Eluru Mayor: ఏలూరు మేయర్ పీఠం ఎవరికి? టీడీపీ, జనసేన నుంచి రేసులో ఉన్నదెవరు?

నగరంలో ఎన్నో సమస్యలు..పదేళ్లుగా మేయర్‌గా కొనసాగుతున్న షేక్ నూర్జహాన్ పెదబాబు నగర అభివృద్ధిని పక్కనపెట్టి సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికే సరిపోతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

  • Published on- May 7, 2026 / 11:06 PM IST

Eluru Mayor: పదేళ్లుగా ఆమెనే మేయర్. పార్టీ ఏదైనా..పవర్‌లో ఎవరున్నా సీటు మాత్రం మేడమ్‌ గారిదే. మరో రెండు నెలలు అయితే ఆమె పదవీకాలం పూర్తి కానుంది. ముచ్చటగా మూడోసారి మేయర్‌ పీఠంలో కొనసాగేందుకు ఆమె ప్రయత్నం చేస్తుంటే..కూటమి పార్టీలు కూడా హోప్స్ పెట్టుకున్నాయట. పవర్‌లో ఉన్నాం..మేయర్ పీఠం తమ పార్టీ కోసం పని చేస్తున్న నేతలకు ఇచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సారి ఏలూరు మేయర్ పీఠం ఎవరికి.? టీడీపీ, జనసేన నుంచి రేసులో ఉన్నదెవరు.? సిట్టింగ్‌ మేయర్‌కు మళ్లీ అవకాశం దక్కే ఛాన్సుందా.?

ఏలూరు మేయర్ కుర్చీపై అప్పుడే చర్చ మొదలైంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో పాటు..ప్రస్తుత పాలకు వర్గం గడువు మరో రెండు నెలల్లో ముగియనుంది. దీంతో ఈ సారి ఏలూరు మేయర్ పీఠంపై ఎవరు కూర్చుంటారోనన్న చర్చ మొదలైంది. పదేళ్లుగా ఏలూరు నగర రాజకీయాలను శాసిస్తున్న మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎం.ఆర్. పెదబాబు మూడోసారి కుర్చీ కోసం ఎత్తులు వేస్తున్నారట. 2014లో మొదటిసారి టీడీపీ తరఫున మేయర్‌గా ఎన్నికైన నూర్జహాన్‌, 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే అటువైపు దూకారు. మళ్లీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో తన భర్తతో కలిసి తిరిగి సైకిల్ ఎక్కారు. ఈ పార్టీ మార్పు నగరాభివృద్ధి కోసమే అని చెప్తూ వచ్చినా..స్వయం అభివృద్ధి ఎక్కువే ఉందన్న విమర్శలు ఉన్నాయి.

పదేళ్లలో ఏలూరు నగరం పేరుకే మున్సిపల్ కార్పొరేషన్ తప్ప మౌలిక వసతుల్లో మాత్రం వెనకబడే ఉందంటున్నారు పబ్లిక్. నగరంలో ఎన్నో సమస్యలు..పదేళ్లుగా మేయర్‌గా కొనసాగుతున్న షేక్ నూర్జహాన్ పెదబాబు నగర అభివృద్ధిని పక్కనపెట్టి సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికే సరిపోతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మేయర్ పదవిని అడ్డం పెట్టుకుని నూర్జహాన్ భర్త పెదబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఏలూరు నలుమూలలా విస్తరించారనేది మెయిన్ అలిగేషన్. ఏలూరు డెవలప్‌మెంట్‌ మాస్టర్ ప్లాన్‌ను..మేయర్ భర్త వెంచర్లకు అనుకూలంగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ రోడ్డు వేస్తే భూముల రేట్లు పెరుగుతాయో చూసి అక్కడ నిధులు కేటాయిస్తారనే అలిగేషన్స్ చక్కర్లు కొడుతున్నాయి.

మేయర్ పీఠం కూటమిలో ఏ పార్టీకి దక్కబోతోంది?

రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఈజీగా అనుమతులు పొందడానికి, ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికే మేయర్ దంపతులు..ప్రతి ఐదేళ్లకోసారి పార్టీ కండువా మారుస్తుంటారని టాక్ చర్చనీయాంశంగా ఉంది. అయితే వచ్చే మూడు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో కూటమిలో మేయర్ పీఠంపై సెగ మొదలైంది. ఏలూరు నగరపాలక సంస్థలో ప్రస్తుతం 50 డివిజన్లు ఉన్నాయి. మరో 12 పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీంతో మొత్తం వార్డుల సంఖ్య 62కి చేరనుంది. ఈ సారి కార్పొరేటర్ల సంఖ్యతో పాటు నగర పరిధి కూడా పెరగడంతో ఎవరికి అనుకూలం..ఎవరికి వ్యతిరేకం.? అన్న చర్చ మొదలైంది. మేయర్ పీఠం కూటమిలో ఏ పార్టీకి దక్కబోతోందనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ప్రతిపక్షంలో ఉండి కష్టపడిన తమను కాదని, మళ్లీ పచ్చ కండువా కప్పుకున్న నూర్జహాన్ దంపతులకే ప్రాధాన్యం ఇస్తే ఊరుకునేది లేదని సీనియర్ నేతలు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇతర కూటమి నేతలు మాత్రం మేయర్ కుర్చీపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పుకొస్తున్నారు. ఈ సారి మేయర్ పీఠం తమకే కావాలని జనసేన గట్టిగా పట్టుబడుతోంది. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తోంది. ముచ్చటగా మూడోసారి మేయర్ కుర్చీ కోసం నూర్జహాన్ దంపతులు వేస్తున్న ఎత్తుగడలకు కూటమి నేతలు అడ్డుకట్ట వేస్తారా? లేక కుమ్ములాటలతో అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారో చూడాలి.

Also Read: అన్నంత పని చేసిన చంద్రబాబు..! పిఠాపురం నుంచే ఆపరేషన్ స్టార్ట్..! తమ్ముళ్లకు ఓ హెచ్చరికనా?