Magunta Sreenivasulu Reddy: ఎన్నికలకు మూడేళ్ల ముందే.. టీడీపీ ఎంపీ సంచలన ప్రకటన.. అసలు ఆయన పొలిటికల్ ప్లాన్ ఏంటి?
1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలు నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014 ఎన్నికలప్పుడు మాగుంట కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి టీడీపీలో చేరి..

Magunta Sreenivasulu Reddy: ఎప్పటి నుంచో ఓ కల. తన తనయుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తేవాలన్న ఆశ. గత ఎన్నికల్లోనే బరిలోకి దించాలనుకున్నారు. కానీ టీడీపీ అధినేత నో చెప్పడంతో తానే బరిలోకి దిగారు. ఇప్పుడు ఎన్నికలకు ఇంకో మూడేళ్ల టైమ్ ఉండగానే..అప్పుడే తన వారసుడి పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు ఆ ఎంపీ గారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు నుంచి తన కుమారుడు పోటీ చేస్తాడంటూ ప్రకటించారు మాగుంట శ్రీనివాసులురెడ్డి. ఎంపీ గారి ప్రకటన వెనుక ప్లానేంటి? ఇప్పటి నుంచే తన వారసుడికి లైన్ క్లియర్ చేస్తున్నారా? అసలు మాగుంట పొలిటికల్ ప్లాన్ ఏంటి?
ఊహించిందే జరిగింది. ఒంగోలు ప్రజలకు అంతో క్లారిటీ ఉంది. ఆయన కూడా అదును చూసి ప్రకటన చేశారు. బర్త్ డే సందర్భంగా..సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని అంటూనే..తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తెలిపారు. చంద్రబాబు ఆదేశాల ప్రకారమే గత ఎన్నికల్లో తాను పోటీ చేశానని చెప్పుకొచ్చారు.
మాగుంట కుటుంబ రాజకీయ వారసుడిగా రాఘవరెడ్డిని రంగంలోకి దింపాలని శ్రీనివాసులు రెడ్డి ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నారు. వయస్సు మీద పడుతుండటంతో తన కుటుంబ వారసుడిని రంగంలోకి దింపేందుకు ఇదే కరెక్ట్ సమయమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లోనే టీడీపీ నుండి తన కుమారుడిని ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా రంగంలోకి దింపేందుకు శతవిధాలా ప్రయత్నించారు ఎంపీ మాగుంట. మొన్నటి సారి ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి, గిద్దలూరు లేదా దర్శి అసెంబ్లీ నుంచి మాగుంట కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం నడిచింది. కానీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలోకి దిగేందుకు రాఘవరెడ్డి ఆసక్తి చూపలేదట.
తనయుడి రాజకీయ అరంగేట్రానికి ఇదే సరైన టైమ్..!
అయితే టీడీపీ అధిష్టానం రాఘవరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పరిగణలోకి తీసుకున్నా.. సర్వేల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డికే ప్రజలు ఓటేశారని ఆయన వైపే మొగ్గు చూపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో రాఘవరెడ్డిపై ఆరోపణలు..అరెస్టులు వంటి కీలక పరిణామాలతో తప్పని పరిస్థితుల్లో మాగుంటనే బరిలో దింపింది టీడీపీ అధిష్టానం. ఓవైపు వయోభారం..మరోవైపు తన కుమారుడి పొలిటికల్ ఎంట్రీ కోసం ఆశపడుతున్న మాగుంట శ్రీనివాసులురెడ్డి..తన తనయుడు రాజకీయ అరంగేట్రానికి ఇదే సరైన టైమ్ అని భావిస్తున్నారట. తాను రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నప్పుడే తన కుమారుడిని వారసుడిగా లైన్‌లోకి దింపి తమ కుటుంబ చరిష్మాను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారట మాగుంట. దీంతో జన్మదిన వేడుకల సందర్భంగా తన మనసులో మాటను మరోసారి బయటపెట్టారు ఎంపీ మాగుంట.
మాగుంట రాఘవరెడ్డి ఇప్పటికే పొలిటికల్‌గా యాక్టీవ్‌గా ఉంటున్నారు. తన తండ్రి శ్రీనివాసులురెడ్డి రాజకీయ వ్యవహారాలతో పాటు వ్యాపారాల్లో చేదోడువాదోడుగా ఉంటూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల టైమ్‌లో కూడా రాఘవరెడ్డి ప్రచారం చేశారు. మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్‌లోని ఏడు నియోజకవర్గాల్లో స్వచ్చంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల తర్వాత కూడా యాక్టీవ్‌గా ఉంటూ వస్తున్నారు రాఘవరెడ్డి. నియోజకవర్గాల వారీగా నేతలను కలుస్తూ..సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతున్నారు. అటు యువతతో..ఇటు సీనియర్ నేతలతో కోఆర్డినేట్ చేసుకుంటూ అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
మాగుంట ఫ్యామిలీకి 30 ఏళ్ల పొలిటికల్ ట్రాక్ రికార్డ్..
మాగుంట ఫ్యామిలీకి 30 ఏళ్ల పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉంది. మాగుంట శ్రీనివాసులరెడ్డి తన సోదరుడు మాగుంట సుబ్బిరామిరెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. 1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలు నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014 ఎన్నికలప్పుడు మాగుంట కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి టీడీపీలో చేరి 2014లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2015లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరుపున ఎమ్మెల్సీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి..2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి గెలిచారు మాగుంట శ్రీనివాసులురెడ్డి. ఇక ఇప్పుడు తన ఫ్యామిలీ రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేసేందుకు కొడుకు రాఘవరెడ్డిని బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరి మాగంటి వారసుడిగా రాఘవరెడ్డి పాలిటిక్స్‌లో ఎంతవరకు రాణిస్తారో చూడాలి మరి.