Gossip Garage : వైఎస్ షర్మిల, సునీతలపై అసభ్యకర పోస్టుల వెనకున్నది ఆ ఎంపీనేనా?

పోలీసులు చెప్తున్నట్లు.. కూటమి నేతలు ఆరోపిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టుల వెనక పెద్దల హస్తం ఉందా?

Gossip Garage : వైఎస్ షర్మిల, సునీతలపై అసభ్యకర పోస్టుల వెనకున్నది ఆ ఎంపీనేనా?

Updated On : November 12, 2024 / 11:38 PM IST

Gossip Garage : పవర్ పోయిన ఫ్రస్టేషన్‌లో రెచ్చిపోయారు. అధికారంలో ఉన్నప్పుడే కాదు.. అపోజిషన్‌లోకి వచ్చాక కూడా వాళ్ల అసభ్యకర పోస్టులకు అడ్డే లేకుండా పోయింది. ఆయన సైలెంట్ అయ్యారు..వాళ్ల క్యాడర్ డైలమాలో ఉన్నారు..ఇక మనల్ని ఎవడ్రా ఆపేది అనుకున్నారు. కానీ సార్ టైమ్ చూసి యాక్షన్ చేశారు. నీచమైన పోస్టులపై పాపాల పుట్ట బయటపడుతోంది. మీ కుటుంబ సభ్యుల మీద.. మీరు పెట్టిన పోస్టులు..మీ సోషల్ మీడియా బాగోతం అంటూ పెద్ద చేపలకే ఉచ్చు బిగిస్తోంది కూటమి సర్కార్. పెద్దల డైరెక్షన్‌లోనే ఇదంతా జరిగిందన్న ప్రచారంతో అలర్ట్ కావాల్సిన వారు అలర్ట్ అవుతున్నారు. అసభ్యకర పోస్టుల వెనక పెద్ద స్టోరీ ఉందా? ఆలోచన ఒకరిది..అమలు చేసేది మరొకరా? ఆమె కంప్లైంట్ ఇస్తే ఆయనను మూసేయడం ఖాయమేనా.?

ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియాను రౌండప్ చేసిన చంద్రబాబు..
పోనిలే అని ఊరుకుంటే రెచ్చిపోయారు. అధికారంలోకి వచ్చామ్..అడ్మినిస్ట్రేషనే ముఖ్యమని మేమనుకున్నామ్. మీరు నీచమైన పోస్టులనే నమ్ముకున్నారు. మేము ఫోకస్ చేస్తే ఎలా ఉంటుందో..ఇప్పుడు తెలిసిపోయిందా రాజా. యాక్షన్‌లోకి దిగాం..ఇక గిలగిల కొట్టుకుంటున్నారంటూ వైసీపీ సోషల్ మీడియాకు చుక్కలు చూపిస్తోంది ఏపీ సర్కార్. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియాక్షన్‌తో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెడితే తట్టుకోలేక యాక్షన్ తీసుకుంటున్నారన్న చర్చ జరిగింది. కానీ వైసీపీ కుటుంబసభ్యుల మీద పోస్టులు పెడితే కూడా ఊరుకోమంటూ చెప్తున్న చంద్రబాబు.. ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియాను రౌండప్ చేశారు. ప్రభుత్వం మీద పోస్టులు, కూటమి నేతల కుటుంబ సభ్యుల మీద అసభ్యకర ట్రోల్స్ ఒక ఎత్తు. మీ కుటుంబ సభ్యుల మీద..మీ ఇంటి ఆడపడుచుల మీద మీరు పెట్టిన పోస్టుల కథేంటని..పబ్లిక్ డొమైన్‌లో పెట్టి పిన్ టు పిన్ పాయింట్ ఔట్ చేస్తోంది కూటమి ప్రభుత్వం.

వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ తో చాలా విషయాలపై క్లారిటీ..
ఇప్పటికే పలువురు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. వాళ్లు ఇచ్చిన స్టేట్ మెంట్‌తో బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో క్లారిటీ వచ్చేసిందట. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్.. వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్‌తో చాలా విషయాలపై క్లారిటీ వచ్చిందట. ఆయన చెప్పిన వివరాలు కీలకంగా మారాయంటున్నారు పోలీసులు. వర్రా రవీంద్రారెడ్డి ఎంపీ అవినాశ్‌రెడ్డికి అనుచరుడిగా చెప్తున్నారు. అవినాశ్‌రెడ్డి పీఏ రాఘవతో వర్రా రవీందర్ చాట్ చేసినట్లు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాఘవ కోసం వేట కొనసాగుతోంది. ఏ సమయంలోనైనా బొక్కలో వేయడం ఖాయంగా కనిపిస్తోంది.

