CM Chandrababu Naidu - TDP
AP New Districts: జిల్లాలు. ఏపీలో ఇది తెగని పంచాయితీ. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాలపైనే రచ్చ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు కూటమి సర్కార్ కొత్త జిల్లాలు అంటోంది. జిల్లాల సరిహద్దుల గొడవే సద్దుమణగలేదు. ఇప్పుడు మూడు కొత్త జిల్లాలు అంటున్నారు. పైగా అసెంబ్లీ సెషన్‌లోపే కమిటీ రిపోర్ట్ తెప్పించుకుని జిల్లాల ఇష్యూకు చెక్ పెట్టాలని భావిస్తున్నారట సీఎం చంద్రబాబు. కొత్తగా ఏర్పడే జిల్లాలు ఏంటి? జిల్లాల కేంద్రాల సమస్యను సాల్వ్ చేస్తారా?
ఏపీలో జిల్లాల తుట్టె మళ్లీ కదిలినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లాల రీఆర్గనైజేషన్ చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. ఇప్పుడు కూటమి సర్కార్ కొత్త జిల్లాలు అంటోంది. పైగా మూడు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయాలని డిసైడ్ అయిందని కూడా అంటున్నారు. ఇప్పటికే YSR జిల్లా పేరును..YSR కడప జిల్లాగా మార్చింది. దీంతో అప్పట్లోనే కొత్త డిమాండ్లు తెరమీదకు వచ్చాయి.
ఎన్టీఆర్ జిల్లా పేరును విజయవాడగా మార్చాలన్న వాదన బలంగా వినిపించింది. గత ప్రభుత్వ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన కొన్ని జిల్లా కేంద్రాలపై ప్రజల్లో ఎప్పటి నుంచో అసంతృప్తి ఉంది. ఈ గందరగోళానికి చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పు, సర్దుబాట్లపై స్టడీ చేయడానికి ఏడుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్‌కమిటీని వేసింది.
మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ప్రజల నుంచి వినతులు స్వీకరించింది. అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది. రెండు, మూడు జిల్లాల ఏర్పాటు చేయడంతో పాటు కొన్నిచోట్ల హద్దులు మారుస్తారని అంటున్నారు.
త్వరలో జనగణన చేపట్టనున్నారు. దాంతో 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులకు అవకాశం లేదు. అంటే.. 2025 డిసెంబరు 31లోగానే జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులను డిసైడ్ చేసి అమలు చేయాల్సి ఉంటుంది.
అయితే ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి కలిపి ఐదు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారట.
ఇక బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాల్ని..మళ్లీ ప్రకాశం జిల్లాలో కలిపితే అక్కడి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారట. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలోకి తెస్తే..ఒంగోలు, కొండపి, సంతనూతలపాడుతో కలిపి మొత్తం ఐదు నియోజకవర్గాలవుతాయి. అప్పుడు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఐదేసి సెగ్మెంట్ల చొప్పున సమంగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అమరావతి కేంద్రంగా కొత్తగా అర్బన్ జిల్లా ఏర్పాటు యోచన ఉందట. రాష్ట్ర రాజధాని కేంద్రంగా రాజధాని పరిధిలోని 29 గ్రామాలు గుంటూరు జిల్లా మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోకి వస్తాయి. వీటితో పాటు పెదకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు అమరావతికి దగ్గరగా ఉంటాయి. వీటితో కొత్త అర్బన్ జిల్లా ఏర్పాటు చేస్తే ఐదు నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది.
గుంటూరు జిల్లాలోనూ గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి కలిపి ఐదు నియోజకవర్గాలవుతాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్ని..ఎన్టీఆర్ జిల్లాలో కలిపితే ఎలా ఉంటుందని పరిశీలిస్తున్నారట. ఈ దీంతో ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు, పశ్చిమ, విజయవాడ సెంట్రల్ తో పాటు తిరువూరు, మైలవరం, గన్నవరం, పెనమలూరు సహా ఏడు నియోజకవర్గాలు అవుతాయి.
కృష్ణా జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది. ఏజెన్సీలోని రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరుకు 187 కి.మీ. పైగా ప్రయాణించాలి. పరిపాలనా పరంగా ఇబ్బంది ఉంది. రంపచోడవరం డివిజన్‌తో పాటు చింతూరు డివిజన్‌లోని నాలుగు విలీన మండలాలు కలిపి..ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే అక్కడి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే అభిప్రాయాలున్నాయి.
అయితే క్యాబినెట్ సబ్‌కమిటీ రిపోర్ట్‌ను బేస్ చేసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరీ అసెంబ్లీ సెషన్‌లోపే జిల్లా ఇష్యూను సాల్వ్ చేస్తారా లేక ఇంకా కొంచెం టైమ్ తీసుకుంటారా అనేది చూడాలి.
Also Read: వైఎస్‌ఆర్ వారసుడు ఎవరు? షర్మిల వాదన ఏంటి.. వైసీపీ అబ్జక్షన్స్ దేనికి..