AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతి.. వైసీపీ స్టాండ్ మార్చుకుందా? ఇప్పుడున్న నిర్ణయమే ఫైనలా?

ఈ గందరగోళానికి తెరపడాలంటే..ఏపీ భవిష్యత్ కోసమైనా..వైసీపీ రాజకీయంగా ఇంకా నష్టపోకూడదన్నా...ఈ కన్‌ఫ్యూజన్‌కు క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

AP Capital Amaravati: తొమ్మిదేళ్లుగా అదే చర్చ. రాజధాని చుట్టే ఏపీ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. ఇప్పటికీ అమరావతి సెంట్రిక్ గా అటు టీడీపీ..ఇటు వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే లేటెస్ట్‌గా అమరావతి రాజధాని విషయంలో వైసీపీ చేసిన కామెంట్సే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఏపీ క్యాపిటల్ అంశంపై ఫ్యాన్ పార్టీ స్టాండ్ మారిందా? ఇప్పుడున్న నిర్ణయమే ఫైనలా? అమరావతే రాజధాని అంటూనే మహానగరం అంటూ మెలికలు ఎందుకు పెడుతున్నట్లు?

ఐదు కోట్ల మంది ఆంధ్రుల కల. తమకంటూ ఓ రాజధాని ఉండాలనే ఆశ. అక్కడి నుంచే పాలన సాగాలనేది ప్రజల కోరిక. కానీ ఏపీ రాజధాని అంశం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న అంశంగా మారుతోంది. కూటమి సర్కార్ అమరావతిలో పనులు పరుగులు పెట్టిస్తోంది. మూడు రాజధానుల లైన్ ను ఎత్తుకున్న వైసీపీ ఘోర ఓటమి తర్వాత రాజధానిపై తమ స్టాండ్ ను మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు మూడు రాజధానులు ఆలోచన లేదని అంటున్నారు వైసీపీ నేతలు. తిరిగి అధికారంలోకి వస్తే జగన్ అమరావతి నుంచే పరిపాలన సాగిస్తారని అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే అమరావతే రాజధాని అంటూనే చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఖర్చు తగ్గించి ప్రభుత్వపై భారం తగ్గిస్తూ గుంటూరు, విజయవాడ మధ్య మహానగర నిర్మాణానికి కృషి చేస్తామని కొత్త మాటను తెరమీదకు తెచ్చారు.

మూడు రాజధానులను ప్రజలు వద్దన్నారని అందుకే తాము పునరాలోచిస్తున్నామంటున్నారు. అయితే లక్షల కోట్ల అప్పులు చేసి అమరావతి కట్టడానికి తాము వ్యతిరేకమని చెప్తున్నారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని నిర్మిస్తే రెండు నగరాలు బాగా డెవలప్ అయ్యేవని అంటున్నారు సజ్జల.

అమరావతి రైతులకు సజ్జల కామెంట్స్ తీపి కబురు అందించినట్లు అయింది. రాజధాని అంశమే వైసీపీకి గత ఎన్నికల్లో ఇబ్బందికరంగా మారింది. ఆ పార్టీ ఘోర ఓటమికి అదొక ప్రధాన కారణమన్న టాక్ ఉంది. దీంతో అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ మారినట్లు కనిపిస్తోంది. కానీ ఇదే ఫైనల్ డెసిషనా? మరింత క్లారిటీ ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు ప్రజలు.

రాజధాని నిర్మాణం ఎందుకు అని అనలేదు..!

ఆ మధ్య వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారని విమర్శించారు తప్ప రాజధాని నిర్మాణం ఎందుకని అనలేదు. అంతేకాదు విజయవాడ గుంటూరులను జంట నగరాలుగా చేయొచ్చని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు సజ్జల కామెంట్స్ జగన్ వ్యాఖ్యలకు దగ్గరగానే ఉన్నాయి. ఈ వాదనంతా ఓకే అయినా..ఇప్పటికైనా వైసీపీ తన వైఖరిని మార్చుకున్నట్లేనా అన్న చర్చ జరుగుతోంది.

అయితే అటు టీడీపీ, ఇటు వైసీపీ చెరో వాదనతో రాజధానిపై నీలినీడలు కంటిన్యూ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం రాజధాని పనులను పరుగులు పెట్టిస్తున్నా అమరావతికి ఇన్వెస్టర్లు రావడం లేదని..రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత తొందరగా ఈ సస్పెన్స్‌కు తెరపడితేనే బెటర్‌ అని అంటున్నారు.

ఇప్పుడు అమరావతిపై సజ్జల ఇచ్చిన క్లారిటీ బానే ఉన్నా..రాజధాని ప్రాంతం నీట మునిగిందని మొన్నటి దాకా వైసీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ మాటేంటన్న చర్చ జరుగుతోంది. ఆ మధ్య కురిసిన వర్షాలకు అమరావతి మొత్తం మునిగిపోయిందని..పెద్ద పెద్ద టవర్స్ కోసం తీసిన పునాదులన్నీ చెరువుల్లా మారాయని వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తాయి. అవన్నీ గ్రాఫిక్స్ అని, ఏఐ ఎడిటింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది.

నిర్మాణాలకు భారీ ఖర్చు ఎందుకు? వైసీపీ వాదనలో లాజిక్ లేదా..

సజ్జల చెప్తున్నట్లు అమరావతిపై వైసీపీ స్టాండ్ ఇదే అయితే గనుక వైసీపీ సోషల్ మీడియాలో ఎందుకు నెగెటివ్ ప్రచారం చేశారన్న డౌట్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. రాజధాని విషయంలో వైసీపీ స్టాండే టీడీపీకి మొన్నటి ఎన్నికల్లో అస్త్రంగా మారింది. మొండి పట్టుదలకు పోయే వైసీపీ నష్టపోయిందని సొంత పార్టీ నేతలే చర్చించుకున్న సందర్భాలున్నాయి. ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ మరింత స్పష్టత ఇచ్చేందుకు రెడీ అవుతోందట. అయితే అమరావతిలో నిర్మాణాలకు భారీగా ఖర్చు పెడుతున్నారన్న వైసీపీ వాదనలో లాజిక్ లేదన్న టాక్ వినిపిస్తోంది.

ఏ నిర్మాణాలు లేని చోట..రాబోయే వందేళ్ల కోసం ముందుచూపుతో బిల్డింగ్ లు నిర్మిస్తున్నప్పుడు పెద్దఎత్తున నిధులు వెచ్చించక తప్పదన్న చర్చ జరుగుతోంది. అయితే వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే జగన్ పాలన కొనసాగిస్తారని చెప్తున్నప్పటికీ..అమరావతిలో డెవలప్ మెంట్ కంటిన్యూ అవుతుందని మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదంటున్నారు.

గుంటూరు-విజయవాడ మధ్య మహా నగర నిర్మాణం అంటున్నారు. అంటే వైసీపీ పవర్‌లోకి వచ్చాక అక్కడ నిర్మాణాలు చేపడితే అమరావతిలో ఇప్పటి ప్రభుత్వం చేపట్టిన పనులన్నీ మధ్యలో నిలిపేస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలా అయితే రాజధాని కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ గందరగోళానికి తెరపడాలంటే..ఏపీ భవిష్యత్ కోసమైనా..వైసీపీ రాజకీయంగా ఇంకా నష్టపోకూడదన్నా…ఈ కన్‌ఫ్యూజన్‌కు క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.