Ys Jagan Padayatra: పాదయాత్ర 2.O.. జగన్ వ్యూహం అదేనా? వైసీపీని తిరిగి పవర్‌లోకి తెస్తుందా?

జగన్ సీఎం అయిన తర్వాత ప్రజలతో గ్యాప్ పెరిగిందని..2024లో అధికారం కోల్పోవడానికి అది కూడా ఓ కారణంగా చెబుతున్నారు. సాధారణ జనానికే కాదు..ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా తగిన సమయం ఇచ్చే వారు కాదన్న ప్రచారం..

Ys Jagan Padayatra: పాదయాత్ర 2.O.. జగన్ వ్యూహం అదేనా? వైసీపీని తిరిగి పవర్‌లోకి తెస్తుందా?

Updated On : December 3, 2025 / 9:09 PM IST

Ys Jagan Padayatra: అది మామూలు ఓటమి కాదు. గెలుపు కూడా అంతే రీసౌండ్ చేయాలి. కమ్‌ బ్యాక్‌ ఆ ఓటమిని మరిపించేలా ఉండాలి. బౌన్స్ బ్యాక్ హిస్టరీని రిపీట్‌ చేయాలి. ఇదే ఎజెండాతో ఉన్నారట వైసీపీ అధినేత జగన్. మళ్లీ పవర్‌లోకి వచ్చి సత్తా చాటాలని స్కెచ్ వేస్తోన్న ఫ్యాన్ పార్టీ అధినేత..టూ ఇయర్స్ ప్లాన్‌ను రెడీ చేసి పెట్టుకున్నారట. ఎన్నికలకు ముందు రెండేళ్లు జనంలోనే ఉండేలా షెడ్యూల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారట. ముందు జిల్లాల టూర్, ఆ తర్వాత పాదయాత్రతో ప్రజాక్షేత్రంలోనే గడిపేలా రూట్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారట. ఇంతకు జగన్ ప్లానేంటి? అధినేత పాదయాత్ర వైసీపీని తిరిగి పవర్‌లోకి తెస్తుందా?

సైలెంట్‌గానే ఉన్నారు. అప్పుడప్పుడు సమయం సందర్భం చూసి మాట్లాడుతున్నారు. అలా అని తమ అధినేత లైట్‌ తీసుకోలేదంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. 2029లో ఫ్యాన్ స్పీడును తట్టుకోవడం ఎవరి తరం కాదని..మళ్లీ అదే స్థాయిలో తిరిగి పవర్‌లోకి వస్తామని ధీమాగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీని సెట్‌రైట్ చేసే పనిలో ఉన్నారట వైసీపీ అధినేత జగన్. ముందుగా నియోజకవర్గ ఇంచార్జ్‌లను మారుస్తూ..పనిచేస్తూ వారికి దిశానిర్దేశం చేస్తూ..తాను గ్రౌండ్‌లోకి దిగే నాటికి అంతా సిద్ధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

వచ్చే ఏడాది సమ్మర్‌లో మొదట జిల్లాల టూర్‌..!

న్యూఇయర్‌లో సరికొత్తగా..అంటే కూటమి రెండేళ్ల పాలన పూర్తయ్యే నాటికి జగన్‌ దూకుడు పెంచుతారని అంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో మొదట జిల్లాల టూర్‌కు ప్లాన్ చేస్తున్నారట జగన్. అంతలోపే అన్ని నియోజకవర్గాలకు ఇంచార్జ్‌ల నియామకం పూర్తి..సమన్వయకర్తలను యాక్టీవ్‌ చేయడంతో పాటు..పోరుబాటతో నిత్యం ప్రజల్లో ఉండేలా వ్యూహరచన రెడీ చేసి పెట్టారట. జిల్లాల టూర్ అయిపోగానే..పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారట జగన్.

