Gossip Garage Rushikonda Palace Files Missing (Photo Credit : Google)
Gossip Garage : రాజుగారి గది చుట్టూ రహస్యం వీడటం లేదు. వెబ్ సిరీస్‌లో ట్విస్టుల మాదిరిగా ఒక్కో ట్విస్ట్‌తో..సిత్రాల మీద సిత్రాలు వెలుగు చూస్తున్నాయి. రుషికొండ కట్టడాలపై ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. రత్నభండార్ రహస్యానికి మించి రుషికొండ భవనాలపై కొత్త కొత్త అప్డేట్స్ వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఆ రాజ భవనానికి సంబంధించిన కీలకమైన ఫైళ్లు మాయమవడం సెన్సేషన్ అవుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే ఫర్నీచర్ కూడా గాయబ్ అయినట్లు తెలుస్తోంది. రుషికొండ రహస్యం వీడేదెప్పుడు.? ఆ కట్టడాలు, ఫైళ్లు, ఫర్నీచర్ చుట్టూ నీలినీడలు ఎందుకు.?
రుషికొండ భవనాలకు సంబంధించిన ప్రతీ విషయం చర్చనీయాంశం..
అద్భుత కట్టడం చుట్టూ అంతులేని చర్చ కొలిక్కి రావడం లేదు. ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత కూడా..ఆ సౌధం చుట్టూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. రుషికొండ భవనాలకు సంబంధించిన ప్రతీ విషయం చర్చనీయాంశం అవుతోంది. అయితే ఇన్నాళ్లుగా ఆ భవనాలను దేని కోసం వాడుతారోనన్న చర్చ జరిగింది. కానీ ఇప్పుడు రుషికొండ నిర్మాణాల ఫైళ్లు, ఫర్నీచర్ లెక్కలు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయట. నిర్మాణ అనుమతుల ఫైళ్లు, కొన్ని కీలక పేపర్లు ఇప్పటికే కనిపించడం లేదంటున్నారు.
దాదాపు రూ.50 కోట్ల విలువైన ఏసీలు, ఫ్రిజ్‌లు, ఇతర సామాగ్రి ఏమైంది?
కొండపై గతంలో ఉన్న రిసార్టును కూలగొట్టేందుకు తీసుకున్న అనుమతుల ఫైళ్లు కూడా గయాబ్ అయినట్లు తెలుస్తోంది. పాత రిసార్టులో 80 గదులతో పాటు ఒక ఫంక్షన్ హాలు, బార్ అండ్ రెస్టారెంట్ ఉండేవి. వాటిల్లో ఉండాల్సిన దాదాపు రూ.50 కోట్ల విలువైన ఏసీలు, ఫ్రిజ్‌లు, ఇతర సామాగ్రి ఏమైందో తెలియక ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారట. పాత రిసార్టును కూలగొట్టినప్పుడు అప్పటి అధికారులు ఈ సామాగ్రిని ఏం చేశారో తెలిపే ఫైల్ అందుబాటులో లేదు. పాత రిసార్ట్ సామాగ్రి వివరాలతో ఒక ప్రత్యేక ఫైల్ ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ దగ్గర ఉంటే..ప్రభుత్వం మారిన తర్వాత అది మాయమైనట్లు తెలుస్తోంది.
రుషికొండ ధ్వంసం, కొత్త కట్టడాల నిర్మాణంలో వారిద్దరిదే కీలక పాత్ర..
