×
Ad

Ys Jagan: పొత్తులపై కూటమి పార్టీలు ఫిక్స్.. మరి వైసీపీ ప్లానేంటి? జగన్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది?

దాదాపు పదిహేనేళ్ల రాజకీయ ప్రయాణంలో సింగిల్‌గా..సో లైఫే సో బెటర్‌ అన్నట్లుగా ఫ్యాన్ పార్టీ ఒంటరి పోరు చేస్తూ వస్తోంది.

Ys Jagan: ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల టైమ్ ఉంది. కానీ రాబోయే ఎన్నికలపై ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది. కూటమి లాంగ్ లీవ్‌ అని చంద్రబాబు, పవన్ అంటున్నారు. ఆ ముగ్గురిది ఫెవికాల్ బంధమని వైసీపీ కూడా చెప్తోంది. మరి ఫ్యాన్ పార్టీ ముందున్న ఆప్షన్స్ ఏంటి? వైసీపీ సింగిల్‌గానే ఎన్నికల బరిలోకి దిగుతుందా? కామ్రేడ్స్‌తో కలిసి కదనరంగంలోకి దిగాలని జగన్ భావిస్తున్నారా? పొత్తులపై వైసీపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది?

ఏపీ రాజకీయం నెక్స్ట్‌ లెవల్‌ హీట్‌ను క్రియేట్ చేస్తోంది. రాబోయే ఎన్నికల కోసం కూటమి ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తోంది. అంతేకాదు తాము మళ్లీ కలిసే పోటీ చేస్తామని..పదిహేనేళ్ల పాటు కూటమిగానే ఉంటామంటున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అయితే కూటమి పార్టీలది విడదీయలేని బంధమని అంటున్నారు వైసీపీ మాజీమంత్రి జోగి రమేష్. ఆ మూడు పార్టీలది ఫెవికోల్‌ బంధం..వాళ్లు మళ్లీ కలిసే వస్తారు..తాము సింగిల్‌గానే పోటీ చేస్తామంటున్నారు.

కూటమి పార్టీలు కలిసి వచ్చినప్పుడు వాళ్లను ఓడిస్తేనే కిక్కు అంటున్నారు మరో మాజీమంత్రి పేర్నినాని. జనసేన, టీడీపీ, బీజేపీ మళ్లీ కలిసి వచ్చినా తమ స్ట్రాటజీ తమకు ఉందని..ఈసారి గెలిచేది వైసీపీయే అంటున్నారు. అయితే వైసీపీ నేతల ధైర్యం వెనుక అసలు కథ వేరే ఉందట. బాబు పవన్ కలిసి ఉండొచ్చు. వారి మధ్య మంచి బంధం ఏర్పడొచ్చు. కానీ కూటమి పార్టీల క్యాడర్ కలిసి లేదు..ఎన్నికల నాటికి ఇంకా గ్రూపు తగాదాలు పెరిగిపోతాయి..అవి తమకు కలిసి వస్తాయని లెక్కలు వేసుకుంటోందట వైసీపీ.

సింహం సింగిల్‌గానే వస్తుందని ఎన్నికల స్లోగన్‌..

అయితే దాదాపు పదిహేనేళ్ల రాజకీయ ప్రయాణంలో సింగిల్‌గా..సో లైఫే సో బెటర్‌ అన్నట్లుగా ఫ్యాన్ పార్టీ ఒంటరి పోరు చేస్తూ వస్తోంది. సింహం సింగిల్‌గానే వస్తుందని ఎన్నికల స్లోగన్‌గా మార్చేసింది వైసీపీ. పొత్తులు లేకుండా ఇన్నాళ్లు రాజకీయం చేస్తూ వచ్చిన వైసీపీ..మూడు ఎన్నికల్లో ఒక దాంట్లో మాత్రమే సక్సెస్ అయింది. ఇక రెండు సార్లు అంటే 2014లో చెప్పుకోదగ్గ సీట్లే వచ్చినా..2024లో అయితే వైసీపీ పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. ఓట్ల పరంగా చూస్తే 40 శాతం షేర్ ఉంది కానీ సీట్లు 11కు పడిపోయాయి. దాంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తిరేపుతోంది.

