Chandrababu Naidu Representative Image (Image Credit To Original Source)
AP Skill Scam: ఆ కేసు ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేసింది. థర్టీ ఇయర్సీ ఇండస్ట్రీగా పేరున్న నేతకు నెక్స్ట్ లెవల్ హైప్‌ను తెచ్చి పెట్టింది. యావత్ నవ్యాంధ్రను మొత్తం కదలించింది. వైసీపీ ప్రభుత్వం నుంచి దిగిపోవడానికి..కూటమి పవర్‌లోకి రావడానికి ఆ కేసు కూడా ఓ కారణమన్న చర్చ ఉంది. అలాంటి కేసులో అసలేం లేదు..అంతా ఉట్టిదే అంటూ కోర్టు క్లోజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైనా నిజం బయటపడిందని టీడీపీ లీడర్లు తెగ హ్యాపీ అయిపోతుంటే..ఫ్యాన్ పార్టీ లీడర్లు మాత్రం అధికారంలోకి వస్తే మళ్లీ బయటికి తీస్తామంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఇంతకీ స్కిల్ స్కాం కేసు ఎక్కడ స్టార్ట్ అయింది? ఎండ్‌కార్డ్ పడ్డట్లేనా? వైసీపీ నేతలు చెప్తున్నట్లు ఇంకా స్కోప్ ఉందా?
నిజం ఇవాళ కాకపోతే రేపైనా బయట పడుతుంది. కానీ అప్పటిలోపు అబద్దం ఊరంతా చుట్టి వస్తుంది. ఏపీ స్కిల్ స్కాం కేసులో ఇదే జరిగిందంటున్నారు టీడీపీ నేతలు. కాకపోతే వాస్తవమేంటో ప్రజలకు క్లారిటీ రావడానికి టైమ్ పట్టిందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు స్కిల్ స్కీమ్‌లో నిధులు మళ్లించారనేది ప్రధాన ఆరోపణ. అదే అంశంపై వైసీపీ హయాంలో..గత ఎన్నికలకు ముందు చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసి..53 రోజుల పాటు జైలుకు కూడా పంపింది. ఆ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయి. మూడు పార్టీలు ఏకతాటిపైకి రావడానికి దారితీశాయన్న చర్చ ఉంది.
ఫైనల్‌గా వైసీపీ గద్దె దిగడానికి ఆ కేసు కూడా ప్రధాన కారణన్న ఒపీనియన్స్ ఉన్నాయ్. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులను కూడా ప్రకటించేశారు. అంత సంచలనాలకు దారితీసిన స్కిల్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. స్కిల్ స్కామ్ కేసు విచారణను కొట్టేసింది న్యాయస్థానం. మొత్తం వ్యవహారంలో నిధులు మిస్ యూజ్ చేసినట్లు ఎక్కడా ప్రూఫ్ చూపించలేదని తెలిపింది. దీంతో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా టీడీపీ నేతలు చెప్తున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుపై ఏసీబీ కోర్టు తీసుకున్న నిర్ణయంతో..సీఎం చంద్రబాబుతో సహా 37 మందికి బిగ్ రిలీఫ్ దక్కినట్లు అయింది. సీఎం చంద్రబాబుతో పాటు మిగిలిన నిందితులపై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీఐడీ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ రిపోర్ట్ సబ్‌మిట్ చేసింది. దీంతో విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ కోర్టు ప్రకటించింది.
2014 నుంచి 19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు యువతలో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం..స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సీమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. రూ.3,356 కోట్ల విలువైన ప్రాజెక్టులో సీమెన్స్ కంపెనీ వాటా 90 శాతం, మిగతా పది శాతం ఏపీ ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో నిధులు మిస్ యూజ్ అయ్యాయని అప్పట్లో సీఐడీ కేసు నమోదు చేసింది. మెన్స్ కంపెనీ వాటా 90 శాతమని చెప్పినా..ప్రభుత్వ నిధులనే వాటాగా చూపించారని ఆరోపించింది.
సీమెన్స్ కంపెనీ ఎలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించకున్నా, దాని నుంచి నిధులు రాకపోయినా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ సంస్థకు రూ.371 కోట్లు విడుదల చేసిందని, ఆ నిధులు చంద్రబాబు షెల్ కంపెనీలకు మళ్లించారని ఆరోపిస్తూ నాటి ప్రభుత్వం కేసు నమోదు పెట్టింది. ఈ క్రమంలో 2023 సెప్టెంబర్ లో ప్రజాగళం యాత్రలో ఉన్న నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఈ ఇష్యూ అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. చంద్రబాబును 53 రోజుల పాటు జైలులో పెట్టడంతో సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం జరిగింది. ఈ పరిణామం అప్పట్లో కూటమి ఏర్పాటుకు బలమైన పునాదులు వేసిందన్న టాక్ ఉంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అరెస్టు ప్రభావం చూపిందని, ఆ ఎఫెక్ట్‌తో కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టిందన్న ఒపీనియన్స్ కూడా ఉన్నాయి.
రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన కేసులో అలిగేషన్స్.. వాస్తవాలు కాదంటూ సీఐడీ రిపోర్ట్ ఇచ్చింది. అయితే సీఐడీ చర్యలను విపక్ష వైసీపీ తప్పుపడుతోంది. సీఎం చంద్రబాబు తనపై ఉన్న ఆరోపణలను ఎలా తోసిపుచ్చకోగలరని వైసీపీ ప్రశ్నిస్తోంది. స్కిల్ కేసు ఒక్కటే కాదు వైసీపీ హయాంలో చంద్రబాబుపై నమోదైన అన్ని కేసులను క్లోజ్ చేయించుకుంటున్నారనేది ఫ్యాన్ పార్టీ లీడర్ల వాదన.
అధికారంలోకి వస్తే కేసులు రీఓపెన్ చేస్తామని వార్నింగ్..
తాము అధికారంలోకి వస్తే మళ్లీ కేసులు రీఓపెన్ చేయిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అవసరమైతే పైకోర్టుకు వెళ్తామంటూ కూడా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. అయితే వైసీపీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడే ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారని, చంద్రబాబుపై కక్ష సాధించేందుకే అక్రమ కేసులు పెట్టారని కూటమి నేతలు ఎదురుదాడి చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.