Gossip Garage Rozole Ex Mla Rapaka Varaprasad (Photo Credit : Google)
Gossip Garage : పార్టీ ఆదరించింది. టికెట్ ఇచ్చి..గెలిపించింది కూడా. ఆయనే హ్యాండిచ్చి వెళ్లిపోయారు. ఉండలేక వైసీపీ చంకన చేరారు. సరే ఐదేళ్లు ఎలాగోలా నడిచిపోయింది. ఎంపీగా పోటీ చేస్తే ఓటమి గతి పట్టింది. అయ్యగారి పరిస్థితి ఇప్పుడు అయోమయంలో పడింది. మళ్లీ సొంత పార్టీకి వెళ్దామా అంటే నో ఎంట్రీ బోర్డు పెట్టేసినట్లే కనిపిస్తోంది. పోనీ సైకిల్ ఎక్కుదామంటే సేనానిని కాదని చేర్చుకుంటారా అని డౌట్ ఉందట. ఇంతకీ రాపాక రాజకీయ ప్రయాణం ఎటువైపు.?
కేవలం తనపై నమ్మకంతోనే రాజోలు ప్రజలు గెలిపించారని కామెంట్..
ఒకప్పుడు జనసేనకు ఆయన ఒకే ఒక ఎమ్మెల్యే. పార్టీ అధ్యక్షుడే ఓడినా గెలిచిన సీటు ఆయనది. దాంతో అతడు పార్టీతోనే ఉంటాడు. అసెంబ్లీలో తమ వాయిస్ వినిపిస్తాడనుకున్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. కానీ రాపాక వరప్రసాద్ రూట్ మార్చారు. 2019లో ఎన్నికల ఫలితాలు వచ్చాక కొన్ని రోజులకే ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. అప్పుడు అధికార పార్టీగా ఉన్న ఫ్యాన్ పార్టీతో సన్నిహితంగా మెలిగారు. అంతేకాదు రాజోలులో జనసేన పార్టీ తనను గెలిపించలేదని..కేవలం తనపై నమ్మకంతోనే ప్రజలు గెలిపించారని చెప్పుకొచ్చారు.
పొలిటికల్ ఫ్యూచర్‌పై పునరాలోచన..
అలా ఆయన ఎమ్మెల్యే టర్మ్ ముగిసింది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి రాజోలు నియోజకవర్గ వైసీపీ టికెట్ ఆశించారు రాపాక వరప్రసాద్. రాజకీయ పరిణామాల దృష్యా వైసీపీ అధిష్టానం ఆయనను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా..అమలాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఆయన ఓడిపోయారు. ఇప్పుడు పొలిటికల్ ఫ్యూచర్‌పై రాపాక పునరాలోచనలో పడ్డట్లు కనిపిస్తోంది. ఏదో ఒక పార్టీలో చేరి యాక్టివ్ కావాలని అనుకుంటున్నారట. అంతలోనే రాజోలు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి సమావేశం జరుగుతుండగా అక్కడ ప్రత్యక్షమైయ్యారు రాపాక. ఎయిడెడ్ టీచర్ల సమస్య కోసం ఎమ్మెల్యేతో మాట్లాడటానికి వచ్చానంటూ చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో వైసీపీని వదిలేస్తున్నానని కూడా చెప్పారు. ఇప్పటికే ఫ్యాన్ పార్టీకి దూరంగా ఉన్నానని..ఏ పార్టీలో చేరతాననే దానిపై బంధువులు, మిత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు రాపాక.
అయితే రాపాకను ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదట. జనసేనలోకి తిరిగి వెళ్దామంటే చేర్చుకునే పరిస్థితి కనిపించట్లేదంటున్నారు. రాజోలులో నిర్వహించిన పలు సభల్లో రాపాకపై పలుమార్లు విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన నుంచి గెలిచి రాపాక పార్టీకి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. దాంతో ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశం లేదని రాజోలు జనసేన నేతలు అంటున్నారు.
రాపాక రాజకీయ ప్రయాణం ఎటువైపు?
అయితే టీడీపీలో చేరతారని వార్తలు వస్తున్నప్పటికీ పవన్ కల్యాణ్ సుముఖం లేకుండా ఆ పార్టీ తీసుకునే అవకాశం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. బీజేపీకి వెళ్తారని అంటున్నా..అందులో నిజం లేదని రాపాకే చెప్తున్నారు. అలాంటప్పుడు రాపాక రాజకీయ ప్రయాణం ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది. ఇటు టీడీపీ అటు జనసేన రెండు పార్టీల్లో చేరే అవకాశం లేకపోవడంతో రాపాక దారెటో క్లారిటీ లేదు. కూటమిలో ఉన్న మూడు పార్టీల్లో జాయిన్ అయ్యే సిచ్యువేషన్ లేదు. వైసీపీకి రాజీనామా చేశానంటున్నారు. మరీ ఏం పార్టీలోకి వెళ్తారో.. ఆయన రాజకీయం ప్రయాణం ఎటువైపో ఆ దేవుడే తేల్చాలి.
Also Read : ఏనుగు మీద విసిరిన బాణం రివర్స్ కొట్టిందా? పరేషాన్‌లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి..!