన్ పాదయాత్ర విజయతీరాలకు చేరుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ జగన్ పాదయాత్ర చేస్తే పొలిటికల్ సినారియో ఎలా ఉంటుందనేది బిగ్ డిబేట్‌గా ఉంది. 2019 ఎన్నికలే ఎజెండాగా ఆయన చేసిన పాదయాత్రకు అప్పట్లో ప్రజల మద్దతు బానే లభించింది. ఇప్పుడు కూడా అలాగే ప్రజల్లోకి వెళ్లి పబ్లిక్ పల్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో జగన్ ఉండొచ్చు. కానీ జగన్ 2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ ఇంకా వేరు. 2014లో జగన్ ఓడిపోయారనే సింపతీ 2019 ఎన్నికల్లో ఆయనకు కలిసి వచ్చింది.
పవర్‌లోకి వస్తే నవరత్నాలు ఇస్తామని చెప్పి..రాజన్న రాజ్యం తీసుకొస్తామన్న నమ్మకం కలిగించడంలో అప్పుడు సక్సెస్ అయ్యారు. పైగా ఆ నాటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ సెపరేట్‌గా పోటీ చేశాయి. ఓట్లు చీలిపోయి జగన్‌కు కలిసి వచ్చింది. 2024లో కూడా జగన్ ఆ మూడు పార్టీలు కలవకూడదని కోరుకున్నారు. కానీ ఏదైతే జరగొద్దని జగన్ అనుకున్నారో అదే జరిగింది. కూటమిగా ఏర్పడి పోటీ చేసి పవర్‌లోకి వచ్చాయి ఆ మూడు పార్టీలు.
రాబోయే ఎన్నికల్లో కూడా ఆ ముగ్గురు కలిసే పోటీ చేస్తామంటున్నారు. ఆ మూడు పార్టీల మాటలు, చేతలు కూడా అదే డైరెక్షన్‌లోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో..2018లో జగన్ చేసిన పాదయాత్రతో పోలిస్తే.. రాబోయే రోజుల్లో చేయబోయే పాదయాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుందనేదే డిస్కషన్ పాయింట్. జగన్ పాదయాత్ర చేస్తే చంద్రబాబు సర్కార్‌పై దుమ్మెత్తిపోయడం తప్ప కొత్తగా చెప్పేదేం లేదంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే ప్రజలు వైసీపీ పాలనను చూశారని..జగన్ కొత్తగా చెప్పేదేమి లేదని..ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితి కూడా లేదంటున్నారు. ఏది ఏమైనా ఫస్ట్ టైమ్ జగన్ వేసిన బాణం గురి తగిలింది. రెండోసారి కూడా తగిలితే రికార్డు బ్రేక్ అవుతుంది. మరి జగన్ పాదయాత్ర 2.O ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలంటే వేచి చూడాల్సిందే.
Also Read: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం.. మీరు ఈ రకంగా విత్తనాలు వేస్తే రేపు వృక్షాలవుతాయ్.. వైఎస్ జగన్ హెచ్చరిక