Peela Brothers Representative Image (Image Credit To Original Source)
Peela Brothers: ఒకే ఫ్యామిలీ. ఆ ఇద్దరు బ్రదర్స్ కాస్త.. ఒకే పార్టీలో ఉన్నారు. పైగా ప్రోటోకాల్ పరంగా మంచి పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. పైగా వాళ్లిద్దరు ఉమ్మడి విశాఖ జిల్లాలో పొలిటికల్‌గా చాలా పవర్ ఫుల్ లీడర్లు. ఒకరు విశాఖ సిటీలో చక్రం తిప్పితే, మరొకరు అనకాపల్లి జిల్లాలో హవా నడిపిస్తుంటారు. అయితే ఆ ఇద్దరు సోదరుల తీరు..ముక్కు మీద కోపం..ఇప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే టీడీపీకి హెడెక్‌గా మారిందట. ఇంతకీ ఎవరా బ్రదర్స్.? ఏంటా రగడా.?
ఉమ్మడి విశాఖ జిల్లాలో పీలా ఫ్యామిలీ టీడీపీకి నమ్మిన బంటు వంటిది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీనే నమ్ముకుని రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. పీలా మహలక్ష్మీ నాయుడు దగ్గరి నుంచి టీడీపీ అధిష్టానం కూడా ఆ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తోంది. విశాఖ జిల్లాలో గవర సామాజికవర్గం నుంచి అత్యంత బలమైన నాయకత్వంగా ఉన్నారు పీలా ఫ్యామిలీ. మహలక్ష్మీ నాయుడు తర్వాత ఆయన కుమారులు రాజకీయాల్లోకి వచ్చారు. వ్యాపార వ్యవహారాలు సాగిస్తూ పాలిటిక్స్‌లో యాక్టీవ్‌గా ఉంటున్నారు. పీలా శ్రీనివాసరావు ప్రస్తుతం గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ మేయర్‌గా ఉన్నారు. పీలా గోవింద్ అనకాపల్లి ఎమ్మెల్యేగా గతంలో పని చేసి ప్రస్తుతం అర్బన్ ఫైనాన్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోస్ట్‌లో కొనసాగుతున్నారు.
అయితే విశాఖ పాలిటిక్స్‌లో పీలా బ్రదర్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయారు. క్యాడర్ మీద, కిందిస్థాయి నేతలపై చిర్రుబుర్రులాడుతూ..పెద్ద పెద్ద బహిరంగ వేదికలపై రచ్చ చేస్తూ టాక్ ఆఫ్ ది కాంట్రవర్సీగా ఉంటున్నారట. ఈ మధ్యే హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. ఆమె తిరుగు ప్రయాణమైన సమయంలో తన అనుచరులుతో కలిసి అనితతో మాట్లాడేందుకు పీలా గోవింద్ ప్రయత్నాలు చేశారు. అయితే తన బిజీ షెడ్యూల్ కారణంగా పీలా గోవింద్‌ను గమనించకుండా హోంమంత్రి కారెక్కి వెళ్లిపోయారు.
తాను పిలిచినా సరే కనీసం ఖాతరు చేయకుండా కారెక్కి వెళ్లిపోవడమేంటని పీలా గోవింద్ హోంమంత్రి అనితకు నేరుగా ఫోన్ కాల్ చేశారు. తన క్యాడర్ ముందు స్పీకర్ పెట్టి మాట్లాడారు. తాను మాజీ ఎమ్మెల్యేనని, లెక్క చేయకుండా వెళ్లిపోవడం ఏంటని రుసరుసలాడారు. దీంతో అనిత పరిస్థితిని వివరించి సర్ధి చెప్పుకోవాల్సి వచ్చింది. తన అనుచరుల ముందు తనకు అవమానం జరిగిందంటూ పీలా గోవింద్ నానా యాగీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇగో విషయంలో సోదరుడు పీలా గోవింద్‌కు తానేం తక్కువ కాదంటూ మేయర్ పీలా శ్రీనివాసరావు కూడా రెచ్చిపోయారు. విశాఖ ఉత్సవ్ ప్రారంభోత్సవ వేడుకలకు రాష్ట్ర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే ప్రారంభోత్సవ సమయంలో వేదికపై సీట్ల సర్దుబాటులో భాగంగా కలెక్టర్ హరేందిర ప్రసాద్..జోక్యం చేసుకుని మేయర్ పీలా శ్రీనివాసరావును మరో చోటకు మారాలని సూచించారు. అంతే వెంటనే మేయర్ ఒంటికాలిపై లేచి కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ మేయర్ అంటే కనీసం గౌరవం లేదా.? నన్నే సీటు మారమంటారా.? ప్రొటోకాల్ తెలియదా.? నీ సంగతి చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ సర్ధి చెప్పబోయినా సరే పీలా శ్రీనివాసారవు ఏమాత్రం పట్టించుకోలేదు. వేదికపై నుంచి కిందకు వెళ్లిపోయారు. ఉత్సవ్ ఓపెనింగ్‌కు వచ్చిన ప్రజలు, అటు ప్రజాప్రతినిధులు మేయర్ గారి దూకుడును చూసి విస్తుపోయారట.
పీలా సోదరులు ఇలా చిందులేయడం ఇదేం కొత్త కాదంట. ఎన్నికల టైమ్‌లో టీడీపీ అధిష్టానం అనకాపల్లి ఎమ్మెల్యే సీటును జనసేనకు కేటాయించడంతో అప్పటి టికెట్ ఆశావహుడు పీలా గోవింద్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదంటున్నారు. ఏకంగా చంద్రబాబును వ్యతిరేకిస్తూ తన క్యాడర్‌ను రంగంలోకి దించి దిష్టిబొమ్మలు తగులపెట్టడం, ఫ్లెక్సీలు చించడం, చంద్రబాబు, లోకేశ్‌పై దూషణలకు దిగారంటూ గుర్తు చేస్తున్నారు.
అలాగే పీలా శ్రీనివాసరావు కూడా గత కార్పొరేషన్ ఎన్నికలకు ముందు పలువురు కార్పొరేటర్లకు ఫండింగ్ చేసి చీటికి మాటికి రెచ్చిపోయేవారట. అప్పట్లో పార్టీ పరిస్థితుల దృష్ట్యా నేతలంతా సర్ధుకుపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా సరే పీలా సోదరులు ఏ మాత్రం మారడం లేదని తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారట. చీటికి..మాటికి అలక పాన్పు ఎక్కడం.. లేకుంటే, సహనం కొల్పోయి, కోపంతో పక్కవారిపై అరవడం వీళ్లకు అలవాటుగా మారిందని గుసగుసలు పెట్టుకుంటున్నారట.
తండ్రి మహలక్ష్మీ నాయుడు పార్టీకి వీర విధేయుడని..కుమారులకు అవకాశాలు ఇస్తే ఇలా రోడ్ల మీద వీరంగం వేసి పార్టీని బజారుకు ఈడుస్తున్నారని మండిపడుతున్నారు పలువురు తెలుగు తమ్ముళ్లు. ఈ అన్నదమ్ముల వ్యవహార తీరు ఎప్పుడు మారుతుందో..తమకు ఎప్పుడు ఈ తలపోటు తప్పుతుందోనని రగిలిపోతున్నారట టీడీపీ లీడర్లు.
Also Read: ఇలాంటివి ఉండకూడదని పవన్ అన్న కూడా చెబుతున్నారు: నారా లోకేశ్