Ysrcp Mlas: వైసీపీ తగ్గడం లేదు. అపోజిషన్ హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తామంటోంది. మరోవైపు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు అటెండ్ అవ్వకుండానే సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నారని స్పీకర్ ఫైర్ అవుతున్నారు. 60 రోజుల అటెండెన్స్ లేని వాళ్ళ మీద చర్యలంటూ అయ్యన్న బాంబు పేల్చారు. ఎథిక్స్ కమిటీ ఏర్పాటుతో ఇష్యూ ఇంకా హీటెక్కింది. అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా? ఎథిక్స్ కమిటీ ఏం తేల్చబోతోంది? జగన్‌తో సహా 11మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బై ఎలక్షన్స్‌కు వెళ్లబోతున్నారా?
వైసీపీ సభకు వెళ్లదు. కూటమి మాత్రం సభకు రండి..ప్రజా సమస్యలపై చర్చించండి అంటూ పదే పదే పిలుపునిస్తుంటుంది. వైసీపీ మాత్రం ప్రతిపక్ష హోదాకు ముడిపెట్టి సభకు వెళ్లడం లేదు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 15 నెలల కాలం సభకు రాకుండానే వైసీపీ సభ్యులు దూరంగా ఉంటున్నారు. దీంతో అసెంబ్లీకి హాజరుకాని వైసీపీ సభ్యులపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. అసెంబ్లీ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి..సభకు డుమ్మా కొడుతూ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం ఎంతవరకు సబబు అన్నది స్పీకర్ వాదన.
లేటెస్ట్‌గా ఎథిక్స్ కమిటీ సమావేశమై ఇదే అంశం మీద చర్చించిందని అంటున్నారు. అసెంబ్లీకి రాకుండానే రిజిస్టర్‌లో సంతకాలు పెట్టిన ఎమ్మెల్యేల ఇష్యూపై డిస్కషన్ జరిగిందట. ఎవరైతే సభకు అటెండ్ కాకుండా..సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నారో వారిని గుర్తించారట. అలా సభకు రాకుండా సంతకాలు చేయడం నైతిక విలువల ప్రకారం చేయకూడని పని కాబట్టి ఎథిక్స్ కమిటీ వీరి విషయంలో చర్యలకు సిఫార్సు చేస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది.
అయితే వీరి మీద వేటు వేయడానికే అధికార పక్షం కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందన్న టాక్ నడుస్తోంది. సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారన్న విషయాన్ని జనంలోకి తీసుకోపోవడం ద్వారా ఆయా ఎమ్మెల్యేల తీరు బాగా వివరించి జనాలతోనే అవును అనిపించేలా చేసి వేటు వేస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి అంటే డిసెంబర్‌లో జరిగే శీతాకాల సమావేశాల నాటికి వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలుంటాయని అయితే ప్రచారం జరుగుతోంది.
సభకు వరుసగా 60 రోజులు రాకపోతే అనర్హత వేటు వేస్తామని అధికార పక్షం ఇప్పటికే హెచ్చరించింది. ఇప్పుడు జీతాలు తీసుకుంటూ సభకు రావడం లేదంటూ స్పీకర్ సీరియస్ అవుతున్నారు. ఈ అంశంపైనే ఎథిక్స్ కమిటీ భేటీ అవడంతో ఏపీ పాలిటిక్స్ లో హీట్ క్రియేట్ అవుతోంది. అయితే కూటమి లేవనెత్తిన ఈ రెండు అంశాలను వైసీపీ బెదిరింపుగానే భావిస్తోంది. అనర్హత ఎలా వేస్తారో చూస్తామని సవాల్ విసురుతోంది. ఇక తమ అధినేతకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తామని మరోసారి స్పష్టం చేస్తోంది.
అయితే సభకు రామని మొండి పట్టుదలతో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరైనట్లు సంతకాలు చేయడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. సభలో కనిపించని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతున్నట్లు సంతకాలు చేయడాన్ని అధికార పక్షం తప్పుబడుతోంది. కొందరు జీతాలు కోసమే ఇలా సంతకాలు చేస్తున్నారని, మరికొందరు అనర్హత వేటు నుంచి తప్పించుకోడానికే సంతకాలు చేసి వెళ్లిపోతున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ పరిణామాల మధ్యే శాసనసభ ఎథిక్స్ కమిటీ భేటీ జరిగింది. వైసీపీ సభ్యులు సభకు రాకుండా రిజిస్టర్ లో సంతకాలు పెట్టి, జీతభత్యాలు తీసుకోవడంపై చర్చించారు. దీంతో వైసీపీ సభ్యుల హాజరుపై పెద్ద రాజకీయ దుమారం చెలరేగే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రస్తుతం సెషన్ నడుస్తున్న క్రమంలో సభకు హాజరవకుంటే అనర్హత వేటు వేస్తామని, ఉప ఎన్నికలు వస్తాయని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మళ్లీ హెచ్చరించారు. ఇదే ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అయ్యింది. తమ ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో గతంలోనే స్పందించారు వైపీసీ అధినేత జగన్. వాళ్ళకు నచ్చినట్టు చేసుకోమని జగన్ ఔట్ రైట్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ మధ్యే ఎల్పీ మీటింగ్ నిర్వహించిన జగన్ అధికార పక్షం నుంచి వస్తున్న కామెంట్స్ పై డిస్కస్ చేశారట.
ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లు..అనర్హత వేటు అంశాన్ని ప్రస్తావించారట. దీంతో చర్యలు తీసుకోనివ్వండి..చూద్దాం అన్నట్టుగా జగన్ రియాక్ట్ అయ్యారట. అవసరమైతే రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు వెనకాడొద్దని..ఎల్పీ మీటింగ్ లో చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. సేమ్ టైమ్ సభకు హాజరుకాని సభ్యులపై ఏకపక్షంగా చర్యలు తీసుకోవడం కూడా సాధ్యం కాదనేది వైసీపీ వర్షన్. చర్యలు తీసుకోబోయే ముందు స్పీకర్ వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలి. ఆ నోటీసులకు వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్లిచ్చిన సమాధానాలకు స్పీకర్ సంతృప్తి చెందకపోతేనే..చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఈ విషయంలో ఇప్పటికే వైసీపీ కోర్టుకెళ్లి ఉండటం, స్పీకర్ యాక్షన్ తీసుకున్నా మళ్లీ కోర్టు మెట్లెక్కే అవకాశం ఉండటంతో..కూటమిది ఉట్టి హడావుడి అని భావిస్తోందట వైసీపీ. సభకు హాజరవలేదని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్న దాఖలాలు దేశంలో ఎక్కడా లేవని గుర్తు చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. రాజకీయ సవాళ్ళకు, లీగల్‌గా తీసుకునే చర్యలకు చాలా తేడా ఉంటుందని అంటున్నారు. అయితే వైసీపీ ప్రస్తావిస్తున్న లాజిక్స్ అన్నీ తెలియకుండానే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కామెంట్ చేస్తారా? ఎథిక్స్ కమిటీ చర్యలకు సిద్ధమవుతుందా అనేది ఇంకో చర్చ. దీంతో అధికార పక్షం యాక్షన్, వైసీపీ రియాక్షన్ ఎలా ఉండబోతున్నాయన్నది చూడాలి.
Also Read: అప్పుడు లోకేశ్ రెడ్ బుక్, ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్..! ఈ రివేంజ్ గేమ్ ఆగేదెప్పుడు..?