కూటమి పార్టీల ముందు వైసీపీ బలం సరిపోదనే గత ఎన్నికల్లోనే ప్రూవ్ అయింది. ఒకవేళ కూటమి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వస్తే తప్ప..వైసీపీ మ్యాజిక్‌ ఫిగర్ సీట్లకు దారిదాపుల్లోకి రావడం కూడా కష్టమేనన్న అంచనాలున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ ఆ మాత్రం సీట్లు సాధించడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. వైఎస్ఆర్ తనయుడిగా సానుభూతి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీకి షిఫ్ట్‌ అయినా 2014లో వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది. అప్పుడు కూటమి పార్టీలు ఉమ్మడిగానే పోటీ చేశాయి.

2019కి వచ్చే సరికి సీన్ మారిపోయింది. కూటమి వీడిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ సెపరేట్‌గా పోటీ చేశాయి. 2014లో ఓడిన తర్వాత జగన్‌ సింగల్‌గానే పోరు చేశారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి..మరోసారి వైఎస్‌ఆర్‌ను గుర్తు చేశారు. దాంతో 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచింది. కానీ రాబోయే ఎన్నికల్లో సీన్ వేరు. ఏపీ ప్రజలు అటు టీడీపీని..ఇటు వైసీపీ ఇద్దరి పాలనను చూశారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ కూడా పొత్తులకు వెళ్లక తప్పకపోవచ్చన్న అభిప్రాయాలు స్టార్ట్ అయ్యాయి.

కాంగ్రెస్ తో వైసీపీ కలిసి నడుస్తుందా?

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఉంది. కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర పార్టీలు విపక్ష రోల్ ప్లే చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలను కలుపుకుని పోయేందుకు వైసీపీ ఎంతవరకు మొగ్గు చూపుతుందన్నదే చర్చ. సీపీఎం అయితే వైసీపీ పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్‌తో ఉందన్న చర్చ ఉంది. వైసీపీతో పొత్తుపై సీపీఐ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. పైగా ఈ రెండు పార్టీలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నాయి. కాంగ్రెస్ లేకుండా వామపక్షాలు వైసీపీతో జత కట్టే పరిస్థితి ఉండదని అంటున్నారు. దాంతో కాంగ్రెస్‌ను దగ్గరకు తీసే విషయంలో వైసీపీ తన పొలిటికల్ స్టాండ్‌నే మార్చుకోవాల్సి రావొచ్చు.

ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళ సమయం ఉంది. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో..కాంగ్రెస్‌తో వైసీపీ కలిసి నడుస్తుందో లేదో చూడాలి. ఇప్పటికైతే సింగిల్‌గానే వస్తామ్ అనేది వైసీపీ లీడర్లు చెబుతున్న మాట. జగన్ లైన్‌ కూడా ఇదే అంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. దానికి వైసీపీ చెబుతున్న లాజిక్ ఒకటే. పార్టీలో ఎందరో లీడర్లు పనిచేస్తూ ఉన్నారు. వారికి అవకాశాలు తగ్గించి పొత్తుల పేరుతో వేరే పార్టీలకు టికెట్లు ఇవ్వడం..ఒకవేళ ఓడిపోతే ఎవరి మీదో నెపం నెట్టడం ఎందుకు. గెలుపైనా ఓటమైనా సింగిల్‌గానే వస్తామంటున్నారు ఫ్యాన్ పార్టీ అధినేత. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ ఇదే స్టాండ్ మీదుంటుందో..లేక పొత్తులకు ఆసక్తి చూపిస్తుందో వేచి చూడాలి.

Also Read: 6 కాదు రెండే? ఏపీలో కొత్త జిల్లాల ఎపిసోడ్‌లో మారిన ప్రభుత్వ వైఖరి?