Kadapa Tdp President: కడప జిల్లా అధ్యక్ష పదవి. ఇప్పుడీ పోస్ట్ తెలుగు తమ్ముళ్లలో తెగ టెన్షన్ పెడుతోంది. వైసీపీ కంచుకోటగా పేరున్న కడప జిల్లాలో టీడీపీ జెండా రెపరెపలాడింది. కడప అసెంబ్లీ సీటు గెల్చుకోవడమే కాదు..మహానాడును గ్రాండ్ సక్సెస్ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్‌లో ప్రభంజనం సృష్టించారు. ఇలా వరుస విజయాలు..అధినేత స్పెషల్ కాన్సంట్రేషన్‌తో కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి నెక్స్ట్ లెవల్ హైప్ క్రియేట్ అవుతోంది.
ఈ పోస్ట్ ఎవరు దక్కించుకున్నా జిల్లా మంత్రి అంత హోదాగా ఫీలవుతున్న పరిస్థితి. అయితే ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడిగా 11 ఏళ్లుగా శ్రీనివాసుల రెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన జిల్లా అధ్యక్ష రేసులో ఉన్నారు. కొనసాగింపు కోసం పార్టీ హైకమాండ్‌పై తీవ్ర ఒత్తిడి పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీకి సీట్లు రావడం, తన సతీమణి కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డిని గెలిపించుకోవడం వంటి విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో పాటు కడపలో నిర్మిస్తున్న జిల్లా పార్టీ ఆఫీస్ పూర్తయ్యే వరకూ తనకే అవకాశం కల్పించాలని కోరుతున్నారట శ్రీనివాసులురెడ్డి.
అయితే ఆయన ఇప్పటికే పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్‌గా ఉన్నారు. జోడు పదవులు ఉండటంతో ఆయనకు తిరిగి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా లేరా అన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే శ్రీనివాసులు రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగాలంటే..పొలిట్ బ్యూరో మెంబర్ పదవిని వదులుకోవాల్సి వస్తుంది. ఇది ఆయన నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది.
మరోవైపు గత ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోయిన జమ్మలమడుగు టీడీపీ ఇంచార్జ్ భూపేష్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. గతంలో ఓటమిపాలైన భూపేష్‌కు అవకాశం ఇస్తే మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు పరిచయాలు బలపడుతాయని లెక్కలు వేసుకుంటున్నారట. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలను కలుపుకుపోయే నేతగా భూపేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
యువనేత నారా లోకేశ్ జోడు పదవులు వదులుకోవాలని చెప్పిన మాట కూడా భూపేష్‌కు ఇబ్బందిగా మారే అవకాశం ఉందంటున్నారు. కడప జిల్లా అధ్యక్షుడిగా భూపేష్‌ను నియమిస్తే జమ్మలమడుగు నియోజకవర్గ బాధ్యతలు వదులుకోవాల్సి వస్తుందని అంటున్నారు. మరి జమ్మలమడుగు టీడీపీ ఇంచార్జ్ పదవిని వదులుకోవడానికి భూపేష్ సిద్దపడతారా లేదా అనేది చూడాల్సి ఉంది.
పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసులురెడ్డి, భూపేష్ రెడ్డి మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. ఇద్దరిలో ఒకరిని జిల్లా అధ్యక్ష పదవి ఖాయమంటున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాసులురెడ్డి, భూపేష్‌రెడ్డికి సీఎం చంద్రబాబు నుంచి పిలుపు వచ్చిందట. ఈ ఇద్దరు నేతలతో మాట్లాడి..ఎవరికో ఒకరికి అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని నేతలు చెబుతున్నారు. తొలి గడప సైకిల్ సారధి ఎవరో మరో మూడు నాలుగు రోజుల్లోనే క్లారిటీ రానుందని చెబుతున్నారు లీడర్లు.
Also Read: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త మలుపు.. నిందితుల్లో పెరిగిన గుబులు.. ఎందుకు..