Janasena: ఆ పార్టీ నుంచి గెలిచింది 21 మంది. అందులో ఉత్తరాంధ్ర నుంచి గెలిచిన ఆ ఇద్దరు సీనియర్ నేతలు. పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడ్డ నేతలు కాస్త..కూటమి ఊపులో ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ తర్వాతే వారిలో ఇంకో కోణం చూపిస్తున్నారట. వాళ్లిద్దరి నిర్వాకంతో ఇటు ప్రభుత్వానికి అటు జనసేన పార్టీకి చిక్కులు తప్పడం లేదట. ఇంతకు ఎవరా ఎమ్మెల్యేలు? ఏంటా స్టోరీ? వాళ్ల తీరు ఎందుకంత చర్చనీయాంశం అవుతోంది?
ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇద్దరు జనసేన ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా మొన్నటి ఎన్నికల్లోనే మొదటిసారి ఎమ్మెల్యేలయ్యారు. జనసేన పార్టీ నుంచే ఇద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తమకు ఎదురే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. అనకాపల్లి జిల్లాకు చెందిన యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, విశాఖ జిల్లా సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్..ఎమ్మెల్యేలు అయి రెండేళ్ల కానే కాలేదు..అప్పుడే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారట.
సెటిల్ మెంట్ల ఆరోపణలు, అధిష్టానం నుంచి అక్షింతలు మొదలైనట్లు టాక్. ఎలాంటి అనుభవం లేక ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అదుపు తప్పుతున్నారా.? లేక కావాలనే సమస్యలను కొని తెచ్చుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. అటు విజయ్‌కుమార్..ఇటు వంశీకృష్ణ శ్రీనివాస్ తీరుతో ఇటు కూటమి ప్రభుత్వానికి, అటు జనసేన పార్టీకి చిక్కులు, తలనొప్పి తప్పడం లేదట. ఈ ఇద్దరి ఎమ్మెల్యేల నిర్వాకం చూడలేక, బయటకు చెప్పుకోలేక అధికార యంత్రాంగం కూడా అల్లాడిపోతున్నట్లు టాక్.
యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పార్టీ ఆవిర్భావం నుంచి జనసేనలో ఉన్నారు. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయిన ఆయన..బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారని క్యాడర్ ఆశిస్తే..ఎమ్మెల్యే మాత్రం ఇది యాపారం అంటున్నారట. ఏడాదిన్నరలోనే అనేక ఆరోపణలను ఫేస్ చేస్తున్నారట. రియల్ ఎస్టేట్ సెటిల్ మెంట్లు, సెజ్‌లో కంపెనీల యజమాన్యాలకు ఇబ్బందులు వంటి అంశాల్లో విజయ్ కుమార్ కార్నర్ అవుతున్నారు. లేటెస్ట్‌గా అచ్యుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో వంద కోట్ల విలువైన 33 ఎకరాల భూ వివాదంలో ఎమ్మెల్యే తలదూర్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సెటిల్ మెంట్ కోసం డిమాండ్ చేశారని, అడ్వాన్స్ రూపంలో కొంత సొమ్ము తీసుకుని పరిష్కారం చేయకుండా పెండింగ్‌లో పెట్టారని బాధితులు రోడ్డెక్కుతున్నారు. మీడియా ముందుకు వచ్చి ఆధారాలు కూడా చూపుతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారంతోనే ఎమ్మెల్యే సుందరపు విజయ్ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నట్లు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇది చాలదన్నట్లుగా మిత్రపక్షం టీడీపీ క్యాడర్‌ను లెక్కచేయకపోవడం, ప్రభుత్వ కార్యక్రమం ఉంటే అంటీముట్లనట్లు వ్యవహరిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. ఈ వ్యవహారాలన్నీ డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ వరకు వెళ్లడంతో అనవసర విషయాల్లో తలదూర్చి పార్టీకి చెడ్డ పేరు తేవొద్దని సుందరపు విజయ్ కుమార్‌ను మందలించినట్లు టాక్.
ఇక జనసేన పార్టీకే చెందిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తీరు కూడా సేమ్ టు సేమ్ అంటున్నారు. ప్రజారాజ్యం వయా వైసీపీ నుంచి జనసేన వరకు రాజకీయాల్లో చాలా అనుభవం ఉంది. కానీ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వసూల్ రాజాగా మారారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనవసరమై అంశాల్లో తలదూర్చి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతున్నారన్న టాక్ బలంగా ఉంది. హోటల్స్‌లో పేకాట డెన్లు, ఆన్ లైన్ బెట్టింగ్ ఆర్గనైజర్స్‌కు వంశీ అండగా ఉంటున్నారని ఆరోపణలున్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ అపార్ట్‌మెంట్‌లో బెట్టింగ్ ముఠా పట్టుపడితే, నిందితులను ఎమ్మెల్యే కాపాడారని, ఆయా గ్యాంగ్స్ నుంచి ఎమ్మెల్యే వంశీకి నెలవారీ కమిషన్లు ముడుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఎమ్మెల్యే వంశీ కంటే ఆయన అనుచరగణం తెచ్చిపెడుతున్న సమస్యలే ఎక్కువగా ఉన్నాయట. నియోజకవర్గంలో ఎక్కడ బిల్డింగ్ కట్టాలన్నా..ఎన్ని అనుమతులున్నా సరే ఎమ్మెల్యే గ్యాంగ్ పర్మిషన్ ఉంటేనే జరగాలట. వారికి కప్పం కడితేనే పని జరుగుతుంది..లేకుంటే నిలిచిపోవడం ఖాయమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. విశాఖలో జైలు రోడ్డు దగ్గర ఉన్న ఫుడ్ కోర్టులో స్టాల్ పెట్టుకోవడానికి ఒక్కో వ్యాపారి నుంచి వంశీకృష్ణ అనుచరులు లక్షలాది రూపాయలు వసూలు చేశారనే ఆరోపణ ఉంది.
అయితే ఆ స్టాల్స్‌ను ఈ మధ్యే అధికారులు తొలగించడంతో బాధితులు ఎమ్మెల్యే వంశీని కార్నర్ చేస్తూ ఆందోళనలు చేశారు. ఇప్పటికీ ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఇలా వంశీకృష్ణ కూడా తొలిసారిగా ఎమ్మెల్యే అయిన ఏడాదిన్నరలోనే అలిగేషన్స్‌కు కేరాఫ్‌గా మారడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారాలన్నీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఇచ్చిన వార్నింగ్‌లు పనిచేస్తాయా..లేదంటే షరా మామూలేనా..అన్నది చూడాలి.
Also Read: ఇలా అయితే కష్టమే..! తప్పుకోండి..! పార్టీ నేతలపై జగన్ సీరియస్..! కారణం అదేనా..