10 Minute Delivery: 10 మినిట్ డెలివరీ బంద్.. కేంద్రం సంచలన నిర్ణయం
10 నిమిషాల డెలివరీ విధానంతో తమపై విపరీతమైన ఒత్తిడి ఉంటోందని వారు వాపోయారు. వేగంగా వెళ్లే క్రమంలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని గిగ్ వర్కర్లు ఆవేదన వ్కక్తం చేశారు.
10 Minute Delivery Representative Image (Image Credit To Original Source)
- గిగ్ వర్కర్లకు బిగ్ రిలీఫ్
- 10 మినిట్ డెలివరీ డెడ్‌లైన్ విధానం ఎత్తివేత
- యాడ్స్ ఇవ్వొద్దని క్విక్ కామర్స్ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు
10 Minute Delivery: 10 నిమిషాల ఆన్ లైన్ డెలివరీ విధానంపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ విధానాన్ని ఎత్తివేస్తూ కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన యాడ్స్ ఇవ్వకూడదు అంటూ బ్లింకిట్ సహా అన్ని క్విక్ కామర్స్ సంస్థలకు ఆయన సూచించారు. కాగా 10 నిమిషాల నిబంధనను ఎత్తివేయాలంటూ ఇటీవల గిగ్ వర్కర్లు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. 10 నిమిషాల డెలివరీ విధానంతో తమపై విపరీతమైన ఒత్తిడి ఉంటోందని వారు వాపోయారు.
వేగంగా వెళ్లే క్రమంలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని గిగ్ వర్కర్లు ఆవేదన వ్కక్తం చేశారు. దీంతో 10 మినిట్ డెలివరీ విధానంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం.. గిగ్ వర్కర్లకు బిగ్ రిలీఫ్ ఇస్తూ 10 మినిట్ డెలివరీ విధానాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
డెలివరీ సమయపాలనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి బ్లింకిట్, జెప్టో, జొమాటో, స్విగ్గీ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లతో ఒక సమావేశం జరిగింది. తప్పనిసరి 10 నిమిషాల డెలివరీ గడువును తొలగించాలని డెలివరీ అగ్రిగేటర్లను కేంద్రం ఒప్పించింది.
బ్రాండింగ్ మేసేజ్ ని అప్ డేట్ చేసిన బ్లింకిట్..
బ్లింకిట్ ఇప్పటికే కేంద్రం ఆదేశాలను అమలు చేసింది. 10 నిమిషాల డెలివరీ వాగ్దానాన్ని దాని బ్రాండింగ్ నుండి తొలగించింది. రాబోయే రోజుల్లో ఇతర అగ్రిగేటర్లు కూడా దీనిని అనుసరిస్తారని భావిస్తున్నారు. గిగ్ కార్మికులకు మరింత భద్రత, మెరుగైన పని పరిస్థితులను నిర్ధారించడం ఈ చర్య లక్ష్యం. ఈ మార్పులో భాగంగా, బ్లింకిట్ తన బ్రాండ్ మేసేజ్ ని అప్ డేట్ చేసింది. కంపెనీ ప్రధాన ట్యాగ్‌లైన్‌ను “10 నిమిషాల్లో 10,000+ ఉత్పత్తులు డెలివరీ చేయబడ్డాయి” నుండి “30,000+ ఉత్పత్తులు మీ ఇంటి వద్దకే డెలివరీ చేయబడ్డాయి”గా అని సవరించింది.

10 Minute Delivery Deadline Representative Image (Image Credit To Original Source)
గిగ్ కార్మికుల భద్రతపై ఆందోళనలు..
గిగ్ కార్మికుల పని పరిస్థితులు, వారి భద్రత గురించి విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలి పార్లమెంటు సమావేశంలో ఆప్ రాజ్యసభ సభ్యుడు భారత దేశ గిగ్ కార్మికుల బాధ దుఃఖం గురించి మాట్లాడారు. వారు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని వాపోయారు. కొన్నిసార్లు కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తారు తెలిపారు.
క్విక్ కామర్స్, ఇతర యాప్ ఆధారిత డెలివరీ సేవా వ్యాపారాలకు నిబంధనలు తీసుకురావాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్రాన్ని డిమాండ్ చేశారు గిగ్ కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాల అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. గిగ్ కార్మికులకు గౌరవం, రక్షణ, న్యాయమైన వేతనం కోసం ఆయన పిలుపునిచ్చారు.
మొదటిసారిగా, ‘గిగ్ వర్కర్లు’, ‘ప్లాట్‌ఫామ్ వర్కర్లు’ నిర్వచనం.. వాటికి సంబంధించిన నిబంధనలు నవంబర్ 21, 2025 నుండి అమల్లోకి వచ్చిన 2020 సామాజిక భద్రత నియమావళిలో పొందుపరిచ్చారు. వైకల్యానికి బీమా, ప్రమాద బీమా, ఆరోగ్యం, ప్రసూతి ప్రయోజనాలు, వృద్ధాప్య రక్షణ మొదలైన వాటికి సంబంధించిన విషయాలపై గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్ కార్మికులకు తగిన సామాజిక భద్రతా చర్యలను రూపొందించడానికి కోడ్ ఉపయోగపడుతుంది. సంక్షేమ పథకాలకు ఆర్థిక సాయం చేయడానికి సామాజిక భద్రతా నిధిని ఏర్పాటు చేయాలని కోడ్ లో ఉంది. గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమం కోసం జాతీయ సామాజిక భద్రతా బోర్డును ఏర్పాటు చేయాలని కోడ్ లో పొందుపరిచారు.
