పవన్ కల్యాణ్, లోకేశ్ హెచ్చరికలకు అర్థమేంటి? వైసీపీలో ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు?

ప్రత్యక్షంగా వాళ్ల పేరు ప్రస్తావించకపోయినా.. రెడ్‌బుక్ మళ్లీ ఓపెన్‌ చేస్తున్నామని.. ఎవరినీ వదిలేది లేదంటూ.. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా లోకేశ్‌ హెచ్చరికలు వినిపించాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.

Gossip Garage Pawan Kalyan Nara Lokesh Mass Warning (Photo Credit : Google)

Gossip Garage : రాజకీయాలందు.. ఏపీ రాజకీయం వేరయా అంటారు.. అక్కడి పాలిటిక్స్ తెలిసిన వాళ్లు! ఏపీ రాజకీయాలు చాలా సెన్సిటివ్. అలాంటిది ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ హెచ్చరికలు.. రాజకీయాన్ని మరింత షేక్ చేస్తున్నాయ్. మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని.. వేషాలేస్తే తొక్కి నార తీస్తామని పవన్ అంటుంటే.. రెడ్‌బుక్‌ లోడింగ్ అని లోకేశ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇద్దరు ఇలా గర్జించడం వెనక వ్యూహం ఉందా.. ఈ హెచ్చరికలు మిగిల్చిన ప్రశ్నలేంటి.

సడెన్‌గా ఇప్పుడెందుకు ఇంతలా గర్జించారు..
వేషాలేస్తే తొక్కి నారతీస్తామని పవన్ కల్యాణ్.. రెడ్‌బుక్‌ త్రీ పాయింట్ ఓ లోడింగ్ అంటూ లోకేశ్.. వైసీపీ నేతలకు ఇస్తున్న వార్నింగ్ లతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇద్దరి హెచ్చరికల వెనక అర్థమేంటని ఆరా తీసే పనిలో పడింది. రెడ్‌బుక్‌ సంగతి ఎలా ఉన్నా.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడెందుకు ఇలా గర్జించారు.. ఏం జరగబోతోందనేది హాట్‌టాపిక్‌ అవుతోంది. నిజానికి ఎన్నికల సమయంలో వైసీపీ టార్గెట్‌గా చాలా ఆరోపణలు గుప్పించారు పవన్. ఐతే అధికారంలోకి వచ్చిన తర్వాత మౌనంగానే ఉన్నారు. తను, తన పని అన్నట్లుగా కనిపించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తిచూపడం, తమ విజన్ ఏంటో చెప్పారు తప్పా.. వైసీపీని ఎప్పుడూ డైరెక్ట్‌గా టార్గెట్‌ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా మౌనాన్ని బ్రేక్ చేశారు. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

వైసీపీని పవన్ ఎందుకు టార్గెట్ చేశారు..
తాట తీస్తా.. నారా తీస్తా అంటూ.. ఎన్నికల ముందు జనసేనానిని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. 11 సీట్లు వచ్చినా ఇంకా నోళ్ళు లేస్తున్నాయనుకుంటే.. వాటిని ఎలా లేవకుండా చేయాలో తమకు తెలుసు అంటూ వైసీపీకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నామని.. అన్నీ ఒకేసారి అవాలంటే కుదరదని.. సోషల్ మీడియాలో వైసీపీ మళ్లీ దారుణమైన విమర్శలకు తెర తీసిందంటూ ఫైర్ అయ్యారు పవన్. యుద్ధాన్ని కోరుకుంటే తాను సిద్ధం అంటూ పవన్ ప్రకటించడం.. ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఈ స్థాయిలో వైసీపీని పవన్ ఎందుకు టార్గెట్ చేశారు.. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అంటూ ఏపీలో రకరకాల చర్చ జరుగుతోంది.

కొడాలి నాని, వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తారా..
వైసీపీకి పవన్ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తే.. రెడ్‌బుక్‌ త్రీ పాయింట్ ఓ లోడింగ్ అంటూ.. లోకేశ్ హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో ఇప్పటికే రెడ్‌బుక్‌లోకి రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని, త్వరలోనే మూడో చాప్టర్ తెరుస్తామని అన్నారు.. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మూడో చాప్టర్ ఓపెన్ కావాలంటే.. ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు చాలా కష్టపడాలని లోకేశ్ సూచించారు. అమెరికా వేదికగా ఆయన ఈ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కష్టపడాలని చెప్పారంటే.. కొడాలి నాని, వంశీని టార్గెట్ చేస్తారా అనే అనుమానాలు మొదలయ్యాయ్. ఐతే రెడ్‌బుక్‌ పేరుతో లోకేశ్ మైండ్ గేమ్ ఆడుతున్నారనే టాక్ వినిపిస్తున్నా.. మళ్లీ ఆ విషయాన్ని ఎందుకు తెరమీదకు తీసుకువచ్చారనేది హాట్‌ టాపిక్‌ అవుతోంది. వైసీపీకి.. పవన్, లోకేశ్ ఎలాంటి వార్నింగ్ ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

ఇద్దరి ఆవేశం వెనక కనిపిస్తున్నవి కామన్ కారణాలే !
ఇద్దరి ఆవేశం వెనక కనిపిస్తున్నవి కామన్ కారణాలే! గ్రౌండ్‌ లెవల్‌లో కేడర్ సంగతి ఎలా ఉన్నా.. సోషల్‌ మీడియాలో వైసీపీ వ్యవహారమే.. పవన్‌కు కోపం తెప్పించినట్లు కనిపిస్తోంది. నిజానికి పవన్ టార్గెట్‌గా సోషల్‌ మీడియాలో వైసీపీ శ్రేణులు చాలా టార్గెట్ చేస్తున్నాయ్‌. జరిగింది ఒకటయితే.. ఇంకోటి ప్రొజెక్ట్ చేస్తూ.. పవన్‌, జనసేనాని విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నాయనే టాక్ నడుస్తోంది. వీటన్నింటికి చెక్ పెట్టాలనే పవన్ ఈ స్థాయిలో ఫైర్ అయ్యారని తెలుస్తోంది. వేషాలు వేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చింది కూడా అందుకేనట. పవన్ మాటలతో అదే అర్థం అవుతుందన్న అర్థం అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

ఇక వైసీపీ హయాంలో తమను వేధించిన వైసీపీ నేతల విషయంలో మరింత కఠినంగా ఉండాలని తెలుగు తమ్ముళ్లలో చర్చ జరుగుతోంది. నాని, వంశీలాంటి విషయంలో ఇలాంటి డిమాండ్లు మరీ ఎక్కువ. ప్రత్యక్షంగా వాళ్ల పేరు ప్రస్తావించకపోయినా.. రెడ్‌బుక్ మళ్లీ ఓపెన్‌ చేస్తున్నామని.. ఎవరినీ వదిలేది లేదంటూ.. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా లోకేశ్‌ హెచ్చరికలు వినిపించాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. ఏమైనా అటు పవన్, ఇటు లోకేశ్ వార్నింగ్స్‌తో.. ఏపీ రాజకీయం నెక్ట్స్ లెవల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

 

Also Read : ఎమ్మెల్సీ ఎన్నికలపై మౌనంగా వైసీపీ.. ఆ భయమే కారణమా?