ఆ 11 మందిని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
అసెంబ్లీలో జగన్ ముఖం ఎలా ఉంటుందో చూడాలనుకున్నానని ఎద్దేవా చేశారు.

Somireddy Chandra Mohan Reddy
ప్రజలు 11 మంది వైసీపీ నేతలను శాసన సభ్యులుగా గెలిపిస్తే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన 10టీవీతో మాట్లాడుతూ… ఆ 11 మందిని ఎందుకు గెలిపించామా అని ప్రజల బాధపడుతున్నారని చెప్పారు.
“శాసనసభ సెట్టింగ్ ని ఇంట్లో వేసుకొని సమావేశాలు నిర్వహించుకుంటారా? గతంలో తిరుపతి సెట్టింగ్ ని ఆయన ఇంట్లో వేసుకున్నారు. ఐదు సంవత్సరాలు మీడియా ముందుకు రాని ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోయారు. 10 శాతం మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ఆయనకు తెలియదా? 11 మంది సభ్యులు ఉంటే చేతులెత్తేశారు.
ఒకప్పుడు ఇద్దరు సభ్యులు ఉన్న బీజేపీ ఈరోజు దేశాన్ని పాలిస్తోంది. జగన్ కి ఎందుకంత అహంకారం? చట్టాలపై ఆయనకు నమ్మకం లేదు.. నిజంగా నేను బాధపడుతున్నాను.. అసెంబ్లీలో జగన్ ముఖం ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. జగన్ కి అవకాశం వస్తే ఓ నియంత. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఓ పిరికిపంద” అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.