Pawan Kalyan – Telangana Politics: టార్గెట్ తెలంగాణ..! తెలంగాణ రాజకీయాలపై పవన్ దృష్టి సారించారా? జూన్ 2న ఎలాంటి ప్రకటన చేయనున్నారు?

స్థానిక ఎన్నికలు.. జీహెచ్‌ఎంసీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొనే.. మే 10న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభ జరిగిందనే టాక్ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని తెలంగాణలో యాక్టివ్‌గా చేయడం ద్వారా.. బీజేపీ జనసేన టీడీపీ బంధానికి కొత్త రూపు తీసుకురావాలని పవన్ ప్రయత్నిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయ్‌.

  • Updated on- May 30, 2026 / 08:23 PM IST
  • తెలంగాణపై జనసేనాని ప్రత్యేక దృష్టి..
  • జూన్ 2న హైదరాబాద్‌లో కీలక సమావేశం
  • తెలంగాణలో రాజకీయంపై స్పష్టత ఇచ్చే చాన్స్‌!
  • టీడీపీ, బీజేపీతో కలిసి పార్టీ బలోపేతంపై ఫోకస్!
  • పవన్‌ సమావేశంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి..

Pawan Kalyan – Telangana Politics: తెలంగాణ రాజకీయాలపై పవన్ దృష్టి సారించారా.. గ్రేటర్‌తో పాటు 2028 ఎన్నికలే టార్గెట్‌గా ముందుకు వెళ్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున.. హైదరాబాద్‌లో పవన్ కీలక సమావేశం నిర్వహించడమే ఇందుకు నిదర్శనం అనే చర్చ నడుస్తోంది. మీటింగ్‌లో ఆయన కీలక నిర్ణయాలు ప్రకటించబోతున్నారా.. సరికొత్త రాజకీయ సమీకరణాలను తెరమీదకు తీసుకురాబోతున్నారా.. టీడీపీ, బీజేపీతో కలిసి వెళ్లబోతున్నారా.. లేదంటే సొంతంగా ప్రయత్నం చేస్తారా.. మీటింగ్ వేదికగా పవన్ ప్రకటనలు ఎలా ఉండబోతున్నాయ్‌..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. జూన్ 2న హైదరాబాద్‌లో జరగనున్న జనసేన పార్టీ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో అధికార కూటమిలో కీలకంగా ఉన్న జనసేన.. తెలంగాణలోనూ సంస్థాగత విస్తరణపై దృష్టి సారిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయ్‌. కొన్నేళ్లుగా ఆ పార్టీ ఏపీ రాజకీయాలకే పరిమితం అయినా.. 2024లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయ్‌. దీంతో తెలంగాణలో పార్టీకి కొత్త జీవం పోయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నారు. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు.. 2028 అసెంబ్లీ ఎన్నికల కోసం కేడర్‌ను స్ట్రాంగ్ చేయాలనే ఆలోచన జనసేన నాయకత్వంలో కనిపిస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో జనసేన పాత్ర ఏంటి..

హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమావేశానికి.. జనసేన రాష్ట్ర స్థాయి నాయకులు, కీలక కార్యకర్తలు, యువజన విభాగ ప్రతినిధులు హాజరు కానున్నారు. తెలంగాణలో పార్టీ నిర్మాణం, జిల్లా స్థాయి కమిటీల బలోపేతం, యువతను ఆకర్షించే కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరి లాంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీలో అధికార బాధ్యతలతో పాటు.. తెలంగాణ రాజకీయాల్లో జనసేన పాత్ర ఏంటి.. భవిష్యత్‌లో పార్టీ ఎలా ముందుకు సాగాలి.. టీడీపీ, బీజేపీతో సమన్వయం ఏ స్థాయిలో ఉండాలి అనే అంశాలపై పవన్ స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయ్‌.

బీజేపీ, జనసేన, టీడీపీ బంధానికి కొత్త రూపు..

హైదరాబాద్‌ బీజేపీ సభకు వచ్చినప్పుడు ఇంటికి వెళ్లి మరీ పవన్‌ను కలిసి పరామర్శించారు మోదీ. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి సమావేశం అయ్యారు. అటు పవన్‌తో.. ఇటు చంద్రబాబుతో మీటింగ్‌లో.. అభివృద్ధి అంశాల మీదే చర్చ జరిగిందనే ప్రచారం జరిగినా.. అంతకుమించి అనే చర్చ మొదలైంది. ఏపీతో పాటు తెలంగాణ రాజకీయ సమీకరణాలపై ముగ్గురి మధ్య చర్చ జరిగి ఉండొచ్చనే విశ్లేషణలు వినిపించాయ్‌. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ.. తన బలాన్ని పెంచుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు.. పట్టణ ప్రాంతాల్లో పార్టీని స్ట్రాంగ్‌ చేయడంపై కమలనాథులు సీరియస్‌గా దృష్టి సారించారు.

స్థానిక ఎన్నికలు.. జీహెచ్‌ఎంసీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొనే.. మే 10న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభ జరిగిందనే టాక్ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని తెలంగాణలో యాక్టివ్‌గా చేయడం ద్వారా.. బీజేపీ జనసేన టీడీపీ బంధానికి కొత్త రూపు తీసుకురావాలని పవన్ ప్రయత్నిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయ్‌. ముఖ్యంగా హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ లాంటి ప్రాంతాల్లో.. ఆంధ్రా మూలాలున్న ఓటర్లు, యువత, సినీ అభిమానులను ఆకర్షించే సామర్థ్యం పవన్ కు ఉందని కూటమి వర్గాలు అంచనా వేస్తున్నాయ్‌.

రెండు రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేయాలనే సంకల్పం..

జూన్‌ 2.. తెలంగాణ జనాలకు ఎమోషనల్ డే. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సమావేశాన్ని నిర్వహించడం ద్వారా.. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని గౌరవిస్తున్నామనే సందేశాన్ని జనసేన ఇవ్వాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపీకే పరిమితం కాకుండా.. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేయాలనే సంకల్పాన్ని ఈ వేదిక ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. ఇది కేవలం పార్టీ కార్యకర్తల సమావేశమే కాకుండా.. తెలంగాణలో జనసేన భవిష్యత్ పాత్రపై దిశా నిర్దేశం చేసే వేదికగా మార్చుకునే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణలో స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలా.. టీడీపీ, బీజేపీతో వ్యూహాత్మక సమన్వయంతో ముందుకు వెళ్లాలా అనే అంశాలపై.. నేతలకు, కార్యకర్తలకు పవన్‌ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జరగనున్న సమావేశం.. తెలంగాణలో జనసేన పార్టీ కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభించే ప్రయత్నంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.