నిబంధనల ప్రకారం రిసార్ట్‌ను తొలగించే సమయంలో అందులోని సామాగ్రిని ఇతర రిసార్ట్‌లకు పంపడం లేదా వాటికి తగిన ధరను నిర్ణయించి, టెండర్ ద్వారా బయట మార్కెట్‌లో అమ్మడం చేయాల్సి ఉంటుంది. రుషికొండ విషయంలో టూరిజం అధికారులు ఈ నిబంధనలేవీ పాటించలేదట. రుషికొండపై రిసార్ట్స్ తొలగించే సమయంలో ఈడీగా ఉన్న మల్‌రెడ్డి, ఈఈ రమణ తూతూమంత్రంగా ఫైల్ నడిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రుషికొండ ధ్వంసం, కొత్త కట్టడాల నిర్మాణంలో వీరిద్దరిదే కీలక పాత్ర. ఒక్క ఫైల్ కూడా కార్పొరేషన్‌కు వెళ్లకుండా..సెక్రటేరియట్ నుంచి చక్రం తిప్పారని ఆరోపణలున్నాయి.
డిప్యుటేషన్‌పై తెలంగాణ నుంచి ఏపీకి రాక..
రుషికొండ నిర్మాణాల వెనక కీలకంగా వ్యవహరించిన మల్‌రెడ్డి 2019లో డిప్యుటేషన్‌పై తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారు. అప్పట్లో ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసి మరీ ఆయనను రాష్ట్రానికి రప్పించారు. తిరిగి ఆయన తెలంగాణకు వెళ్లే సమయంలో కూడా ఇదే నిబంధనలు పాటించాలి. కానీ ఏపీటీడీసీ అధికారులు మాత్రం టూరిజం సెక్రటరీ అనుమతి లేకుండా, జీవో ఇవ్వకుండానే ఆయన్ను రిలీవ్ చేసేశారు. ఇప్పుడు ఆయన తెలంగాణలో రిపోర్టు చేసి రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్‌లో విధుల్లో చేరిపోయారు. రుషికొండ నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించిన మరో అధికారి రమణ. ఇరిగేషన్ నుంచి డిప్యుటేషన్‌పై ఏపీటీడీసీకి వచ్చారు. ఇలా రుషికొండ భవనాల నిర్మాణంలో కీలకంగా పనిచేసిన ఆ ఇద్దరు అధికారులను వివరణ కోరకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
ఇలా రుషికొండ సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కట్టడాలే పెద్ద వివాదాస్పదం అయితే అందులో వాడిన ఫర్నీచర్ చర్చనీయాంశం అవుతున్నాయి. రుషికొండ భవనాలకు వాడిన ప్రధాన ద్వారం తలుపు, కమోడ్, బాత్ టబ్‌లకు చేసిన ఖర్చు చూస్తే షాక్ కావాల్సిందే. మెయిన్ డోర్‌కు రూ.31 లక్షల 84వేలు ఖర్చు పెట్టగా… ఇతర తలుపులు ఒక్కోదానికి రూ.17లక్షల 93వేలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. అదే విధంగా బాత్ రూంలలోని ఒక్కో బాత్ టబ్‌కు పెట్టిన ఖర్చు రూ.12.38 లక్షలు కాగా.. వాష్ బేసిన్‌కు పెట్టిన ఖర్చు రూ.2.61 లక్షలని అంటున్నారు.
ఇదే సమయంలో కాన్ఫరెన్స్ టేబుల్ ఖర్చు దాదాపు రూ.25 లక్షలు కాగా..ఇంగ్లీష్ లెటర్ యూ ఆకారంలోని టేబుల్ ఖర్చు రూ.53.73 లక్షలని అంటున్నారు. ఖర్చు, రాజభవనానికి మించిన వసతుల సంగతి అలా ఉంచితే..రుషికొండ ఫైళ్లు మాయమవడం మాత్రం చర్చకు దారి తీసింది. కూటమి అధికారంలోకి వచ్చాక పైళ్లు కనిపించకపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. భవన నిర్మాణ అనుమతుల ఫైళ్లు, సైట్‌లో ఉన్న ఎన్ క్లోజర్స్ క్లియరెన్స్‌కు సంబంధించిన ఫైళ్లు కనిపించకపోవడంపై టూరిజం శాఖ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read : వైఎస్ షర్మిల, సునీతలపై అసభ్యకర పోస్టుల వెనకున్నది ఎవరో తెలిసిపోయిందా?