×
Ad

Nellore Janasena Group War: నెల్లూరు జనసేనలో గ్రూప్‌ వార్‌..! టిడ్కో ఛైర్మన్ పై అధిష్టానానికి ఫిర్యాదు.. ఎందుకు..

నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో..జనసేన నియోజకవర్గ ఇంచార్జ్‌లంతా ఒక్కతాటిపైకి వచ్చి దుమ్మెత్తిపోస్తున్నారట.

Nellore Janasena Group War: ఆ జిల్లాలో గ్లాస్‌ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా లేదు. కానీ అన్ని నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లు ఉన్నారు. నెల్లూరు టౌన్‌లో మాత్రం పార్టీ యాక్టివిటీ కాస్త గట్టిగానే నడుస్తోంది. కార్పొరేషన్‌ పదవి దక్కించుకున్న ఓ జనసేన నేత తీరే రచ్చకు దారితీస్తోంది. ఆయన తీరు బాలేదంటూ..సింహపురి జనసేన లీడర్లంతా తిరుగుబావుటా ఎగురవేశారు. ఆ లీడర్‌ ఒంటెద్దు పోకడలతో పార్టీని నాశనం చేస్తున్నాడని మండిపడుతున్నారు. మొదటి నుంచి పనిచేసిన వారిని పక్కన పెట్టి, పార్టీలో వర్గాలను క్రియేట్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఇంతకు గ్లాస్‌ పార్టీలో ఈ తుఫాను ఎందుకు? గ్రూప్ వార్‌కు తెరదీసిందెవరు?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. 2024 ఎన్నికలకు ముందు అప్పటి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి జనసేనను వీడి వైసీపీలోకి వెళ్లడంతో అప్పటి నుంచి పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గునుకుల కిషోర్, నూనె మల్లికార్జున యాదవ్, సుజయ్ బాబు, నలిశెట్టి శ్రీధర్, వంటి నాయకులు తప్ప చెప్పుకోదగ్గ నాయకులెవరూ ఆ పార్టీలో లేకుండా పోయారు. దీంతో జనసేన పార్టీ ప్రభావం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పెద్దగా కనిపించేది కాదు. ఉన్న నాయకులే ఏదో ఒక కార్యక్రమంతో జనాల్లోకి వస్తూ పార్టీని ఎంతో కొంత బలోపేతం చేయాలని ప్రయత్నించే వారు.

యాంటీ వర్గం అంతా ఏకమై ఆరోపణలు, విమర్శలు..

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బలోపేతం దిశగా ముందుకెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన నేతల వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. జనసేన నేత, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్‌ను టార్గెట్ చేసుకొని పార్టీలో మొదటి నుంచి ఉన్న నియోజకవర్గ ఇంచార్జ్‌లందరూ తిరుగుబాటు ఎగుర వేశారు. అజయ్ కుమార్ యాంటీ వర్గం అంతా ఏకమై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు.

జిల్లాలో పార్టీని అజయ్ కుమార్ సర్వ నాశనం చేస్తున్నారని.. పార్టీని రోడ్డున పడేస్తున్నారని మండిపడుతున్నారు. తామందరం కష్టపడితే.. లాబీయింగ్ చేసి అజయ్ కుమార్ పదవి తెచ్చుకున్నారనేది ఆయన వ్యతిరేక వర్గం వాదన. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన నాయకులందరినీ పక్కన పెట్టేసి తన వర్గానికి చెందిన కొత్త వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని అజయ్ కుమార్‌ తీరును తప్పుబడుతున్నారు. అంతేకాక జనసేన నియోజకవర్గ ఇంచార్జిలకు పనులు చేయొద్దంటూ..మంత్రులకు, ఎమ్మెల్యేలకు అజయ్ కుమార్ సూచిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు..

పార్టీ అధికారంలోకి రావడానికి తామంతా కృషి చేస్తే.. తమ కష్టాన్ని అధిష్టానం దగ్గర తాకట్టు పెట్టి అజయ్ కుమార్ నామినేటెడ్ పదవి తెచ్చుకుని ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. జిల్లాలో పార్టీ కోసం ఏనాడూ పని చేయకుండా, ఇప్పుడు పదవితో నెల్లూరుకు వచ్చి పార్టీలో గ్రూపులు కట్టి, గందరగోళానికి దారితీస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. ఎన్నికల సమయంలోనే వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న గూడూరు వెంకటేశ్వర్లు సైతం అజయ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారట. జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు అప్ప ట్లో కలకలం రేపాయి. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అజయ్‌పై విమర్శలు వచ్చాయి.

వేములపాటి అజయ్‌కుమార్ మొన్నటి వరకు కూడా రాజకీయాల్లో పెద్దగా పరిచయం లేని వ్యక్తి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నాగబాబులతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి. ప్రభుత్వంలో జనసేన భాగమైనప్పటి నుంచి..నెల్లూరు జిల్లాలో అన్ని తానై వ్యవహరిస్తున్నారట. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనకు క్యాడర్ ఉంది. కోవూరు, వెంకటగిరి, ఆత్మకూరులో కూడా ఎంతో కొంత కార్యకర్తలు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో అజయ్ కుమార్ మరొక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

పవన్ కల్యాణ్, నాగబాబు దగ్గరికి ఎవరినీ పోనివ్వకుండా..అంతా తానే అన్నట్లు అజయ్ కుమార్ వ్యవహరిస్తున్నారట. ఇదే జనసేన పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న నేతలకు ఆగ్రహం తెప్పిస్తుందట. అజయ్ కుమార్‌ను కాదని ఎవరైనా పవన్ కల్యాణ్‌ను గానీ, నాదెండ్ల మనోహర్‌ను కానీ కలిస్తే వారిని దూరం పెట్టేలా వ్యవహరిస్తున్నారట. అందుకే నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో..జనసేన నియోజకవర్గ ఇంచార్జ్‌లంతా ఒక్కతాటిపైకి వచ్చి దుమ్మెత్తిపోస్తున్నారట.

కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలతో..అజయ్ కుమార్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ పార్టీ బలోపేతం చేయకుండా గ్రూప్‌లను ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు. పార్టీ బలోపేతానికి ఒక్క కార్యక్రమం కూడా ఆయన చేయడం లేదట. సొంతంగా కార్యక్రమం చేసేవారిని సైతం అడ్డుకుని ఇబ్బంది పెడుతున్నారట. అజయ్ కుమార్ లాంటి వ్యక్తులు నెల్లూరు జనసేనలో ఉంటే పార్టీ ఎప్పటికీ బలోపేతం కాదని నేతలు అధి ష్టానానికి ఫిర్యాదు చేశారట. సింహపురి జన సైనికుల వివాదంపై పవన్ కల్యాణ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Also Read: ఎన్నికలకు మూడేళ్ల ముందే.. టీడీపీ ఎంపీ సంచలన ప్రకటన.. అసలు ఆయన పొలిటికల్ ప్లాన్ ఏంటి?