Amaravati: ఒక్కో అడుగు ముందుకు పడుతుంది. ఎన్నో రోజుల కల నెరవేరే రోజు రానే రాబోతోంది. రాజధానికి రాజముద్ర పడేందుకు రూట్ క్లియర్ అవుతుంది. ఆల్రెడీ న్యాయశాఖ ఆమోదముద్ర వేసింది. ఇక సెంట్రల్ క్యాబినెట్‌లో ఆమోదించి..పార్లమెంట్‌కు పంపించి గెజిట్ రిలీజ్ చేయడమే లేటు. ఈ ప్రాసెస్ అంతా ఎప్పటిలోపు పూర్తి కానుంది? రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలేంటి?
నవ్యాంధ్ర ప్రజల భవిష్యత్ ఆశల సౌధం. ఐదు కోట్ల మంది ఆంధ్రుల కల. తమకంటూ ఓ రాజధాని ఉండాలి. ఇదే ఏపీ రాజధాని అంటూ అందరూ ఫిక్స్ అయిపోవాలనే డ్రీమ్. కానీ విభజన జరిగి పదకొండేళ్లు అవుతున్నా..ఏపీ రాజధానిపై కన్‌ఫ్యూజన్ వీడటం లేదు. కూటమి సర్కార్ అమరావతిలో పనులు పరుగులు పెట్టిస్తోంది. మూడు రాజధానుల లైన్‌ను ఎత్తుకున్న వైసీపీ ఘోర ఓటమి తర్వాత కూడా రాజధానిపై తమ క్లియర్ కట్ స్టాండ్ ఏంటో చెప్పడం లేదు. అందుకే అమరావతి రైతులు రాజధానికి రాజముద్ర కోసం పట్టుబడుతూ వస్తున్నారు.
ఫ్యూచర్‌కు ఢోకా ఉండొద్దంటే అమరావతే రాజధాని అని కేంద్రంతో ఆమోదముద్ర వేయించాలని కోరుతున్నారు. రైతుల కోరిక ప్రకారం..భవిష్యత్‌లో ఏ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కూటమి సర్కార్ కూడా కేంద్రంతో చర్చలు జరిపి.. రాజధాని రాజముద్ర కోసం తీవ్ర ప్రయత్నాలే చేసింది. ఎట్టకేలకు ఏపీ రాజధాని అమరావతే అని క్లియర్ కట్‌గా చెప్పేందుకు..కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రక్రియ మొదలుపెట్టింది.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర విభజన చట్టం సవరణ చేసేందుకు కేంద్రం కొద్దిరోజుల కిందటే చర్యలు చేపట్టింది. దీనికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోదముద్ర వేయగా..కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత..త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందాక ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం..గెజిట్ విడుదల చేయనున్నారు.
విభజన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఎంపిక చేశారు. 29 గ్రామాల రైతులు ముందుకొచ్చి రాజధాని నిర్మాణం కోసం 34వేల ఎకరాల భూములు ఇచ్చారు. సింగపూర్ ప్రభుత్వ సహకారంతో మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. 2014 నుంచి 19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలను నిర్మించారు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక..మూడు రాజధానుల నినాదంతో..అమరావతి పనులు నిలిచిపోయాయి. 2024లో కూటమి అధికారంలోకి రావడంతో అమరావతికి మళ్లీ వెలుగులొచ్చాయి. రూ.58 వేల కోట్లతో పనులు ప్రారంభించారు. అమరావతికి ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా..రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ పార్లమెంటు ద్వారా విభజన చట్టాన్ని సవరించే ప్రాసెస్ స్పీడందుకుంది.
అమరావతి బిల్లుకు వైసీపీ సభ్యులు మద్దతిస్తారా లేదా?
రాష్ట్ర విభజన చట్టంలోని పదేళ్లకు మించకుండా ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింది. ఆ గడువు ముగియడంతో తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతోంది. ఇప్పుడు విభజన చట్టాన్ని సవరిస్తే ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటవుతుంది. అప్పుడు అమరావతి అన్‌స్టాపబుల్ అన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక పార్లమెంట్‌లో ఎలాగూ ఎన్డీయే పక్షాలకే బలం ఉండటంతో విభజన బిల్లు పాస్ అవడం ఈజీ కానుంది.
అయితే అమరావతి బిల్లు పార్లమెంట్‌కు వచ్చినప్పుడు వైసీపీ సభ్యులు మద్దతిస్తారా లేదా అన్నది కూడా ప్రజల్లో చర్చ పెట్టాలని చూస్తోందట కూటమి. భవిష్యత్‌లో మళ్లీ రాజధాని మార్పుపై ఎలాంటి నిర్ణయాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణకు శ్రీకారం చుట్టింది.
విభజన చట్టంలోని సవరణ ముసాయిదాకు కేంద్ర న్యాయశాఖ ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ముసాయిదాను ప్రధాని ఆధ్వర్యంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదించాల్సి ఉంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత, పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తారు. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత, రాష్ట్రపతి సంతకంతో అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ అధికారికంగా గెజిట్ రిలీజ్ కానుంది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే..ప్రజల్లో ఉన్న అయోమయానికి చెక్ పెట్టడంతో పాటు ఇన్వెస్టర్లలో నమ్మకం కలగనుంది. డిసెంబర్‌లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే అమరావతికి రాజముద్ర వేస్తూ..కొత్త ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: పాదయాత్ర 2.O.. జగన్ వ్యూహం అదేనా? వైసీపీని తిరిగి పవర్‌లోకి తెస్తుందా?