Gossip Garage: జగన్ కంచుకోటను టార్గెట్ చేసిన బీజేపీ.. సీమలో పాగా అంత ఈజీనా? అసలు మాధవ్ వ్యూహమేంటి?

కూటమి పార్టీలన్నీ తమ బలాన్ని పెంచుకోవడానికి కడపనే పిచ్‌గా ఎంచుకుంటున్నాయి. బీజేపీ అయితే రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది.

Gossip Garage: కమలం పార్టీ కూటమిలో కీలకంగా ఉంది. కానీ ఒంటరిగా బలపడే ప్రయత్నం చేస్తోంది. అది కూడా వైసీపీ ఓటు బ్యాంకు లాగేసి..స్ట్రాంగ్ అవ్వాలనేది బీజేపీ నేతల వ్యూహం. అందుకోసం జగన్ ఇలాకా నుంచే కసరత్తు స్టార్ట్ చేస్తోంది. రాయలసీమలో ఈక్వేషన్స్ మార్చేయాలని స్కెచ్ గీస్తోంది. సీమలో కమలం పాగా వేయడం అంత ఈజీనా.? పీవీఎన్ మాధవ్ వ్యూహమేంటి.?

ఇప్పుడు కూటమిగా ఉన్నాం. టీడీపీ, జనసేనతో కలిసి ప్రభుత్వంలో కొనసాగుతున్నామ్. అయినా సరే సొంతంగా బలపడాలి. పొత్తు లేకున్నా మన బలం మనకు ఉండాలనే వ్యూహం రచిస్తోంది బీజేపీ. ఇప్పటికే గెలుపోటములను ప్రభావితం చేసే ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న కమలనాథులు..రాయలసీమలో సగానికి పైగా సీట్లు గెలుచుకునేందుకు ప్లాన్ వేస్తున్నారు.

ఆ రేంజ్‌లో విజ‌యం బీజేపీకి సాధ్యమేనా?
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్..ప్రెసిడెంట్‌ అయిన వెంటనే..జగన్ ఇలాకా కేంద్రంగా పార్టీ యాక్టివిటీ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీమ‌లో బీజేపీ స‌గానికి పైగా సీట్లలో విజ‌యం సాధిస్తుందనే స్లోగన్‌తో సీమలో పర్యటిస్తున్నారు మాధవ్. రాయ‌లసీమ జిల్లాల్లో మొత్తం 53 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో స‌గం అంటే.. 25 పైనే. మ‌రి ఆ రేంజ్‌లో విజ‌యం అంటే..బీజేపీకి సాధ్యమేనా.? అనేది ప్రశ్న.

మొన్నటి ఎన్నిక‌ల్లో జ‌మ్మల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. బీజేపీ ఎప్పుడు గెలిచినా.. టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమ‌వుతోంది. టీడీపీతో పొత్తు కాద‌ని..2019లో ఒంట‌రి పోరాటం చేసిన‌ప్పుడు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే పొత్తు ఉంటుంద‌ని చెబుతున్న నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ బీజేపీ అన్నో ఇన్నో సీట్లు గెలుచుకునే అవ‌కాశం ఉంటుంది. కానీ మాధ‌వ్ చెబుతున్నట్టుగా..సీమలో సగానికి పైగా సీట్లు అంటే కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే..సీమలో ఉన్నవే 53 సీట్లు. అందులో పొత్తులో బీజేపీకి 25 సీట్లు ఇచ్చేందుకు టీడీపీ ఒప్పుకోకపోవచ్చు. ఒక‌వేళ ఇచ్చినా..సీమ‌లో బీజేపీ పాగా వేయడం అంత ఈజీ కాదన్న టాక్ వినిపిస్తోంది

అయితే సీమ‌లో సగానికి పైగా సీట్లు అంటూ పీవీఎన్‌ మాధ‌వ్ ఎత్తుకున్న నినాదం..వైసీపీ టార్గెట్‌గానేనని చెప్తున్నారు. ఫ్యాన్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చి తమవైపు తిప్పుకోవాలనేది బీజేపీ వ్యూహమట. టీడీపీని డిస్ట్రబ్ చేయకుండా..తమ ఓటు బ్యాంకును పెంచుకోవాలనే ప్లాన్‌తో ముందుకెళ్తున్నారట. అందుకే ఆయన రాయలసీమ నుంచే సారధ్యం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారన్న చర్చ జరుగుతోంది.

తమ బలాన్ని పెంచుకోవడానికి కడపపైనే ఫోకస్..
జగన్‌కు, వైసీపీకి హార్డ్ కోర్ జిల్లా అయిన కడప నుంచి బీజేపీ యాక్టవిటీకి ప్లాన్ చేయడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ అయితే పార్టీ పుట్టాక గెలవని సీట్లను కూడా ఈసారి సాధించింది. దాంతో కూటమి పార్టీలన్నీ తమ బలాన్ని పెంచుకోవడానికి కడపనే పిచ్‌గా ఎంచుకుంటున్నాయి. బీజేపీ అయితే రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది. దాంతో వైసీపీ వర్సెస్ కూటమిగా రాయలసీమ రాజకీయం మారిపోయింది.

Also Read: టీడీపీ చరిత్రనే తిరగరాసేలా.. పెద్ద పెద్ద స్కీమ్స్ ఇంప్లిమెంట్.. సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం వెనుక ప్లానేంటి?

ఇక సీఎం చంద్రబాబు అయితే కడపలో పదికి పది అసెంబ్లీ సీట్లు గెలిచి తీరుతామంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో సీమలో రికార్డ్ స్థాయి సీట్లు సాధించిన కూటమి..జగన్‌ను, వైసీపీని అక్కడ కోలుకోకుండా చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ, బీజేపీ రెండూ సీమపై స్పెషల్ కాన్సంట్రేషన్ చేశాయి. టీడీపీది సీట్లు సాధించే ప్లాన్ అయితే..వైసీపీ ఓటు బ్యాంకు తమవైపు తిప్పుకోవాలనేది బీజేపీ స్కెచ్.

ఏదైనా ఫ్యాన్ పార్టీని ఇంకా వీక్ చేయాలనేది కూటమి ప్రణాళిక. అయితే రాయలసీమలోని 53 సీట్లలో వైసీపీ గెలుపు అవకాశాలను కట్టడి చేస్తే..ఫ్యాన్ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌కు దగ్గరకు రాకుండా అడ్డుకోవచ్చనేది టీడీపీ గేమ్. అందుకే బీజేపీని రాయలసీమలో యాక్టీవ్ చేస్తోంది. ముస్లిం, క్రిస్టియన్ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండే సీమలో..వైసీపీ ఓటు బ్యాంకుకు గండికొట్టే ప్లాన్ అయితే గట్టిగానే నడుస్తుందని చెప్పొచ్చు. టీడీపీ వ్యూహాలు..బీజేపీ స్కెచ్‌లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.