సునీత, షర్మిల మీద అసభ్య పోస్టుల వెనక అవినాశ్ రెడ్డి హస్తం?
వైఎస్ షర్మిల, వైఎస్ సునీత మీద అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్నారు రాఘవరెడ్డి. అవినాశ్‌రెడ్డి పీఏ రాఘవ రెడ్డి ద్వారా వర్రా రవీంద్రారెడ్డికి కంటెంట్ వస్తోందని అంటున్నారు పోలీసులు. వైఎస్ షర్మిల, సునీత రెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టాలని రాఘవ ద్వారా కంటెంట్ రావడంతో వర్రా పోస్టులు పెట్టాడని చెబుతున్నారు. కడప ఎంపీ అవినాశ్ ద్వారా రాఘవ తనకు సమాచారం ఇచ్చేవాడని వర్రా వాంగ్మూలం ఇచ్చాడంటున్నారు పోలీసులు. రాఘవ ఎంపీ అవినాశ్‌రెడ్డి పీఏ కావడంతో సునీత, షర్మిల మీద అసభ్య పోస్టుల వెనక అవినాశ్ రెడ్డి హస్తం ఉందనేది కూటమి నేతల ఆరోపణ. పోలీసులు కూడా ఇదే విషయం చెప్తున్నారు. సజ్జల భార్గవ్, అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలోనే బూతు పోస్టులు పెట్టారని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన వర్రా రవీంద్రారెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని అంటున్నారు. సునీత నుంచి ఫిర్యాదు వస్తే రాఘవరెడ్డిపై చర్యలు ఉంటాయని చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది.

సజ్జల భార్గవ్ ఆదేశాలతోనే పోస్టులు..!
సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్త మహ్మద్ ఖాజాబాబా అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఓ కేసు నమోదైంది. గుడివాడ పోలీసులు ఖాజాబాబాను అరెస్ట్ చేసి విచారిస్తే.. సజ్జల భార్గవ్ ఆదేశాలతోనే పోస్టులు పెట్టినట్లు చెప్పాడట. ఈ విషయాన్ని రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చిన పోలీసులు..భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెళ్లారు సజ్జల భార్గవ్.

వైసీపీ పెద్ద నేతలే టార్గెట్‌..
ఓవైపు ఎంపీ అవినాశ్‌రెడ్డి పీఏ చుట్టూ ఉచ్చు..మరోవైపు ఓ కేసులో డైరెక్టుగా సజ్జల భార్గవ్ పేరును నిందితుడిగా చేర్చడంతో.. వైసీపీ పెద్ద నేతల టార్గెట్‌గానే దర్యాప్తు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఫేక్‌ కంటెంట్‌ ఎక్కడి నుంచి వస్తోంది? కంటెంట్ ఇస్తున్నదెవరు? వాటిని ఎలా వైరల్ చేస్తున్నారు? ఇలా అన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సోషల్‌ మీడియా ప్రచారంలో ఫేక్ ప్రచారం వెనుక సజ్జల భార్గవ్‌ రెడ్డి, ఇంటూరి రవికిరణ్‌ కీలకంగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలిందంటున్నారు.

సోషల్‌ మీడియా పోస్టులపై ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పోలీసులకు వర్రా రవీంద్రారెడ్డి ఏం చెప్పారనే దానిపై వైసీపీ క్యాడర్, లీడర్లలో ఉత్కంఠ కొనసాగుతోంది. సేమ్‌టైమ్‌ అవినాశ్‌రెడ్డి పీఏ రాఘవ అరెస్ట్ తర్వాత సిచ్యువేషన్ ఎటువైపు టర్న్ తీసుకుంటుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. అంతేకాదు వైసీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్న సజ్జల భార్గవ్‌పై కేసు నమోదు కావడం.. కూడా ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియాను డైలమాలో పడేసింది. పోలీసుల దర్యాప్తు, కూటమి నేతల కామెంట్స్‌ను బట్టి చూస్తే సోషల్ మీడియాలో పోస్టులపై ఇంకా అరెస్టులుండే అవకాశం కనిపిస్తోంది.

అసభ్యకరంగా పోస్టులు పెట్టాలని చెప్పింది జగనే అన్న షర్మిల..
పోలీసులు చెప్తున్నట్లు.. కూటమి నేతలు ఆరోపిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టుల వెనక పెద్దల హస్తం ఉందా.? లేక సానుభూతిపరుల అత్యుత్సాహమా..? అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. తనను, సునీతను. అమ్మను ఎలా బడితే అలా మాట్లాడారని..అసభ్యకరంగా పోస్టులు పెట్టాలని చెప్పింది జగనేనని స్టేట్ మెంట్ ఇచ్చేశారు షర్మిల. జగన్ వద్దు అని చెప్పి ఉంటే ఇవి అప్పుడే ఆగేవన్న ఆమె.. వైసీపీ సోషల్ మీడియా ఒక సైతాన్ సైన్యంలా పని చేసిందన్నారు. ఇప్పుడు పట్టుబడిన వాళ్లంతా విషనాగులే కానీ.. వాళ్ళ వెనుక ఉన్న అనకొండను పట్టుకోవాలంటూ షర్మిల కామెంట్ చేయడం.. మరింత సంచలనం అవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా పోస్టుల లొల్లి ఏపీలో ఎంత వరకు వెళ్తుందోనన్న చర్చ జరుగుతోంది.

 

Also Read : ఆ 11 మందిని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి