Ys Jagan: ఇలా అయితే కష్టమే..! తప్పుకోండి..! పార్టీ నేతలపై జగన్ సీరియస్..! కారణం అదేనా..

పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టిన ఆయన.. ఏయే నియోజకవర్గాల్లో పరిస్థితులేంటి అని ఆరా తీస్తున్నారట.

Ys Jagan: ఇలా అయితే కష్టమే..! తప్పుకోండి..! పార్టీ నేతలపై జగన్ సీరియస్..! కారణం అదేనా..

Updated On : November 21, 2025 / 8:38 PM IST

Ys Jagan: ఇలా అయితే కష్టం. క్యాడర్‌ను గాలి వదిలేస్తే కుదరదు. ఇన్నాళ్లు వేరు. ఇప్పుడు యాక్టీవ్ కావాల్సిందే. నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందే. మీతో కాదంటే చెప్పండి..ఆల్టర్నేట్ చేసుకుంటా. ఇది వైసీపీ అధినేత జగన్‌..సొంత పార్టీ లీడర్లకు ఇచ్చిన స్మూత్‌ వార్నింగ్. ఎన్నికలు అయిపోయి 15 నెలలు దాటింది. మళ్లీ ఎన్నికలప్పుడే చేసుకుందాంలే అంటే అయ్యే పని కాదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండండి..క్యాడర్ కష్ట సుఖాలను పట్టించుకోండి అంటూ ఆదేశాలు ఇచ్చారట. అధినేత డైరెక్షన్స్ ప్రకారం నేతలు యాక్టీవ్ అయ్యేనా?

మళ్లీ గెలుస్తామనుకున్నామ్. బ్యాడ్‌ లక్ ఓడిపోయామ్. పవర్‌ పోయి 15 నెలలు అయిపోతోంది. ఇక యాక్టీవ్‌ కావాల్సిందే. స్పీడ్‌ పెంచాల్సిందే. లేకపోతే క్యాడర్, లీడర్లు నిరాశలో ఉంటున్నారు. తిరిగి మనం అధికారంలోకి రావాల్సిందే అంటూ..మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లకు హితబోధ చేశారట వైసీపీ అధినేత జగన్. పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టిన ఆయన..ఏయే నియోజకవర్గాల్లో పరిస్థితులేంటి అని ఆరా తీస్తున్నారట. ఈ క్రమంలో తమను నడిపించే నాయకుడు లేడని..నియోజకవర్గ ఇంచార్జ్‌ ఇటువైపే రావడం లేదని కార్యకర్తలు అధినేతకు ఫిర్యాదు చేశారట.

పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై సీరియస్‌..

ఈ క్రమంలోనే కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేని నియోజకవర్గ ఇంచార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేల తీరుపై జగన్ అసహనం వ్యక్తం చేశారట. ఇలా అయితే కుదరదు. ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారట. చాలా నియోజకవర్గాల్లో నేతలంతా మెల్లమెల్లగా యాక్టీవ్‌ అయినప్పటికీ..ఇంకా కొన్ని చోట్ల కొందరు నేతలు నియోజకవర్గాలకు అంటీముట్టనట్లుగా ఉండటం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై సీరియస్‌గా ఉన్నారట జగన్. కారణాలు ఏవైనా నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్న నేతలను జిల్లాల వారీగా తాడేపల్లికి పిలిపించారు వైఎస్ జగన్.

ముఖ్యంగా విదేశాల్లో ఉంటున్న వారిని, పైగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులో ఉంటూ అప్పుడప్పుడు నియోజకవర్గాలకు వచ్చి వెళ్తున్న నేతలకు పిలిచి గట్టిగా క్లాస్ తీసుకున్నారని టాక్. వ్యక్తిగత ఇబ్బందులు, వ్యాపారాలు ఏమున్నా పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉందని..ఇకపై యాక్టీవ్‌ అవ్వాలని ఆదేశించారట వైఎస్ జగన్.

ఇటీవల పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు ఎలా జరిగాయని ఆరా తీశారట జగన్. రిపోర్ట్ తెప్పించుకుని పార్టీ ఆదేశాల ప్రకారం ప్రొటెస్ట్‌లు జరగని నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారట. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 మందికి పైగా నేతలను ఆయా జిల్లాల అధ్యక్షులను, రీజనల్ కో ఆర్డినేటర్లను పిలిచి క్లాస్ తీసుకున్నారట జగన్. క్యాడర్ మాత్రమే పార్టీ కార్యక్రమాలు చేస్తే చాలదు మీరు ముందుండి నడిపించాలని సూచనలు చేశారట. వీరిలో సీనియర్ నేతలతో పాటు జూనియర్లు కూడా ఉన్నారు. తీరు మార్చుకోకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటానని కొందరికి తెగేసి చెప్పారట జగన్.

తప్పుకోండి అంటూ విదేశాల్లో ఉంటున్న వారికి వార్నింగ్..

ఇంట్రెస్ట్ లేకపోతే కొత్త వారికి అవకాశాలు ఇస్తాను తప్పుకోండి అంటూ విదేశాల్లో ఉంటున్న వారికి స్మూత్‌ వార్నింగ్ ఇచ్చారట జగన్. రానున్న రోజుల్లో నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇకపై ప్రతీ కార్యక్రమాన్ని సీరియస్‌ తీసుకుని పనిచేయాలని..క్లాస్ తీసుకున్నారట.

నియోజకవర్గాలకు దూరంగా ఉంటామంటే కొత్త వారిని చూసుకుంటానని కొందరు నేతల ముఖంపైనే జగన్ చెప్పేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. కొంతమంది తన నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యవహారాలను చక్కదిద్దాల్సింది పోయి పట్టనట్లు ఉంటుండంపై కూడా జగన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారట. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.. అమాత్యులుగా ఊరేగిన నేతలు..అపోజిషన్‌లోకి వచ్చేసరికి సైలెంట్‌ అయిపోవడంపై జగన్ ఏమాత్రం సంతృప్తిగా లేరని చెబుతున్నారు.

ఎక్కువ మంది నేతలు నియోజకవర్గాల్లో ఉండటం లేదని అధినేతకు ఫిర్యాదులు వెళ్లినట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఇబ్బంది పడుతుండటంతో..మాజీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లు క్యాడర్‌కు అందుబాటులో ఉండి..నిత్యం ప్రజల్లో తిరగాలని సూచించినట్లు తెలుస్తోంది. జగన్ వార్నింగ్‌తో అయినా పార్టీ కార్యక్రమాలను లైట్ తీసుకుంటున్న వారు యాక్టీవ్ అవుతారా? లేక ఎలక్షన్‌ మూమెంట్‌ వచ్చే వరకు ఇలాగే అంటీముట్టనట్లు వ్యవహరిస్తారా? అనేది చూడాలి.

Also Read: ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