Rain Alert : ఏపీకి రెడ్ అలర్ట్.. రాబోయే కొద్ది గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ..
Rain Alert : ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే కొద్ది గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
AP Weather
Rain Alert : ఏపీలో ఒకవైపు భానుడు నిప్పుల వర్షం కురిపిస్తుండగా.. మరోవైపు వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత కొద్దిరోజులుగా ఏపీలో భిన్నవాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ (శనివారం) కూడా పలు జిల్లాల్లో 45డిగ్రీల నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అదే సమయంలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతోపాటు.. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : Andhra Pradesh : ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. కళాశాలల పున:ప్రారంభం తేదీలో మార్పు
ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే కొద్ది గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. గంటలకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ సమీపంలో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. రైతులు, మత్స్యకారులు, ప్రయాణికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వర్షం, ఈదురుగాలుల నేపథ్యంలో విద్యుత్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఉత్తరాంధ్ర ప్రజలు వాతావరణ హెచ్చరికలను నిరంతరం గమనించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఇవాళ (శనివారం) పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అయితే, ఆదివారం నుండి ఉష్ణోగ్రతలు స్వల్పగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
🔴 రెడ్ అలెర్ట్
రాగల మూడు గంటల్లో 🔴 శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గంటకు 50 నుండి 60 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. pic.twitter.com/iilOTMPS5w
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 29, 2026