ఈ 15 నెలల కాలంలో వైసీపీ పెద్దగా ఆందోళన కార్యక్రమాలేం చేపట్టలేదు. ఓటమి నుంచి తేరుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిద్దామంటే నేతలను కేసులు వెంటాడాయి. చాలా నియోజకవర్గాల్లో లీడర్లు యాక్టీవ్‌గా లేరు. క్యాడర్ నైరాశ్యంలో ఉంది. ఇంకో రెండు మూడు నెలలు అయితే అందరూ రంగంలోకి దిగుతారని..ఆ తర్వాత అధినేత ఫీల్డ్‌లోనే ఉంటారని అంటున్నారు.

ఈసారి 5వేల కిలోమీటర్ల పాదయాత్ర..?

మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారట జగన్. 2019 ఎన్నికలకు ముందు దాదాపు 3వేల 650 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 151 సీట్లతో అధికారాన్ని చేపట్టిన జగన్..మళ్లీ అధికారంలోకి రావాలంటే పాదయాత్ర ఒక్కటే మార్గంగా భావిస్తున్నారట. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన ప్రతి నాయకుడు తదుపరి ఎన్నికల్లో గెలుస్తున్నారనే సెంటిమెంట్‌ కూడా జగన్‌ను రెండోసారి పాదయాత్ర చేసేలా ఉసిగొల్పుతోందని అంటున్నారు. ఈసారి దాదాపు 5వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని భావిస్తున్న జగన్..ఇప్పటి నుంచి పాదయాత్ర ఏర్పాట్లు, రూట్‌ మ్యాప్‌పై దృష్టి పెట్టారని టాక్.

2029 ఎన్నికల వరకు జనంలోనే జగన్?

2029 ఎన్నికల వరకు జనంలోనే ఉండాలనుకుంటున్న జగన్..అదును చూసి అతిపెద్ద అస్త్రంతో రంగంలోకి దిగుతారని అంటున్నారు. సరిగ్గా ఎన్నికలకు రెండేళ్ల ముందు పాదయాత్రను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర మాత్రమే అయింది. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేసి ఎన్నికల నోటిఫికేషన్ వరకు జనంలోనే ఉండాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయించారని అంటున్నారు.

సీఎం అయ్యాక ప్రజలకు దూరం..!

జగన్ సీఎం అయిన తర్వాత ప్రజలతో గ్యాప్ పెరిగిందని..2024లో అధికారం కోల్పోవడానికి అది కూడా ఓ కారణంగా చెబుతున్నారు. సాధారణ జనానికే కాదు..ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా తగిన సమయం ఇచ్చే వారు కాదన్న ప్రచారం జనంలోకి బలంగా వెళ్లింది. అప్పటి ప్రతిపక్షం కూడా ఇదే అంశాన్ని ఎక్కువగా ప్రచారం చేసింది. అయితే ఈ ప్రచారానికి చెక్ పెట్టాలన్న ఆలోచనతో ఉన్న జగన్.. తానెప్పుడూ జనం మనిషినే అని నిరూపించుకోవాలని భావిస్తున్నారట. అందుకే 2.0 పాదయాత్రను బిగ్‌ స్కేల్‌లో ప్లాన్ చేస్తున్నారట. రాష్ట్రంలోని ప్రతి జిల్లా.. ప్రతి మండలం టచ్ చేసేలా మొత్తం 175 నియోజకవర్గాలు కవర్ చేసేలా పాదయాత్రను డిజైన్ చేయాలని జగన్ పార్టీ నేతలను ఆదేశించినట్లు ఇన్‌సైడ్‌ టాక్. జగన్ 2 ఇయర్స్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్‌ అవుతుందో..పాదయాత్ర ఆయనను తిరిగి పవర్‌లోకి తీసుకొస్తుందో లేదో చూడాలి.

Also Read: పవన్ దిష్టి వ్యాఖ్యలపై ఆగని రాజకీయ దుమారం.. తెలంగాణ నేతల సీరియస్ రియాక్షన్